Right disabled

Tuesday, July 23, 2013

**మా ఊరి ఏటి గట్టు**

బస్సు దిగి ఇప్పటి ఏ ఇంజనీరూ వేయలేని 
గట్టి మట్టిరోడ్డుపై 
అటుపక్కా ఇటుపక్కా 
దట్టంగా పెరిగిన కంపచెట్లు 
గుబురుగా పెరిగిన 
కల్లీ మానుల వంక 
గుబులుగానే చూసుకుంటూ 
నిమిషాల ముల్లు 
రెండంకెలు దాటేలోపు వస్తుంది 

ఇటు ఊర్లో నుంచీ బయలుదేరితే
ఎలిమెంటరీ స్కూలు 
దాని వెనుక పెద్దపెద్ద రావి వేప చెట్లు 
తోవకు అటూ ఇటూ 
ఒక మూడు నాలుగు అడుగుల పల్లంలో 
ముచ్చటగా కట్టుకున్న 
చిన్న చిన్న గుడిసెలు 
తొంభై డిగ్రీల కోణంలో 
మలుపు తిరిగే ముందు 
మొండి గోడలు అంటే ఏంటివో 
నాకు తెలిసినప్పటినుంచీ 
అలాగే ఉన్న పంచాయితీ ఆఫీసు దాటుకుని 
దూరంగా కనిపించే 
మామిడి తోపుల్లో 
చిన్నప్పుడు గడిపిన జ్ఞాపకాల గాలి 
నాతో మా ఊరి విరహపు బడలికను తీర్చితే 
తరువాత వచ్చే మా చింత తోపును 
దాటుకుని 
వంద అడుగులేస్తే వస్తుంది 
మా ఊరి ఏటి గట్టు 

పేరుకు తగ్గట్టే
బంగారు ఇసుకను మోసుకొస్తుంది 
సువర్ణముఖి 
పొంగి పొర్లుతుండగా 
నట్టనడిమధ్యలో ఎద్దులబండి 
బండిపై జనంలో 
అమ్మతో పాటు నేను 
అందరికీ ప్రళయ భయంకరంగా కనిపిస్తే 
నాకు మాత్రం వెంట్రుకలు విరబోసుకుని 
పకపకా నవ్వుతూ సాక్షాత్కరించింది 

ఏటి ఇసుకలో
కావాలని 
ఏకాంతంగా నేనొక్కడినే 
ఆడుకున్న రోజులు కొన్నే 
ఇసుకతో గూళ్ళు కట్టి 
చల్లటి ఆ గూళ్లలో 
అప్పటి మాటేమోగానీ 
ఇప్పటికీ నన్ను నేను 
విశ్రమింపజేసుకుంటూ ఉంటాను 

ఆకాశంలోనుంచీ ఉబుకుతూ
శూన్యంలోనికి ప్రవహిస్తున్నట్టుండేది 
ఏటి గట్టు అంచున నిలబడి 
అటూ ఇటూ చూస్తే 
అది నాకొక పెద్ద ఫిలాసఫీ

ఏటి గట్టు అందం 
రాత్రి వేళదే 
అద్దం కరిగి పారుతున్నట్టు 
ఏరు మెల్లగా ప్రవహిస్తుంది 
గులకరాళ్లు నీళ్ళలో 
బుడుంగున పడతాయి 
ఒక కప్ప గభాలున దూకుతుంది 
మిగితావి బెకబెకమంటూ 
హడావిడి చేస్తాయి 
శీతల నిశ్శబ్దం పొరలు పొరలుగా 
విచ్చుకుంటూ ఉంటుంది 

అప్పుడది కీచురాళ్ళ రొదకాదు 
సంగీతం 

అప్పుడవి మిణుగురులు కాదు 
గగన దీపాలు 
వాటిని చూస్తే చంద్రుడు కూడా 
భూమిపై చుక్కలు పుట్టాయని 
భ్రమపడతాడు 

గాలికి ఊగుతూ
గట్టుపై దుబ్బుగా పెరిగిన 
తుంగలు వేణునాదం చేస్తాయి 
ఇవన్నీ ఏటిగట్టుపైనే 

అనుభవాలు కొన్నే 
అనుబంధం మాత్రం 
మా ఊరి కొండంత 
కొనలేనంత 
కొన లేనంత 
మా ఊరి ఏటి గట్టు 
నాలోనూ ఉంది 
చిన్ననాటి గురుతులను తన మీదుగా ప్రవహింపజేసుకుంటూ

No comments:

Post a Comment