Right disabled

Tuesday, July 23, 2013

**మా ఊరి ఏటి గట్టు**

బస్సు దిగి ఇప్పటి ఏ ఇంజనీరూ వేయలేని 
గట్టి మట్టిరోడ్డుపై 
అటుపక్కా ఇటుపక్కా 
దట్టంగా పెరిగిన కంపచెట్లు 
గుబురుగా పెరిగిన 
కల్లీ మానుల వంక 
గుబులుగానే చూసుకుంటూ 
నిమిషాల ముల్లు 
రెండంకెలు దాటేలోపు వస్తుంది 

ఇటు ఊర్లో నుంచీ బయలుదేరితే
ఎలిమెంటరీ స్కూలు 
దాని వెనుక పెద్దపెద్ద రావి వేప చెట్లు 
తోవకు అటూ ఇటూ 
ఒక మూడు నాలుగు అడుగుల పల్లంలో 
ముచ్చటగా కట్టుకున్న 
చిన్న చిన్న గుడిసెలు 
తొంభై డిగ్రీల కోణంలో 
మలుపు తిరిగే ముందు 
మొండి గోడలు అంటే ఏంటివో 
నాకు తెలిసినప్పటినుంచీ 
అలాగే ఉన్న పంచాయితీ ఆఫీసు దాటుకుని 
దూరంగా కనిపించే 
మామిడి తోపుల్లో 
చిన్నప్పుడు గడిపిన జ్ఞాపకాల గాలి 
నాతో మా ఊరి విరహపు బడలికను తీర్చితే 
తరువాత వచ్చే మా చింత తోపును 
దాటుకుని 
వంద అడుగులేస్తే వస్తుంది 
మా ఊరి ఏటి గట్టు 

పేరుకు తగ్గట్టే
బంగారు ఇసుకను మోసుకొస్తుంది 
సువర్ణముఖి 
పొంగి పొర్లుతుండగా 
నట్టనడిమధ్యలో ఎద్దులబండి 
బండిపై జనంలో 
అమ్మతో పాటు నేను 
అందరికీ ప్రళయ భయంకరంగా కనిపిస్తే 
నాకు మాత్రం వెంట్రుకలు విరబోసుకుని 
పకపకా నవ్వుతూ సాక్షాత్కరించింది 

ఏటి ఇసుకలో
కావాలని 
ఏకాంతంగా నేనొక్కడినే 
ఆడుకున్న రోజులు కొన్నే 
ఇసుకతో గూళ్ళు కట్టి 
చల్లటి ఆ గూళ్లలో 
అప్పటి మాటేమోగానీ 
ఇప్పటికీ నన్ను నేను 
విశ్రమింపజేసుకుంటూ ఉంటాను 

ఆకాశంలోనుంచీ ఉబుకుతూ
శూన్యంలోనికి ప్రవహిస్తున్నట్టుండేది 
ఏటి గట్టు అంచున నిలబడి 
అటూ ఇటూ చూస్తే 
అది నాకొక పెద్ద ఫిలాసఫీ

ఏటి గట్టు అందం 
రాత్రి వేళదే 
అద్దం కరిగి పారుతున్నట్టు 
ఏరు మెల్లగా ప్రవహిస్తుంది 
గులకరాళ్లు నీళ్ళలో 
బుడుంగున పడతాయి 
ఒక కప్ప గభాలున దూకుతుంది 
మిగితావి బెకబెకమంటూ 
హడావిడి చేస్తాయి 
శీతల నిశ్శబ్దం పొరలు పొరలుగా 
విచ్చుకుంటూ ఉంటుంది 

అప్పుడది కీచురాళ్ళ రొదకాదు 
సంగీతం 

అప్పుడవి మిణుగురులు కాదు 
గగన దీపాలు 
వాటిని చూస్తే చంద్రుడు కూడా 
భూమిపై చుక్కలు పుట్టాయని 
భ్రమపడతాడు 

గాలికి ఊగుతూ
గట్టుపై దుబ్బుగా పెరిగిన 
తుంగలు వేణునాదం చేస్తాయి 
ఇవన్నీ ఏటిగట్టుపైనే 

అనుభవాలు కొన్నే 
అనుబంధం మాత్రం 
మా ఊరి కొండంత 
కొనలేనంత 
కొన లేనంత 
మా ఊరి ఏటి గట్టు 
నాలోనూ ఉంది 
చిన్ననాటి గురుతులను తన మీదుగా ప్రవహింపజేసుకుంటూ

Tuesday, July 16, 2013

**పిల్లప్పటి రోజులు**


చిల్ల పెంకులను 
గుండ్రంగా చెక్కి 
ఒక గుడ్డ సంచిలో వేసుకుని 
అవే డబ్బులనుకుని 
సంబరపడిన రోజులు 


దట్టంగా పందిళ్లు కట్టిన 
చెట్ల మధ్య దారిలో 
అందంగా కిందకు దిగిన
ఏవో లతల తీగల్ని 
నేర్పుగా తప్పుకుంటూ 
పరుగులెత్తిన రోజులు 


ముచ్చటగా నవ్వే 
గడ్డి పూలను 
పేర్లు తెలీని రంగురంగుల పూలను 
గుత్తులుగా కోసుకుని 
గుప్పిళ్లనిండా పట్టుకుని 
పొలాల గట్ల తిరిగిన రోజులు 


తెలిసిన వారి తోటలో 
పిల్లనేస్తాలతో కలిసి 
చిలక కొరికిన మామిడిపళ్లను 
అరమగ్గిన వాటిని 
కోరి ఏరుకుని 
రాయిపై పెట్టి పగలకొట్టుకుని 
పంచుకుని తిన్న రోజులు 


చింత తోపుల్లో పడి 
పచ్చికాయలను రాలగొట్టి 
ఉప్పు కారం కలిపి 
నలగ్గొట్టి 
అరచేతిలో ముద్దలుగా 
పట్టుకుని 
మనసారా చప్పరించిన రోజులు 



దేవతకు టెంకాయ కొట్టుకురావడానికి 
అడవిదారిన కొండకు వెళ్ళి 
అమ్మో ఎలుగుబంటి అని 
ఎవరో అల్లరిగా అరిస్తే 
కన్నూ మిన్నూ గానక 
పిచ్చి పరుగులెత్తి 
కాళ్ళల్లో ముళ్ళు దింపుకుని 
ఎక్కడో ఒకచోట 
రాళ్ళు తగిలి 
కిందపడి 
ముక్కూముఖం ఏకం చేసుకుని 
మోకాళ్ళు మోచేతులు 
పగులగొట్టుకుని 
ఎలాగో ఇంటికి చేరిన రోజులు 


మా తాతల తాతలంత 
వయసుండే వేపచెట్లకు 
రావిచెట్లకు 
మందపాటి మోకులుకట్టి 
వాటికి బలమైన కర్రను కట్టి 
అటొకరు ఇటొకరు 
ఎదురెదురుగా నిలబడి 
వేగం తగ్గకుండా 
ఒకరి తరవాత ఒకరు 
కూర్చుంటూ లేస్తూ 
తొక్కుడు ఉయ్యాల ఊగిన రోజులు 


అలా ఉయ్యాల ఊగుతుంటే 
దూరంగా వెళ్ళేకొద్దీ దగ్గరయినట్టు 
దగ్గరయ్యేకొద్దీ దూరమయినట్టు 
కనిపించే కొండల్ని 
కళ్ళు పెద్దవి చేసి 
ఆశ్చర్యంతో చూసిన రోజులు 


9
అయ్యవారి కొడుకనే అభిమానంతో 
కట్టెలు కొట్టుకురావడానికి 
కొండకు వెళ్ళిన వాళ్ళు 
విత్తనాల అరటి పళ్ళు తెచ్చిస్తే 
ఇష్టంగా తిన్న రోజులు 

10 
అప్పుడు మా పిలకాయల 
తలకాయంత ఉన్న 
అడవి సీతాఫలాల్ని 
సగానికి తుంచి 
అందులో ముఖం దూర్చేసి 
గుజ్జునొకవైపు జుర్రుకుంటూనే 
ఇంకోవైపు విత్తనాలను 
బయటకు ఊసేస్తూ 
తిన్న రోజులు 

11 

పచ్చి పెసలు, పచ్చి అలసందలు 
పచ్చి బెండకాయలు, పచ్చి జొన్నలు 
పచ్చి రాగులు, పచ్చి కందులు 
ఒకటేమిటి ప్రకృతిచ్చే 
పచ్చి రసాలన్నింటినీ 
పకడ్బందీగా జుర్రుకున్న రోజులు 

12 

సీమ చింతకాయలకోసం వెళ్ళి 
రాయితో గురి చూసి కొట్టి 
రాలిన కాయలను ఏరుకుంటూ 
అటునుంచీ 
మరెవరో విసిరిన రాయి 
సూటిగా నుదుటికి తగిలి 
రక్తం ధారలుగా కారినా 
చేతికందిన ఆకులు నలిపి 
కట్టుకుని ఇంటికి చేరి 
నాన్న తిరిగి ఈతబర్రతో 
నాలుగు పీకితే 
ఏరుకున్న కాయలను అలా 
ఒక మూలకు విసిరేసి 
అలిగి 
ఇంకోమూలన నక్కి కూర్చున్న రోజులు 


వంద జీవితాలకు సరిపడా 
అనుభవాలను ఇచ్చిన రోజులు 
కరిగిపోని కలలాంటి 
జ్ఞాపకాలను మిగిల్చిన రోజులు 


ఇవి 
నా పిల్లప్పటి రోజులు