Right disabled

Tuesday, December 31, 2019

**సమక్షం**

ఏ దేవి వరము నీవో 
అని పాడుకోలేను

జీవన ప్రాంగణం అంతా
నువ్వే వెలిసినది నాకు తెలీలేదు

వర్షం వచ్చి పోయిన మర్నాడు ఉదయం కదా
మేఘాలు విడిపోయిన తరువాత 
కళ్ళు నులుముకుంటూ మొదటగా నిన్ను గమనించింది

ఎక్కడెక్కడో కదూ తిరిగింది
ఏం వెతుకుతున్నానో, ఎవరికోసం వెతుకుతున్నానో
తెలీకుండా గాలినై

నువ్వేమీ ఆలస్యంగా రాలేదు
నేనే మబ్బు కమ్మేసి ఉన్నాను

అనిపించిందిలే 
పొగచూరిన చిమ్నీ ఇవాళే తుడిచాను

శాశ్వతమైన చీకటిలో 
అవసరార్థం వెలుగు నింపి
నీ దగ్గరికే వచ్చేస్తాను

నన్ను గాయపరచవుగా
అంతగా అనిపిస్తే ప్రాణం పోయేంత గాయం చెయ్యి
ప్రేమలేని స్పృహ నాకు వద్దిక

నీ సమక్షానికి 
నువ్వెప్పుడు తలుపులు తెరుస్తావో తెలీదు 
ఎప్పటిలాగే నాకది వేకువ

Tuesday, June 25, 2019

**ఇప్పుడే**

రేపటికి నేనుంటానో లేదో
ఈ ఇల్లుంటుందో లేదో
నువ్వు రాగలవో లేదో

ఇవాళే రా

ఇంకోసారి కలవగలమో లేదో

నీకిష్టమైనవి వండుతాను
ఇంకోసారి ఈ రుచి వస్తుందో రాదో

ఇంకో జన్మంటూ ఉంటే అనే మాటంటే నాకు కంపరం
ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే

నీ చేయి పట్టుకుని వీలైనన్ని అడుగులు వేయాలి

నీ బుగ్గలను ముట్టుకోవాలి
శ్వాస ఆగిపోయేలా హత్తుకోవాలి
నీ ఊపిరి నా చెవులను వెచ్చబరిచేదాకా

రికార్డ్ చేసిన వర్షం శబ్దాన్ని వింటూ
కాసేపలా సోఫాలో కూర్చుని
చెరో కప్పు కాఫీ తాగుదాం

నీ వేళ్ళు ఎంత సుతారంగా కప్పును ఎత్తుకుంటాయో చూస్తాను
నీ గొంతులోకి దిగే కాఫీని
గుటక వేసినపుడు బలేగా కదిలే నీ మెడను
అలా గమనిస్తాను
ఈ వెలుగు మళ్ళీ ఉండదు

నీకిష్టమైన పని ఏదైనా
ఎప్పుడూ వినే పాటలు రిపీట్ మోడ్ లో విందాం
ఎప్పటిలాగే కళ్లలోని దాహాలను తీర్చేసుకుందాం
ఈ జవసత్వాలు మళ్ళీ ఉండవు

నువ్వు నీలా నేను నాలా
చిన్న ప్రపంచం
బ్రతకనీ

ఈ రోజే
ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే

ఇంటికి రా

కాస్త నవ్వును ఏడుపునూ కలగలిపి గడిపేద్దాం
ఇవి మిగిలిపోతాయి

Thursday, May 23, 2019

**తప్పెవరిదీ కాదు**

నీ మాటలు నన్ను మెత్తగా కోసిఉంటే
అది నీ తప్పు కాదు

పూలు ముళ్లవుతాయని
తయారుగా ఉండకపోవడం నా తప్పు కూడా కాదు

ఏమయితేనేం

జీవితమంతా పరుచుకుని
ఎక్కడ అడుగేసినా దిగబడి
గాయాలను ఆరనీయని
ఒక్క బాధ

ఇలాంటిది
కనీసం ఒక్క బాధ అయినా లేకపోతే

గుట్టుగా ఎవరికీ తెలియకుండా ఏడవకపోతే
బ్రతుకెట్లా గడిచేది

ఖర్చయిపోనీ కొంత కాలం
పోతే పోయింది
ఇంతదాకా ఎలాగో గడిచిపోయింది

నిస్సంకోచంగా నీ కౌగిట్లోకి నడిచొస్తానన్నవాడిని
ఇంకేమీ వీలవ్వక
అంతే నిస్సంకోచంగా
నడవడానికే సిద్ధపడినప్పుడు
బాధను హత్తుకోవాల్సిందే కదా

పోనీ అంతా ఆవిరైపోనీ
ఆఖరి అవశేషాలు కూడా
అలా గాల్లో కలిసిపోనీ

నీ గుర్తుగా మిగిలిన బాధను మాత్రం వదిలేది లేదు
గాయాలు జ్ఞాపకాలే
కొన్ని మానిపోయినా మచ్చలు మిగులుస్తాయి
కొన్ని అసలు మానవు

వెళ్లిపోవడమే
అలా నడుస్తూ వెళ్లిపోవడమే