Right disabled

Wednesday, November 25, 2015

**రాత్రులు**

జాలువారే మృదుమధుర పదజాలాలు
ఆలోచనలు విచ్చుకునే చీకటి తోటలు
అర్థం చేసుకుంటే పుట్టుకకూ మరణానికీ తేడా తెలియజెప్పే దేవతలు
కాలపు కన్నియ నవ్వుల కాఠిన్యాలు
అలసిపోని అనిమిషనేత్రాలకు స్వాగతాలు
అనేకానేక సంఘర్షణల అలుపు మజిలీలు
అనుకుంటే మరో ప్రపంచపు సింహద్వారాలు
వెలుతురు నేరాలకు కొనసాగింపు కొలమానాలు
ఒంటరి బ్రతుకులకు కాస్త ఉపశమనాలు
మండే మనసులకు పట్టపగళ్ళు
వందల వేల స్వప్నవేణువుల సంయోగ సంగీతాలు
మత్తెక్కించే నల్లచర్మపు జవరాళ్ళు

Sunday, September 20, 2015

**కొన్ని తీరాలు**

మహా సముద్రాలు విశ్రమించే చోట
కొన్ని తీరాలు కలుస్తాయి
శంఖాలు తమ శబ్దాలను మార్పిడి చేసుకుంటాయి
గవ్వలు తమ మేని మెరుపులు పంచుకుంటాయి

ఇసుక రేణువులు
తమ గుసగుసల శృంగారాన్ని వెదజల్లుతాయి
సాయంత్రాలను మలిగించడానికై
సూర్యుడిని వెలగనిస్తాయి
చంద్రుడు మెల్లగా నీటిలోకి జారుకుంటాడు
నిశ్శబ్దంగా చల్లగా వాటిని మరిగిస్తాడు

చివరకు తీరాలన్నీ విడిపోతాయి
సెగలు కక్కే ప్రేమ జాడలను
గోటి గుర్తులలో నింపేసి

Wednesday, June 17, 2015

**ఆకాశంలాంటి పిల్ల**

గుండె ఝల్లుమనిపించే ఉరుములు
వినసొంపుగా ఎప్పుడౌతాయో తెలుసా
అవి తన కాలి అందియల శబ్దాలైనపుడు

ప్రళయకాల ఝంఝామారుతాలు కూడా
పిల్లగాలిలా ఎప్పుడనిపిస్తాయో తెలుసా
అవి తన ముద్దు మాటలైనపుడు

నల్లటి పెద్ద మేఘాలు
చలువపందిళ్ళెప్పుడౌతాయో తెలుసా
అవి తన కురులైనపుడు

కళ్ళు మిరుమిట్లు గొలిపే మెరుపులు
బంగారు జలతారు మాలలెప్పుడౌతాయో తెలుసా
అవి తనను అలంకరించినపుడు

కుండపోతగా కురిసే వర్షం
మల్లెల జల్లు ఎప్పుడౌతుందో తెలుసా
అవి తన చూపులైనపుడు

అన్నిటినీ ఒకచోట చేరిస్తే
ఒక ఆకాశంలాంటి పిల్ల

అంతేలేని ఆకాశంలాంటి పిల్ల

Wednesday, March 25, 2015

**శృంగారాలు – 9**

ఆమె వచ్చింది
అతడిని జయించింది

ఒక చిన్న దీపం వెలిగించి
చీకటిని వెలుగును సమపాళ్లుగా సర్దింది

అతడిని కరిగించింది
నదిలా ప్రవహించమంది

అతడు ఆమె దేహమంతటా ప్రవహించాడు
రెండు జీవితాలు సస్యశ్యామలమయ్యాయి

Friday, March 13, 2015

**కొన్ని మాటలు**

ఒక్కోసారి తను అలాగే చూస్తూంటుంది
నిశ్శబ్దంగా మాట్లాడటమెలాగో
నాకు నేర్పుతున్నట్టు

గాలికి కదిలే కిటికీ తెర
టీపాయ్ మీద కప్పులు
చక్కటి రంగుల్ని పులుముకుని
తళతళలాడే తన చేతి వేళ్ళ గోళ్ళు

చాలాసార్లు
మేమిద్దరం కలిసి దిగిన ఫోటో

ఒక్కోసారి
తన చీర అంచు వెంబడి దారాల ముడులు

అప్పుడప్పుడూ
మెల్లగా చప్పుడు చేసే తన కాలి మువ్వలు

ఇలా వేటితో మాట్లాడినా
ఆ అర్థాలన్నీ నావద్దకే వచ్చి ఆగుతాయి

అవి చాలు
అంతే