Right disabled

Tuesday, May 15, 2018

**చుక్కలు తెమ్మన్నా....**

నిన్ననో మొన్ననో
దిక్కూ తెన్నూ తోచక 
గూగుల్ ని అడిగితే కొన్ని పాటలు చూపించింది 

పేరెందుకులే 
ఆ కథానాయకుడు
చాలా చులాగ్గా
అలా
చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా
అంటూ పాటందుకుంటాడు

నిజంగా చుక్కలు చూడాలనే అనిపించింది
స్వచ్ఛమైన చుక్కలు

చీకటి తప్ప ఇంకేదీ లేదనుకునే
ఈ విశ్వాంతరాళంలో
ధూళికణం కన్నా చిన్నదైన
ఈ నీలి గోళంపై
ఒక నలుసులా

ఇంకెంత గొప్పగా ఊహించుకున్నా
ఇంతే కదా

ఎక్కడికైనా
చాలా ఎత్తులో
ఈ కృత్రిమ లోకపు
పెట్టుడు దీపాల కాంతి
చేరలేని సాంద్రతలో

అబద్ధపు ప్రేమలు, మాటలు
అన్నీ తెలిసిపోయాయనుకునే
అసంబద్ధపు కేకలు

మనిషంటే నచ్చినట్టు
ఇలానే ఉండాలని
ఎవరికి వాళ్ళు
కట్టుకునే కనిపించని గోడలు

వెనక్కి తిరిగి చూసుకుంటే
నేనూ ఇలాగే ఉన్నా

నాకు నేను కూడా వద్దు
ఇది కష్టమే

నన్ను నేను ఒద్దనుకోవడం కన్నా
లేనితనం ఏముంటుంది

నన్ను నింపుకునే
నేను నింపుకునే
ఆశలు ఉలుకూ పలుకూ లేవు
ఏం చెయ్యను

అందుకే
వెలుగు కావాలి
కొన్ని కోట్ల కాంతి సంవత్సరాలు
దాటి వచ్చి
నాలో నిండే వెలుగు కావాలి

అది చిటికెడైనా
బొట్టంతైనా
క్షణకాల శ్వాసంతైనా
కొనకంటి చూపంతైనా
చిగురంటి చిరుముద్దంతైనా
కొనగోటి గాటంతైనా

ఎంత కుదిరితే అంత

ఎక్కడైనా వెన్నెల కూడా
వద్దనేంత చీకటిలో

ఒక్క అంగుళం పక్కన కూడా
ఏముందో తెలియనంత చీకటిలో

పురుగు పుట్రా కుడతాయేమో
అనే భయం లేని చీకటిలో

భ్రాంతి కలిగించే నీడలు కూడా
కనిపించనంత చీకటిలో

బ్రతుకో కాదో కూడా తెలియని
మైకం లాంటి చీకటిలో

బట్టలు వేసుకున్నా
వేసుకున్నట్టు తెలియని
నగ్నత్వం లాంటి చీకటిలో

చుక్కల వెలుగు
నాపై చినుకుల్లా కురిస్తే చాలు

ఆపాత వెలుగు
నాలో ప్రవహిస్తే చాలు

చుక్కలను తెంచుకురాలేను
కానీ
వాటి వెలుగు నింపుకుని
ఇక్కడ
ఇంకో చుక్కనవుతాను

చాలదా