Right disabled

Thursday, August 21, 2014

**శృంగారాలు – 8**

నీ పల్చటి పెదవులకంటిన
ఊదా రంగు వెన్నెల
నా చెవులను అనుక్షణమూ ముద్దాడుతూనే ఉంటుంది

నీ కళ్ల కదలికలతో
నా కళ్ళు ఎప్పుడూ లయిస్తూనే ఉంటాయి

నీ ఉచ్ఛ్వాస నిశ్వాసల్లోని వింత పరిమళం
నన్ను అంటిపెట్టుకునే ఉంటుంది

నువ్వూ నేనూ సుఖించాలంటే
పిల్లా
శరీరాలే కావాలా
మాటలు చాలవూ

Wednesday, August 20, 2014

**చిత్రం**

రాత్రికి రాత్రి మొదలై
ఉదయం పలకరిస్తే మొగ్గ పుష్పమయ్యే
విస్ఫోటన విన్యాసాన్ని
దగ్గరగా మెల్లగా తరచి చూడాలనిపిస్తుంది

ఆ పూసిన పుష్పాలకు 
అత్తరు ఎవరద్దుతారో
ఎలా అద్దుతారో
అసలెప్పుడు అద్దుతారో

ఇంత జరిగినా ఏమీ తెలీనట్టు
గుంభనంగా నవ్వే పువ్వుల గుంపులు
పిలుస్తున్నట్టు అర్థమవుతుంది
వెళ్ళి వాటితో కలిసి ఊగి తూగే వీలు లేదనీ తెలుస్తుంది

పువ్వులు పూయడమొక చిత్రమయితే
వాటిలో వాటితో నేను కలిసిపోలేకపోవడం
చిత్రాతి చిత్రం

వాటిని అనుకరిస్తూ నవ్వడానికి ప్రయత్నించగలనంతే

Friday, August 15, 2014

**చీకటి కబురు**

రాత్రుళ్ళన్నీ నావే
ఆ రాత్రులు కురిపించే చీకట్లన్నీ నావే
ఆ చీకట్లు చెమరించే ప్రేమంతా నాదే
ఆ ప్రేమలో పండే బ్రతుకంతా నాదే

చీకటంటే తల్లి గర్భం
చీకటంటే చెలి ఒడి
చీకటంటే హృదయాంతరాళం
చీకటంటే నీలో నువ్వు

Sunday, May 25, 2014

**పసిడి పిల్ల**

పరవళ్ళు తొక్కేటి పసిడి నవ్వుల్లోన
తళుకులీనే చిలిపి భావమేమో

ముక్కెరంతా మలిగి
చిరు చెంద్రమై వెలిగి
దీపాల మించు వెన్నెలెమో

కళ్ళలో దూకేటి జలపాతమే అది
అమృతం కురిసేటి వర్షమేమో

పలికేటి గొంతులో
ఎన్నెన్ని వైనాలు
ఎంచుకుంటే బతుకు చాలదేమో

నడకల్లో నాట్యాలు
మోగేటి మువ్వల్లు
అవి ఆగితే గుండె ఆడదేమో

ఎన్నెన్ని అందాలు
పూస్తాయి పూలు
ఈ పిల్ల మేనికి సాటిరావేమో

దేవతో ఏమో ఈ పిల్ల
దేవతో ఏమో

Friday, April 18, 2014

**పనికొచ్చేది**

హోమగుండంలో పూర్ణాహుతైన
గుమ్మడికాయలాంటి
మెత్తటి రాత్రి

ఒకరివెంట ఒకరు
ఊరికే పరుగెత్తే
పిచ్చికుంకల్లాంటి గడియారపు ముళ్ళు

ఆ కాసేపటికీ హస్తభూషణమయ్యే
పెద్ద కప్పులోని టీ అంటే
నాకన్నా వాటికే ఇష్టం

కప్పును పట్టుకునే చేతి వేళ్ళనూ
తాకీ తాకనట్టు తాకే పెదాలనూ
చప్పరించే నాలుకనూ చూస్తూ
కప్పులోని టీ అయిపోయేంతవరకూ
రాత్రి
గడియారం
అలానే నిల్చుండిపోతాయి

అలా రాత్రిని కాలాన్ని నిలబెట్టే టీ కోసం
స్టవ్ రోజూ ఎదురుచూస్తుంది

ఒక్కో తేనీటి చుక్క
గొంతుదిగే ఒకానొక జ్ఞాపకం
నిజంగా జీవితంలోకి వెళ్లాలనుకున్నపుడు పనికొస్తుంది