Right disabled

Monday, June 13, 2016

**musings of life**

మల్లెలెప్పుడు వాడిపోయాయో కూడా తెలియదు
పరిమళమొక జ్ఞాపకం


కథ ఎప్పుడూ ముగిసిపోదు
పాత్రల నిడివే ముగిసిపోతూ ఉంటుంది

కడవరకూ తోడుంటానన్నమాట
ఎంత నిజమో అంత అబద్ధం

కడ అంటే ఎక్కడివరకో మరి
చావు శరీరానికేగా ఆత్మకు కాదుగా

నాది నీది ఏమైనా ఉందనుకుంటున్నావా ఇక్కడ
ఏది ఎందుకు నీ సొంతమో ఇదమిద్ధంగా తెలుసా

మనుషుల విషయంలో కూడా ఇంతే కదా
పుట్టుక, స్నేహం తప్ప ఇంకేమైనా సత్యమున్నదా
ఈ రెండూ కూడా ప్రేమతోనే కదా ముడిపడిఉన్నాయి

అమ్మలో అమ్మదనం నాన్నలో నాన్నదనం
ఇవి రెండూ ఆ ఇద్దరిలో తప్ప ఎక్కడా దొరకట్లేదేం

మనుషులంతా మొక్కలు
జీవితాలు కాలపుష్పాలు అనిపిస్తుంది చాలాసార్లు
గుమ్ముగా వికసించిన తరువాత రాలిపోవాల్సిందే కదా

ఇంతకీ మల్లెపూవు యవ్వనం ఒకటా కాదా

Saturday, May 28, 2016

**ఏంటో నీ పిచ్చి**

పది వాక్యాలు రాసి కవితంటావు
ఇంకో వంద వాక్యాలు రాసి కథంటావు

ఊహాల్ని ఒడిసిపట్టుకుని మాల గుచ్చానంటావు
మదిలోని మాటలని పేర్చి కట్టానంటావు

రవిగాంచని చోటును
చంద్రుడు వెళ్ళలేని లోకాలని చూసానంటావు

నిజం చెప్పు
నిజంగానా

నువ్వు కవివా
కవి అంటే రుషి అంట

రుషితత్వం శూన్యం కదా
నువ్వేంటి ఇంత సరుకు మోస్తున్నావ్

వేదాంతం ఆఖరు అంకం అన్న నీ మాటల్ని వింటే నవ్వొస్తుంది
తెలిసి తెలిసీ జీవితం మొదలయ్యేదే దాంతో కదా

ఏదీ పూర్తిగా తెలుసుకోలేని జీవితంలోంచి
ఇంకేదో వెతకడమే
ఇంతకంటే ఏమీ లేదు

ఎంత చించుకున్నా అర్థంకాని ఏదో దాని గురించి
అర్థం పర్థంలేని కొన్ని పదాలో, ఇంకొన్ని వాక్యాలో
అంతేనా నీ పరిధి

నాకు నవ్వొస్తుంది
నాకు మట్టుకు నవ్వే కవిత్వం

నిన్ను చూసి నవ్వినా లేక నన్ను చూసుకుని నేనే నవ్వుకున్నా
లోకాన్ని చూసి నేను నవ్వినా లోకం నన్ను చూసి నవ్వినా
నాకు మట్టుకు నవ్వే కవిత్వం

*Random*

కూలివాడి చేతిలో సుత్తి
రోడ్డుపక్కన
పిల్లరాళ్లవుతున్న పెద్దరాళ్ళు

ఎండకు ఎండుతున్న పైరు
పండని విత్తనాల కోసం
పక్షుల కలకలం

పిల్లాడి ఏడుపు
మమ్మల్ని కొనండంటూ
అంగట్లో పాలపొడి డబ్బాలు

అన్నీ ఉన్నాయి
ఎందులో ఏముందో తెలీదు
శతాబ్దపు విపణి

అంగట్లో దొరికేది తెచ్చుకోలేరు
అనవసరమయింది ఒంట్లోకి తెచ్చుకుంటారు
చదువుకున్న జనాలు

అర్హత కాగితాలకు అంకితం
మెదళ్ళు జీతాలకు పునరంకితం
ఇదే ఈనాటి స్వాతంత్ర్యం

బాధ్యతలు బారెడు
ఆదాయం బెత్తెడు
కథ కంచికి చేరదు

ఎవరి ఇష్టానికి వారు
ఇంకొకరి స్వేచ్ఛను లెక్కచేయకపోవడం స్వేఛ్చ
మాకు రెక్కలున్నాయని సంబరం

సుఖం ఒక సరుకు
కష్టం ఒక ఆనందం
డబ్బు మారకం మాత్రమే

ఏది బ్రతుకు
చాకలి బట్టలుతికినట్టు
బండలు పగలాల్సిందే

అమ్మకం ఒక అదను
అభివృద్ధి సాకు
కోటలో విదేశీ పాగా

కలలు చెదరుతాయి
కోరికలు మిగులుతాయి
చీకటి దీపాల్ని ఆర్పేస్తుంది

ఇవన్నీ ధైర్యానికే
ఇంటాబయటా
నీ కోసమే

*మనస్విని*

తనలోంచే పొంగి
తనలోకే దూకుతుంది
తనలో తానే కదులుతూ
ఏమీ ఎరగనట్టు ప్రశాంతంగా ఉంటుంది

అనంతమైన లోతులో కూడా
అత్యంత అందంగా కనిపిస్తుంది

ఆకాశానికి అద్దమై
మేఘమై చేరుకుంటుంది

సముద్రతీరమొక ప్రణయం
అసలు తీరమే లేకుంటే అది విలయం

నువ్వే నేను
నేనే నువ్వన్న భావనకు
సముద్రం ఒక చందం

మనసును సముద్రంతో పోల్చడం సబబే

Wednesday, February 24, 2016

**నీవెంతటిదానవో**

ఎంత అందమైనదానవో
ఎంత లోతైనదానవో
ఎంత ఎరుక ఉన్నదానవో
ఎంత మనసున్నదానవో
ఎంత తత్వమున్నదానవో

మరి ఏమీ లేని నన్ను ప్రేమిస్తావా
నాదగ్గరేమీ లేదు
ఉండీ లేనట్టుండే హృదయం తప్ప

నేనేమివ్వగలను
నాకంటూ మిగిలింది నేను అన్న భావన మాత్రమే

ఒడ్డున వేచి ఉన్న నన్ను
కేవలం స్పర్శిస్తావేం
ఒక్క ఉదుటున వచ్చి కౌగిలించుకోరాదూ

కేవలం గాలి మాటలేనా 
అసలు మాటలు అవసరం లేని నీలోని గాఢమైన నిశ్శబ్దం
నాకివ్వరాదూ

ప్రేమంత నిన్ను భరించేతటి శక్తి నాకు లేదు
ఓ సముద్రమా
నన్నూ నా ఇష్టాన్నీ నీలో కలిపేసుకోరాదూ