Right disabled

Saturday, May 28, 2016

*మనస్విని*

తనలోంచే పొంగి
తనలోకే దూకుతుంది
తనలో తానే కదులుతూ
ఏమీ ఎరగనట్టు ప్రశాంతంగా ఉంటుంది

అనంతమైన లోతులో కూడా
అత్యంత అందంగా కనిపిస్తుంది

ఆకాశానికి అద్దమై
మేఘమై చేరుకుంటుంది

సముద్రతీరమొక ప్రణయం
అసలు తీరమే లేకుంటే అది విలయం

నువ్వే నేను
నేనే నువ్వన్న భావనకు
సముద్రం ఒక చందం

మనసును సముద్రంతో పోల్చడం సబబే

Wednesday, February 24, 2016

**నీవెంతటిదానవో**

ఎంత అందమైనదానవో
ఎంత లోతైనదానవో
ఎంత ఎరుక ఉన్నదానవో
ఎంత మనసున్నదానవో
ఎంత తత్వమున్నదానవో

మరి ఏమీ లేని నన్ను ప్రేమిస్తావా
నాదగ్గరేమీ లేదు
ఉండీ లేనట్టుండే హృదయం తప్ప

నేనేమివ్వగలను
నాకంటూ మిగిలింది నేను అన్న భావన మాత్రమే

ఒడ్డున వేచి ఉన్న నన్ను
కేవలం స్పర్శిస్తావేం
ఒక్క ఉదుటున వచ్చి కౌగిలించుకోరాదూ

కేవలం గాలి మాటలేనా 
అసలు మాటలు అవసరం లేని నీలోని గాఢమైన నిశ్శబ్దం
నాకివ్వరాదూ

ప్రేమంత నిన్ను భరించేతటి శక్తి నాకు లేదు
ఓ సముద్రమా
నన్నూ నా ఇష్టాన్నీ నీలో కలిపేసుకోరాదూ

Wednesday, November 25, 2015

**రాత్రులు**

జాలువారే మృదుమధుర పదజాలాలు
ఆలోచనలు విచ్చుకునే చీకటి తోటలు
అర్థం చేసుకుంటే పుట్టుకకూ మరణానికీ తేడా తెలియజెప్పే దేవతలు
కాలపు కన్నియ నవ్వుల కాఠిన్యాలు
అలసిపోని అనిమిషనేత్రాలకు స్వాగతాలు
అనేకానేక సంఘర్షణల అలుపు మజిలీలు
అనుకుంటే మరో ప్రపంచపు సింహద్వారాలు
వెలుతురు నేరాలకు కొనసాగింపు కొలమానాలు
ఒంటరి బ్రతుకులకు కాస్త ఉపశమనాలు
మండే మనసులకు పట్టపగళ్ళు
వందల వేల స్వప్నవేణువుల సంయోగ సంగీతాలు
మత్తెక్కించే నల్లచర్మపు జవరాళ్ళు

Sunday, September 20, 2015

**కొన్ని తీరాలు**

మహా సముద్రాలు విశ్రమించే చోట
కొన్ని తీరాలు కలుస్తాయి
శంఖాలు తమ శబ్దాలను మార్పిడి చేసుకుంటాయి
గవ్వలు తమ మేని మెరుపులు పంచుకుంటాయి

ఇసుక రేణువులు
తమ గుసగుసల శృంగారాన్ని వెదజల్లుతాయి
సాయంత్రాలను మలిగించడానికై
సూర్యుడిని వెలగనిస్తాయి
చంద్రుడు మెల్లగా నీటిలోకి జారుకుంటాడు
నిశ్శబ్దంగా చల్లగా వాటిని మరిగిస్తాడు

చివరకు తీరాలన్నీ విడిపోతాయి
సెగలు కక్కే ప్రేమ జాడలను
గోటి గుర్తులలో నింపేసి

Wednesday, June 17, 2015

**ఆకాశంలాంటి పిల్ల**

గుండె ఝల్లుమనిపించే ఉరుములు
వినసొంపుగా ఎప్పుడౌతాయో తెలుసా
అవి తన కాలి అందియల శబ్దాలైనపుడు

ప్రళయకాల ఝంఝామారుతాలు కూడా
పిల్లగాలిలా ఎప్పుడనిపిస్తాయో తెలుసా
అవి తన ముద్దు మాటలైనపుడు

నల్లటి పెద్ద మేఘాలు
చలువపందిళ్ళెప్పుడౌతాయో తెలుసా
అవి తన కురులైనపుడు

కళ్ళు మిరుమిట్లు గొలిపే మెరుపులు
బంగారు జలతారు మాలలెప్పుడౌతాయో తెలుసా
అవి తనను అలంకరించినపుడు

కుండపోతగా కురిసే వర్షం
మల్లెల జల్లు ఎప్పుడౌతుందో తెలుసా
అవి తన చూపులైనపుడు

అన్నిటినీ ఒకచోట చేరిస్తే
ఒక ఆకాశంలాంటి పిల్ల

అంతేలేని ఆకాశంలాంటి పిల్ల