అంతే తెలియని చీకటి మహా సముద్రంలో
ఎప్పుడో ఒకప్పుడు ఆరిపోయే
వెలుగు దీవుల్లో నివసిస్తున్నామంటాను
చీకటి వెలుగూ ఎప్పుడూ పోట్లాడుకోవు
కలిసిపోనూ పోవు
అయినా చీకటి కలిసిన వెలుగూ
వెలుగు కలిసిన చీకటీ ఎలా ఉంటుందో చెప్పమంటే
అరమూసిన కళ్ళను చూపించడమో
అరచేతులతో కళ్ళను మూసి కొంత సందు వదలడమో
ఏమో మరి ఎలా చెప్పాలో ఎవరికీ తెలీదంటాను
నవ్వొస్తుంది ఒక్కోసారి
రాత్రంతా ఏలిన చీకటిని పొద్దుటి వెలుగు తరుముతుంది
మూడు పొద్దుల వెలుగూ రాత్రికి సర్దుకుంటుంది
ఒకటి పోతే ఇంకొకటి కానీ రెండూ కలిసి రావే
అసలేమిటీ మెట్ట వాగుడు అంటే
ఏమంటానూ?
ఏమో తెలీదంటాను