Right disabled

Tuesday, October 9, 2018

**అంతే కదూ**

వెతకడం 
ఎదురుచూడటం 
వేరు వేరు

దేనికోసమో
ఎవరికోసమో 
లేదా ఎందుకోసమో 

ఎదురుచూస్తూ వెతకడం 
కేవలం ఎదురు చూడటం

ఎంత తేడా

ఫలానా చోట ఉంటానని చెప్పలేదు
ఎవరూ ఎప్పటికైనా వస్తాననీ అనలేదు

ఈ వెతుకులాట
ఎదురుచూపు 
ఎవరో ఏమిటో 
ఎప్పుడో ఎక్కడో తెలియకపోయినా
వ్యర్థం కావనే అనిపిస్తుంది

నాలో నేను వెతుక్కుంటూ పోవడం 
అనవసరమైన శ్రమ

నాకు నేను తెలియకపోవడమేమిటి
ఇంకొకరి గురించి తెలుసుకుని 
నేను సాధించేదేమిటి

కేవలం వెతకాలి
ఎదురుచూడాలి
అంతే

ఏం మాట్లాడవేంటి
అంతేకదూ

Monday, October 8, 2018

**నదీమ దేహం**

దేశ దిమ్మరికేంలే
వాడలాగే తిరుగుతూ ఉంటాడు

నేను కూడా దాదాపు అంతే
నేనొకచోటే ఉన్నా
నేవెళ్లను కానీ
నిలకడ ఉండదు

కళ్ళు మూసుకుని తిరిగొస్తూ ఉంటా

చూడగలిగినవి చాలా
కనురెప్ప కదిలిస్తే చాలు

ఒక్క క్షణమే ఆగింది
అలలు పోటెత్తినట్టుండే 
నిన్ను చూసినపుడు

కేవలం చెయ్యే పట్టుకున్నది
వదిలేసినా
వదిలినట్టు లేదు

ఏముంటావే
ఆకాశంలో నదిలాగా

నదిలో చుక్కలు రాలి
తేలుతూ పోతున్నట్టు 
మెరుస్తూ

మెరుపు మెరుపుకూ 
వర్షం, మధ్యలో
జడి పట్టినట్టు

నువ్వుంటే
చుట్టూరా 
వర్షం వెలిసిన అడవి 
ఘాటు పరిమళం 


తిరిగి తిరిగి ఆగితే 
బాగుంది

ప్రయాణమిక చాలు
గమ్యం ఇదే
చూసింది చాలు
మరణం కావాలిప్పుడు

అంత అందాన్ని చూసినపుడు
ఆ కళ్ళతో ఇంకేదీ చూడకూడదు

Sunday, September 23, 2018

**పాత సీసా**

అనంతకోటి సముద్రాల నుండీ
కొట్టుకొచ్చిన సీసా ఒకటి

అరేబియా సముద్ర తీరాన
కళ్ళు కాళ్ళు తడుపుకుంటున్న 
నా వద్దకొచ్చి ఆగింది

ఏదో పత్రమొకటి అందులో 
అర్థం కాని భాషలో
మెత్తటి ఆశలను నింపుకుని
హృదయపూర్వకంగా రాసిన లేఖ 


ప్రేమను నింపుకున్న 
ఏ కంటి వెలుగులోనో రాసిన లేఖ కాబోలు
వెచ్చటి స్పర్శ తెలుస్తుంది

రాస్తున్నప్పుడు ఆ చేతులు
ఎంత వణికాయో 
ఆ ఆర్ద్రత తెలుస్తుంది

ఒక గుండె బద్దలైన సందర్భం
ఆ అక్షరాల్లో ప్రతిధ్వని


అలల హోరు
ఆర్తిగా పిలిచిన ఆఖరి పిలుపును కూడా 
ఆ పాత సీసాతో పాటు మోసుకొచ్చిందేమో కదా

ఎన్నాళ్ళ వేర్పాటో
ఈ సందేశం పంపిన మనిషి 
ఎవరో
అర్థం కాకపోయినా
అది అందుకోవడానికి 
నేనెవరినో 

అంత కలచివేసే బాధను 
లోలోపల అదుముకోవడం 
కష్టం కాదూ

మళ్ళీ బిరడా బిగించి 
బలం కొద్దీ తిరిగి సముద్రంలోకి విసిరేస్తే 
ఆ ఆలోచన కష్టంగా అనిపించింది

ఎవరి దగ్గరితనమో
విలువైనది కదా
చూద్దాం

చాలా కాలంగా అలమారాలో
ఒక అర ఖాళీగా ఉంది

పూరించాలి

Thursday, June 7, 2018

**దీనికో పేరెందుకు**

వర్షం
మెల్లగా
చినుకులు
తాకీ తాకనట్టు
మెత్తగా

బాగుంది
అలా నడుస్తూ వెళ్తుంటే

ఒక సిమెంట్ అరుగు
దానిపై
గుమ్ముగా విరిసిన
బొండు మల్లె

మహా నగరంలో
విచిత్రమే

అలా ఎదురుపడటం

అదొక్కటే అలా ఎలా వేరై
పడిపోయిందో తెలీదు

తుంపరను అద్దుకుని
చల్లగా
తెల్లగా

మెరుపుల వెలుగులో
మెరుస్తూ

ఎవరి కొప్పులోనుంచో
జడలో నుంచో
రాలి పడ్డావా
అని అడిగితే
నొచ్చుకుంది

ఏం
అవి తప్ప
నేనుండటానికి
చోట్లే లేవా అని

చూస్తే చుట్టుపక్కల
దీపపు కాంతులేవీ
కనిపించవే

అది కూడా
నోరు దాటకుండానే
గ్రహించేసింది

సుతారంగా
చేతిలోకి తీసుకుంటే తప్ప
అలక మానలేదు

నాకు సమయాభావం కదా
ఎక్కువసేపు ఉండలేను
పని

నాతో పాటు తీసుకెళ్ళి
ఒక మట్టి పాత్రలో
నీరు నింపి
అందులో తనను
జార విడిచాను

కిటికీ పక్కన
చల్లటి వాన గాలికి
చిన్న కొలను
అందులో విరిసిన
చిన్న తెల్ల తామరలా

ఆ కాసేపు
నిద్ర పట్టేవరకూ

వాన వెలిసింది
పరిమళం వదిలింది
నవ్వుతూనే ఉండిపోయింది తను

తను దొరికిన సిమెంటు అరుగును
చూడటానికి
ఈ సారి
కొంచెం తొందరగా

ఆ అరుగుపై
పూల చెట్లు అమ్మే
పండు మనిషి

అరుగు నిండా
బొండు మల్లె చెట్ల కుండీలు

కూర్చోవడానికి చోటు లేదే

చిన్నగా నవ్వుకుని
వెనక్కి తిరగాల్సి వచ్చింది

కదిలే జడలపై ఊగే
అలంకార కాంక్ష
లేదు

కదలని విగ్రహాలపై తూగే
జడత్వ నిబంధనా
లేదు

కొంచెం తుంపర
ఒక చూపు
ఒక స్పర్శ
కొంత నడక
ఒక మట్టి పాత్ర
కొన్ని నీళ్ళు
కొంత వాన గాలి
కొన్ని ఆలోచనల సావాసం
ఒక రాత్రి
ఒక బొండు మల్లె
ఒక నేను
గొంతు దాటని మాటలు

మొదటి చూపులో ప్రేమ
మొదటి స్పర్శలో ప్రేమ

బొండు మల్లెకో ప్రేమలేఖ

Tuesday, May 15, 2018

**చుక్కలు తెమ్మన్నా....**

నిన్ననో మొన్ననో
దిక్కూ తెన్నూ తోచక 
గూగుల్ ని అడిగితే కొన్ని పాటలు చూపించింది 

పేరెందుకులే 
ఆ కథానాయకుడు
చాలా చులాగ్గా
అలా
చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా
అంటూ పాటందుకుంటాడు

నిజంగా చుక్కలు చూడాలనే అనిపించింది
స్వచ్ఛమైన చుక్కలు

చీకటి తప్ప ఇంకేదీ లేదనుకునే
ఈ విశ్వాంతరాళంలో
ధూళికణం కన్నా చిన్నదైన
ఈ నీలి గోళంపై
ఒక నలుసులా

ఇంకెంత గొప్పగా ఊహించుకున్నా
ఇంతే కదా

ఎక్కడికైనా
చాలా ఎత్తులో
ఈ కృత్రిమ లోకపు
పెట్టుడు దీపాల కాంతి
చేరలేని సాంద్రతలో

అబద్ధపు ప్రేమలు, మాటలు
అన్నీ తెలిసిపోయాయనుకునే
అసంబద్ధపు కేకలు

మనిషంటే నచ్చినట్టు
ఇలానే ఉండాలని
ఎవరికి వాళ్ళు
కట్టుకునే కనిపించని గోడలు

వెనక్కి తిరిగి చూసుకుంటే
నేనూ ఇలాగే ఉన్నా

నాకు నేను కూడా వద్దు
ఇది కష్టమే

నన్ను నేను ఒద్దనుకోవడం కన్నా
లేనితనం ఏముంటుంది

నన్ను నింపుకునే
నేను నింపుకునే
ఆశలు ఉలుకూ పలుకూ లేవు
ఏం చెయ్యను

అందుకే
వెలుగు కావాలి
కొన్ని కోట్ల కాంతి సంవత్సరాలు
దాటి వచ్చి
నాలో నిండే వెలుగు కావాలి

అది చిటికెడైనా
బొట్టంతైనా
క్షణకాల శ్వాసంతైనా
కొనకంటి చూపంతైనా
చిగురంటి చిరుముద్దంతైనా
కొనగోటి గాటంతైనా

ఎంత కుదిరితే అంత

ఎక్కడైనా వెన్నెల కూడా
వద్దనేంత చీకటిలో

ఒక్క అంగుళం పక్కన కూడా
ఏముందో తెలియనంత చీకటిలో

పురుగు పుట్రా కుడతాయేమో
అనే భయం లేని చీకటిలో

భ్రాంతి కలిగించే నీడలు కూడా
కనిపించనంత చీకటిలో

బ్రతుకో కాదో కూడా తెలియని
మైకం లాంటి చీకటిలో

బట్టలు వేసుకున్నా
వేసుకున్నట్టు తెలియని
నగ్నత్వం లాంటి చీకటిలో

చుక్కల వెలుగు
నాపై చినుకుల్లా కురిస్తే చాలు

ఆపాత వెలుగు
నాలో ప్రవహిస్తే చాలు

చుక్కలను తెంచుకురాలేను
కానీ
వాటి వెలుగు నింపుకుని
ఇక్కడ
ఇంకో చుక్కనవుతాను

చాలదా