Right disabled

Saturday, August 27, 2016

**నే తప్పిపోయానా?**

ఒక విస్తారమైన దేంట్లోనో
తప్పిపోయిన ఆత్మ నేను


అంటారు కదా
ఆత్మను నీరు తడుపజాలదు
నిప్పు కాల్చజాలదు
గాలి కదిలించజాలదు
ఆత్మకు మరణములేదు


అలా అయితే
ఆత్మ కనిపించదు
ఎవరికీ ఎప్పటికీ దొరకదు
కదూ


మరి తప్పిపోయిన నాకోసం
ఎవరైనా వెతుకుతారా
వెతికితే మాత్రం దొరుకుతానా
వల వేసి పట్టుకుని బయటికి లాగడానికి
నేనున్నదేమైనా సముద్రమా


కనీసం నాలాగా తప్పిపోయినవాటిని చూద్దామంటే
కనిపించటం లేదుకదా
ఎలా మరి


అంతమైపోదామనుకుంటే
ఏవీ ఏమీ చెయ్యలేవు

నన్ను నేనే ఏమీ చేసుకోలేను

ఆత్మను చూడగలిగే అందమైన కన్నులేవైనా
దగ్గరికి తీసుకుని గాఢమైన ఆలింగనంలో ఒదార్చగలిగే
మెత్తటి చేతులేవైనా
నన్ను ఇక్కడినుంచీ తప్పించగలిగే
పగడాల పెదవుల ముద్దొకటి

చాలా అసంపూర్ణత్వాలు కూడా ఆత్మలాగే కనపడవు
సెలవు