Right disabled

Wednesday, March 8, 2017

**అద్దం**

లోలకం తత్వాన్ని చుట్టుకుని
నేనూగుతాను
లోపలికీ బయటికీ
దాని ప్రతి కదలికను
ప్రతి స్పందననూ నేనౌతూ

అప్పుడు 

అద్దం నన్ను తనలోకి ఆహ్వానిస్తుంది
అది నాకు నేను ఎదురుపడే క్షణం
నా కళ్ళలోకి నేను చూసుకునే క్షణం
నాతో నేను మాట్లాడుకునే క్షణం

నేను నా అందమైన అద్దం ముందు
అలా నిలబడతాను
యుద్ధం నడుస్తూనే ఉంటుంది
నా పిడికిళ్లు నొప్పెడతాయి
నా ముఖం మీద దెబ్బలు తేలుతాయి
నా ప్రతిబింబం నన్నడుగుతుంది
నేనెవరినని

ముసుగులు కప్పుకున్న ముఖాల్లో
వెలుగుతున్న కన్నులు
నన్నడుగుతాయి
నువ్వు నేను కాదా అని

ఏవో గుర్తు తెలియని జ్ఞాపకాలను ముద్రించుకున్న
దుమ్ముపట్టిన కాగితాలను దులుపుతూ
కొన్ని చేతులు నాకు కనిపిస్తాయి
ఆ కాగితాలు
బూడిదై నేలమీదకు జారిపోతాయి

నేనే శరణార్థుడిని
నేనే రక్షకుడిని
నాకు నేనే రహస్య శిబిరాన్ని

వసంతాలన్నీ
నామీద వయసును చల్లుతూ
వెళ్లిపోతాయి

ఒక వినాశనాన్ని చూస్తాను
కాల్చేసే కాలపు కౌగిలిలో
నేను ఎగిసిపడతాను
కాలిపోతాను

అద్దం నన్ను తనలోకి ఆహ్వానిస్తుంది
నేనందులోకి వెళతాను
హృదయపూర్వకంగా
నా ప్రతిబింబాలన్నిటి తలుపులూ తెరుచుకుంటూ

Friday, January 20, 2017

**ఓ ప్రేమికా**3

నీ చెవులకున్న లోలాకులు
అలా ఊగుతూ
ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయేమో కదా
వాటితో పాటు నా చూపులు కూడా
ఉయ్యాలలూగుతున్నాయని
నీకు చెప్పాయా

నీ పెదవిపై నిలిచిన నీటి చుక్కలో
నేను బారలు వేస్తూ ఈదుతున్న సంగతి
నీపై జాలువారిన నీళ్లు
నీకు చెప్పాయా

తలారా స్నానం చేసి
వెచ్చటి పొద్దులో
నువ్వారబెట్టుకుంటూ
చిక్కుతీసుకుంటున్న జుట్టు
అందులో నా హృదయం కూడా చిక్కుకుందని
నీకు చెప్పిందా

నీ కళ్ళకు నువ్వు పెట్టుకున్న కాటుక
తన నీడలో నేను సేద తీరుతున్నానని
కనుసైగ మాత్రమైనా
నీకు చెప్పిందా

నువ్వు గుమ్ముగా కట్టుకున్న
కాటన్ చీర
ఆ ఒద్దిక నాకెంతో ఇష్టమని
నువ్వు కట్టుకుంటున్నప్పుడు
నీకు చెప్పిందా

చకచకా అటూ ఇటూ తిరుగుతూ
మెరిసే నీ కళ్ళు
ఇంకో రెండు కళ్ళు తమను
ఎప్పుడూ కలగంటూనే ఉంటాయని
నీకు చెప్పాయా

నీపై వీచే ప్రతి గాలి తెమ్మెరతోనూ
నేను నీ గురించి గుసగుసలాడిన మాటలు కొన్ని
తమ వద్దే భద్రంగా ఉన్నాయని
నీకు చెప్పాయా

ఇవన్నీ నాకు నేను చెప్పుకుంటున్నానా
లేక
నీకు చెబుతున్నానా

Thursday, January 19, 2017

**ఓ ప్రేమికా**2

చిగురాకుల అంచులు
నన్నెందుకు కోస్తున్నాయి

ఏడు మల్లెలెందుకు
మణువుల బరువైనాయి

చల్లటి గాలెందుకు
వడ గాడ్పై కాల్చుతున్నది

మెల్లని వేణు నాదానికి
మనసెందుకు స్పందించకున్నది

జీవమున్న ప్రపంచం
జడత్వమై ఎందుకగుపించుచున్నది

గలగల పారే నీ మాటల స్రవంతి
మౌనమునాశ్రయించి నిశ్చలమెందుకైనది

కరుణాంతరంగవైన నీకు
ఇంత నిర్దయ ఎందుకు

మానసమర్పించుకున్న
ఈ దాసుడికి దిక్కేది

Wednesday, January 18, 2017

**ఓ ప్రేమికా**1

నీ కోసం
విశ్వాంతరాళం అంచులదాకా
నా ఎదురుచూపులు విస్తరిస్తాయి

నీ కోసం
పాలపుంతల్లోని
ప్రతీ నక్షత్రం పుట్టుకలోనూ
నా ప్రేమ ఉదయిస్తుంది

నీ కోసం
అంతటి శూన్యంలోనూ
నిర్నిద్ర తోడుగా
నా పిలుపు జీవిస్తుంది

నీ కోసం
ప్రతి పొద్దుపొడుపులోనూ
నా కళ్ళు ఆతృతగా వెతుకుతాయి

ప్రతి ఆలోచన ఆది అంతం
నీవే అయినపుడు
నాదగ్గర నీది కానిదేది
ఒక్క నువ్వు తప్ప

ప్రతి ఊహకు పునాది
నీ భావన అయినపుడు
నేను నీవాడిని కాక
ఇంకెవరిని

ఓ ప్రేమికా

నీ కోసం
నువ్వు మిగిల్చిన
జ్ఞాపకాల చుట్టూ
నా ప్రాణం
పరిభ్రమిస్తూనే ఉంటుంది

నీ ఆజ్ఞ