Right disabled

Tuesday, October 16, 2012

**మొలకలు**

నా హృదయ సానువుల్లో 
నువ్వు అంచెలంచెలుగా 
అడుగుకంటా దించిన
కత్తి పిడిలోంచి 
కొత్త మొలకలు పుట్టుకొచ్చాయి 

ఒక్కొక్క వేరూ
సూటిగా 
మళ్ళీ నాగుండెల్లోకే దిగుతూ
అందులో మిగిలిన 
తడిని పీల్చేస్తూ
కొత్త మొలకలు పుట్టుకొచ్చాయి 

ఒక్కొక్క వేరూ
నీ సాంగత్యపు 
ఒక్కొక్క జ్ఞాపకాన్నీ గుర్తుచేస్తూ
వెంటనే వాటిని చెరిపేస్తూ
కొత్త మొలకలు పుట్టుకొచ్చాయి 

నేను ఆ ఆక్రమణను
నరనరానా నింపుకుంటూ
ఇష్టంగా స్వీకరిస్తూ
ఎడబాటును కూడా 
వరంలా భావిస్తూ
కొత్త మొలకలు పుట్టుకొచ్చాయి

**సంకెళ్ళు**

అందమైన నీ మెడలో
ఆనందాల పూవులను
అలంకరించుకోవాలనుకున్నావు
కానీ ఆ పువ్వులను ఒక్కటిగా చేసి
చక్కటి మాలగా నిలిపే
స్వేచ్ఛ అనే దారాన్ని
నేనేనని
ఎలా మరిచిపోయావు

సువిశాల ప్రపంచ వేదికపై
ఒడలు మరచి
ఉత్తేజాల చిందులు వేయాలనుకున్నావు
కానీ
ఆ వేదికకు
నర్తించే నీ పాదానికీ మధ్య
సరయిన సయోధ్య కుదిర్చి
నీ కదలికల అస్థిత్వాన్నిబయల్పరచే
నాదాలను వెలువరించే
స్వేచ్ఛ అనే సిరిమువ్వల పట్టీల జతను
నేనేనని
ఎలా మరిచిపోయావు

నీ మరపుకు మూల్యమేమిటో
తెలుసానీకు

నీ నుంచీ
స్వేచ్ఛను విదిలించుకుని
వదిలించుకుని
మిలమిలా మెరిసే
వజ్రపు సంకెళ్ళను
కావాలని తగిలించుకున్నావు

**నగరసరాగాలు**

ముందు కారును
ముద్దెట్టుకుని మరీ
ముందుకెళ్లమని అడుగుతోంది
వెనుక కారు
నగరపు రోడ్లపై
-----------------
భాగమతీ నగర కంఠాన
మణిహారమనేమో
నెక్లెస్ రోడ్డు
మునిమాపు వేళ
మిలమిలా మెరుస్తోంది
-----------------
హుసేన్ సాగర్ లో కంపును
నేనొక్కడినే భరిస్తున్నప్పుడు
సమాజంలో కంపును
మీరింతమంది భరించలేరా
అని అడుగుతున్నాడు
మాటల్లోనూ చేతల్లోనూ
నిలకడలోనూ మార్పులేని
గౌతమ బుద్ధుడు
-----------------
పంజరంలో పక్షిలా
బాల్కనీలోని
కుండీలో మొక్క
ఆశగా చూస్తోంది
ఆకాశం వంక
-----------------
రెక్కలు ముడుచుకున్న స్వేచ్ఛ
కిచకిచమంటూ
పంజరంలో కనిపించింది
ఎర్రగడ్డ సండే మార్కెట్లో
-----------------
దాహం పాళ్ళు తగ్గట్లేదుగానీ
నగరంలోని నీళ్ళ ట్యాంకు రేటే
ఎగిసిన సునామీ అలలా
అలా పెరిగిపోతోంది
-----------------
రోడ్లు విచ్చలవిడిగా
తలస్నానం చేశాయి
వర్షపు నీటి నురగలో
-----------------
రైల్వేస్టేషన్ లో నిలబడితే
పొగమంచు వెలుగులో
మెలికలు తిరుగుతూ
వచ్చి ఆగింది
లోకల్ ట్రైను

Monday, October 15, 2012

**రంగులు**

నా మనసు ఎప్పటికప్పుడు
తన ఆలోచనల రంగులు పులుముకుంటూనే ఉంటుంది

అవి రకరకాల రంగులు
గుర్తించలేని రంగులు
అంతులేని రంగులు
రంగురంగుల రంగులు
వెలిసిపోని రంగులు

ఎన్ని రంగులు పులుముకున్నా
ఎక్కడో ఒక అంగుళం
ఖాళీగానే ఉంటుంది
ఇంకో కొత్త రంగును ఆహ్వానించి
అక్కున చేర్చుకోవడానికి

నాలోపలి రంగుల పొడలు
ప్రపంచమంతటా వ్యాపిస్తాయి కాబోలు
నా కళ్ళకన్నీ వర్ణరంజితంగానే కనిపిస్తాయి

రంగుల కలలు కనేందుకేననుకుంటాను
చీకటమ్మ నిదుర మందు చల్లి
నా కళ్లుమూసి
దాగుడుమూతలాడమంటుంది

కన్నీళ్ళకేం
స్ఫటికంలా స్వచ్ఛంగా ఉంటాయి
అన్నీ రంగుల్నీ ఇముడ్చుకుంటూ
అన్నింటినీ ప్రతిఫలిస్తూ

పుట్టుకా మరణాలు కూడా రంగులేనేమో

ఎన్ని రంగులో అన్నింటినిండా
అన్నీ బాగున్నాయి

Wednesday, October 10, 2012

**Dream girl**



Some where
Inside the quaint lanes
Of my heart
She wanders
As an unknown mystery

She empties me
She completes me
She makes me meaningful
She makes me senseless
She hates me
She cares me
She leaves her trails
Whatever the way I walk
She fills in every place
Wherever I step in
She is mystic
She is ecstatic
She is beautiful
She is formless
Still I feel her
Whenever I close my eyes
I don’t know her

She is my dream girl

Tuesday, October 9, 2012

**కలయిక**

చల్లటి ఉదయాల
మంచుబిందువులు స్వచ్ఛంగా
పచ్చటి లేలేత ఆకులపై
పద్ధతిగా ఒద్దికగా పరచుకున్న
అరుదైన అందం
మన కలయిక
--------------------
మల్లె తొడిమలోని పచ్చన
మెల్లగా తెల్లటి పూరెక్కల్లోకి
బయలుదేరే వర్ణవైవిధ్య ప్రవాహం
మన కలయిక
--------------------
సూర్యుడి కొంటె కిరణాలు
హిమశిఖరాలపై
ఒక్క ఉదుటున దూకితే
కళ్ళు మిరుమిట్లు గొలిపేలా
చిందే ధవళ కాంతి
మన కలయిక
-------------------
ఆనందాతిశయాన
కళ్ళలోంచి బుగ్గలమీదకి
నిశ్శబ్దంగా ఉరికే
కన్నీటి చుక్క కదలిక
మన కలయిక
--------------------
సంగీత జలపాతాలను
చిలికి ఒలికించే
జీవనవీణాతంత్రుల
ఉద్వేగ కంపనం
మన కలయిక
--------------------
పగలుకూ రాత్రికీ వారధికట్టే
చక్కటి సాయంత్రాల
అద్భుతమైన రంగుల పొంగు
మన కలయిక

Friday, October 5, 2012

**నచ్చుతావు**

నువు నాకు బాగా నచ్చుతావు
-----------------------
కళ్ళు మూసుకుని
నిశ్శబ్ద ధ్యానదీపం వెలిగించడానికి
నేను ప్రయత్నిస్తూంటే
నీ రెండు చేతులూ కలిపి
వత్తిని ఎగదోసి
వెలుగై కనిపించినపుడు
నువు నాకు బాగా నచ్చుతావు
--------------------------
నాలోని మౌనాల మధ్య
నేనొంటరిగా
మెల్లగా అడుగులేస్తుంటే 
నీ సైగల సంగీతం తో
నాతో శృతి కలిపినపుడు
నువు నాకు బాగా నచ్చుతావు
------------------------------
చల్లటి చీకట్లోకి
గమ్మత్తుగా ఒదిగిపోయి
అలా కలల్లో
కళ్ళు కడుక్కుంటూ ఉంటే
నా నీడవై వచ్చి నా పక్కన కూర్చున్నప్పుడు
నువు నాకు బాగా నచ్చుతావు 
---------------------
అరమరికలు లేకుండా
ప్రకృతిలో కలిసిపోయి
ప్రేమను చిలికి
వెన్నెల వెన్న ముద్దలను చక్కగా
తీసి పక్కన పెడుతుంటే
అవి నువ్వు దొంగలించినా
నిన్ను ఏమీ అనలేనప్పుడు కూడా
నువు నాకు బాగా నచ్చుతావు
-----------------------
నాతో పాటు నాకై పుట్టిన స్వేచ్ఛను 
నీ చుట్టూ తిప్పుకుని
కాళ్ళకు చూపుల సంకెళ్ళు వేసి
పాలపుంతల వింతలు చూసేందుకు పోతానంటే
నిన్ను నాకు చూపించుకుని
అవన్నీ నీలోనే ఉన్నాయని మభ్యపెట్టి
నీ మృదువైన పాదాల కింద
నన్ను కర్కశంగా తొక్కిపట్టి
నా గుండె లోతుల్లో ముళ్ళు చిమ్మే మంటలు నాటి  
ఆఖరి శ్వాస వదిలేద్దామని సిద్ధమైతే
నా ప్రాణమే నీవైపోయి
వదలలేని స్థితికి తెచ్చి
చివరకు నన్ను జీవచ్ఛవ శిల్పంగా
మలచినప్పుడు కూడా
ఎందుకో
నువు నాకు బాగా నచ్చుతావు