Right disabled

Tuesday, October 9, 2012

**కలయిక**

చల్లటి ఉదయాల
మంచుబిందువులు స్వచ్ఛంగా
పచ్చటి లేలేత ఆకులపై
పద్ధతిగా ఒద్దికగా పరచుకున్న
అరుదైన అందం
మన కలయిక
--------------------
మల్లె తొడిమలోని పచ్చన
మెల్లగా తెల్లటి పూరెక్కల్లోకి
బయలుదేరే వర్ణవైవిధ్య ప్రవాహం
మన కలయిక
--------------------
సూర్యుడి కొంటె కిరణాలు
హిమశిఖరాలపై
ఒక్క ఉదుటున దూకితే
కళ్ళు మిరుమిట్లు గొలిపేలా
చిందే ధవళ కాంతి
మన కలయిక
-------------------
ఆనందాతిశయాన
కళ్ళలోంచి బుగ్గలమీదకి
నిశ్శబ్దంగా ఉరికే
కన్నీటి చుక్క కదలిక
మన కలయిక
--------------------
సంగీత జలపాతాలను
చిలికి ఒలికించే
జీవనవీణాతంత్రుల
ఉద్వేగ కంపనం
మన కలయిక
--------------------
పగలుకూ రాత్రికీ వారధికట్టే
చక్కటి సాయంత్రాల
అద్భుతమైన రంగుల పొంగు
మన కలయిక

No comments:

Post a Comment