Right disabled

Wednesday, February 26, 2014

**పిచ్ బ్లాక్**

అన్నీ రంగులూ కలిస్తే తెలుపు కదా 
ఏ రంగు లేకపోవడమే నల్లదనమా
ఏమో
నల్లదనానికి కూడా కొలతలుంటాయి 
కలర్ టెక్నాలజీ మహిమ

మరి కమ్ముకునే నల్లదనాన్ని ఎలా కొలవాలో 

పిచ్ బ్లాక్? 
కమ్ముకొచ్చే ప్రశ్నా?
సమాధానమా? 
ఏదైనా స్పెక్ట్రోస్కోప్ 
కొలుస్తూ కనబడితే అడగాలీసారి

నా పిచ్చిగానీ 

గట్టిగా మూసుకున్న రెప్పల వెనుక 
నేనెప్పుడూ గమనించే చీకటినే అడగవచ్చుగా
వెంటనే ఆ పని చెయ్యాలి

చీకటిలో ఏవో ఆకారాలు 

రూపాలు మారుతూ కదలాడుతున్నాయి 
విరగ పూచిన శాంతి 
నల్లటి రెక్కలై రాలిపోతోంది 
నా భుజాలను ఒరుసుకుంటూ 
కొన్ని ముక్కలు నా ఒళ్ళో పడుతున్నాయి
ఓం శాంతిః శాంతిః శాంతిః

అంతలో కొన్ని మాటలు

అమ్మా పువ్వులన్నీ నల్లగా మారి రాలిపోతున్నాయి 

ఏం కాదులే తల్లీ మళ్ళీ పూస్తాయి 
రంగుల్లో పూస్తాయా అమ్మా 
అవును చిట్టి తల్లీ రంగుల్లోనే పూస్తాయి

Monday, February 17, 2014

**పేరున్నా లేనిది**

ఎప్పుడో కదలాడిన ఒక తెమ్మెర 
మళ్ళీ ఒకసారి
చేరుకోలేని తెరై తగులుతుంది 
ఏమడగను
ఏం మాట్లాడను

చూస్తూనే ఉండాలనిపిస్తూనే

ఇక చూడకూడదనిపించే స్థితి 
ఎలా ఉంటుందో నీకు తెలుసా 

ఒకసారి నింపేసుకున్న హృదయం

ఎంత తోడినా ఖాళీ అవదని తెలిసినా
ఏతాం వెయ్యడానికే సరిపోదనిపించే బ్రతుకును
ఎప్పుడైనా బ్రతికావా

ఎప్పుడు ఎలా పుడుతుందో తెలియనిది 

పోయినదేదీ దొరకదెందుకని తొందరగా

Wednesday, February 12, 2014

**శృంగారాలు – 7**

ఈ భూమిమీద పూసేముందే
కట్టగట్టుకుని మాట్లాడుకుంటాయేమో 
కనకాంబరాలు
వాడిపోయినా వన్నె తగ్గకూడదని

మనంకూడా మాట్లాడుకుందాం

పెదాలతో
చేతులతో కాళ్లతో
శరీరాలతో
ఇవన్నీ కుదరకపోతే 
కనీసం కళ్ళతో

అలవిగాని కోరికతో

ప్రేమతో ద్వేషంతో అసూయతో
ఇంకేదైనా భావంతో
ఏదీ చొరబడని దగ్గరితనంతో
కనీసం మౌనంగానైనా
మాట్లాడుకుందాం

పిల్లా

మనం కనకాంబరాలం
వయసు వాడినా
మనసు వన్నె తగ్గదులే

Thursday, February 6, 2014

**ఊరు**

కాస్త పచ్చదనం కనిపించినా 
పారే నది కనిపించినా
గుబురు పొదలపై 
గుత్తులుగా పూసిన పూలు కనిపించినా 
కాస్త వెన్నెల ఎప్పుడైనా తడిమినా 

కొంచెం చల్లని గాలి
ఎప్పుడైనా గుసగుసలాడినా 
మెత్తటి తడి మట్టి ఎప్పుడైనా 
పాదాలను ముద్దు పెట్టుకున్నా 
గుడి గంటలు లీలగా వినిపించినా 
ఆకాశం నిండా చుక్కలు చూసి 
చాలాకాలమైందనిపించినా 
గుంపులు గుంపులుగా ఎగురుతున్న
పిట్టలు కనిపించినా
ఎవరి మాటల్లోనైనా 
కాస్తంత మొరటుతనం
మంచితనం కనిపించినా 


నీకు తెలీకుండా

నీ కంట్లో ఉబికిన తడి 
నీ చెంపలను తడిపితే 
నీలో నీ ఊరు
ఇంకా సజీవంగానే ఉన్నట్టు