Right disabled

Sunday, April 26, 2020

** the primal instinct**

ఇప్పటి నేను 
ఇప్పటి నేను కాను

సాలీడు అల్లుకున్నట్టుగా 
గిజిగాడు కట్టుకున్నట్టుగా 

నన్ను నేను
కొంత తెలిసీ 
చాలా తెలియక 

నాకు నేనే
పదిలంగా కూర్చుకున్న
ఒక మందసాన్ని

నాకు నేను 
ఊపిరులూదుకున్నది
ఈ ఒంటరితనంలోనే

నాలో నేను 
జీవించి ఉన్నది 
అది తెలుసుకున్నది కూడా
ఈ ఒంటరితనంలోనే 

వర్తమానం నుంచీ వెనక్కి వెళుతూ
ఉన్న అక్షరాలను దులిపేసి 
పేజీలను ఖాళీ చేసుకుంటూ 

రాలి పడిన ఆకులను 
మళ్ళీ రెమ్మలకు అతికిస్తూ

పువ్వులను మొగ్గల్లోకి దించి 
విశ్రమిస్తూ 

మూలాలలోకి 
మూలాల మూలాల్లోకి

వెతుకుతూ వెతుకుతూ 
ఏం వెతుకుతున్నానో తెలియనంత 
చీకటి అగాధాల్లోకి 
నన్ను నేను తోసుకుంటూ అల్లుకున్న
నా నేను

అంతా ఈ ఒంటరితనంలోనే 

జవాబు లేనప్పుడు దాన్ని ప్రశ్న అంటారా?
తెలియడంలేదే 
మరి ఇది శేష ప్రశ్నా?

ఇలా జాగ్రత్తగా
ఆలోచనపై ఆలోచన పేర్చి కట్టుకున్న 
నేను 
ఎప్పటి వాడనో తెలియదు కానీ

నా ఆనందం నా ఒంటరితనం
నా ఒంటరితనం కన్నా గొప్పదానివైనపుడు 
నువు నా దానివి

Monday, February 10, 2020

**కాలం లేనిది**

నేను తనని ప్రేమిస్తానంతే 
తను నన్ను గొప్పగా ప్రేమిస్తుంది

వత్తిని మలిగించే చిన్న మంటలా 
వెచ్చనైన ప్రశాంతతతో 
నన్ను ఇష్టపడుతుంది

నేను హృదయంతో మాత్రమే ప్రేమిస్తానేమో

చల్లటి గాలి వీచినంత స్వేచ్ఛగా
గువ్వలు కూసినంత మంద్రంగా
మంచు పరుచుకున్నంత నిశ్శబ్దంగా 
మసక వెన్నెలంత దట్టంగా
మొలక పెరిగినంత ప్రాణంగా
సముద్రమంత కల్లోలంగా  

కాలంతో పాటు ప్రయాణించినంత వేగంగా

ఇంకా చాలా రకాలుగా ప్రేమిస్తుంది

ఒక్కోసారి అంత గాఢత అర్థం కాదు కూడా

నన్ను ఈ ప్రపంచానికి కట్టి ఉంచే 
ఆకర్షణ శక్తి తను

తన ప్రేమకు కాలనియమం లేదు

అదొక జీవధార
తనొక ప్రణయమూర్తి 

Monday, January 20, 2020

**ఎవరీవు**

ఈ కాలాంతర
మృత శకలానికి 
గులాబీ ముద్దులద్ది
మేల్కొల్పిన నీవెవరు

ఈ యుగాంతర 
శిలాజాన్ని
శుభ్రం చేసి సానపట్టి
అందంగా పేరు చెక్కిన చేతులెవరివి

ఆరిపోయిన కణాలలో 
జీవములూది
పచ్చటి మొలకలు 
మెరిపించిన ప్రాణమెవరిది

జ్వలించి జ్వలించీ
రాలిన బూడిదను 
నక్షత్రధూళిగా మలిపి
గుండెను మళ్ళీ చేసిన మనసెవరిది

నువ్వే కదూ

చెవులలో ముసిముసిగా నవ్వి
వేళ్ళకు స్పర్శను పరిచయం చేసి 

ఆకలిని చల్లర్చింది
ఏడుపును పొంగనిచ్చింది
బతుకును తీర్చింది

నీ సమక్షం కదా శాశ్వతం

Monday, January 13, 2020

**రంగుల రాత్రి**

చీకటి అంటారంతా

కానీ నువ్వేమో రంగుల రాత్రిని
అద్దంపై అద్ది
నా ఎదురుగా నిలబెడతావు

నన్ను తరచి తరచి
పేజీలు  తిప్పి తిప్పి
మళ్ళీ మళ్ళీ చదివినట్టు

అద్దంలో నేనేనా

కనిపించేది కూడా నిజం కాదని కదూ
నీకేదీ మామూలుగా చెప్పడం రాక కదూ

నాలో ఏం తప్పిపోయిందో తెలియడం లేదు
నేను కూడా మిగితావాళ్ళలాగే
రాత్రంటే చీకటని అలవాటు పడిపోయాను

నువ్వు ముందు నిలిపిన అద్దంలో చూసుకుంటే
నాకు తెలియని నేను

బహుశా ఇదేనేమో అసలైన రూపు
నువ్వు కూడా లోపల్లోపల ఇలాగే ఉంటావేమో కదూ

అయితే కొత్తగానే ప్రేమలో పడదాం
లోపలి మనుషులుగా

Tuesday, December 31, 2019

**సమక్షం**

ఏ దేవి వరము నీవో 
అని పాడుకోలేను

జీవన ప్రాంగణం అంతా
నువ్వే వెలిసినది నాకు తెలీలేదు

వర్షం వచ్చి పోయిన మర్నాడు ఉదయం కదా
మేఘాలు విడిపోయిన తరువాత 
కళ్ళు నులుముకుంటూ మొదటగా నిన్ను గమనించింది

ఎక్కడెక్కడో కదూ తిరిగింది
ఏం వెతుకుతున్నానో, ఎవరికోసం వెతుకుతున్నానో
తెలీకుండా గాలినై

నువ్వేమీ ఆలస్యంగా రాలేదు
నేనే మబ్బు కమ్మేసి ఉన్నాను

అనిపించిందిలే 
పొగచూరిన చిమ్నీ ఇవాళే తుడిచాను

శాశ్వతమైన చీకటిలో 
అవసరార్థం వెలుగు నింపి
నీ దగ్గరికే వచ్చేస్తాను

నన్ను గాయపరచవుగా
అంతగా అనిపిస్తే ప్రాణం పోయేంత గాయం చెయ్యి
ప్రేమలేని స్పృహ నాకు వద్దిక

నీ సమక్షానికి 
నువ్వెప్పుడు తలుపులు తెరుస్తావో తెలీదు 
ఎప్పటిలాగే నాకది వేకువ