Right disabled

Wednesday, February 26, 2014

**పిచ్ బ్లాక్**

అన్నీ రంగులూ కలిస్తే తెలుపు కదా 
ఏ రంగు లేకపోవడమే నల్లదనమా
ఏమో
నల్లదనానికి కూడా కొలతలుంటాయి 
కలర్ టెక్నాలజీ మహిమ

మరి కమ్ముకునే నల్లదనాన్ని ఎలా కొలవాలో 

పిచ్ బ్లాక్? 
కమ్ముకొచ్చే ప్రశ్నా?
సమాధానమా? 
ఏదైనా స్పెక్ట్రోస్కోప్ 
కొలుస్తూ కనబడితే అడగాలీసారి

నా పిచ్చిగానీ 

గట్టిగా మూసుకున్న రెప్పల వెనుక 
నేనెప్పుడూ గమనించే చీకటినే అడగవచ్చుగా
వెంటనే ఆ పని చెయ్యాలి

చీకటిలో ఏవో ఆకారాలు 

రూపాలు మారుతూ కదలాడుతున్నాయి 
విరగ పూచిన శాంతి 
నల్లటి రెక్కలై రాలిపోతోంది 
నా భుజాలను ఒరుసుకుంటూ 
కొన్ని ముక్కలు నా ఒళ్ళో పడుతున్నాయి
ఓం శాంతిః శాంతిః శాంతిః

అంతలో కొన్ని మాటలు

అమ్మా పువ్వులన్నీ నల్లగా మారి రాలిపోతున్నాయి 

ఏం కాదులే తల్లీ మళ్ళీ పూస్తాయి 
రంగుల్లో పూస్తాయా అమ్మా 
అవును చిట్టి తల్లీ రంగుల్లోనే పూస్తాయి

No comments:

Post a Comment