Right disabled

Thursday, March 14, 2013

**సముద్రం**

ఎప్పుడైనా సముద్రాన్ని చూడటానికి వెళతాను
ఎలాఉన్నావంటూ తను
నా పాదాల కింద ఇసుకను తడిపి
నన్ను చల్లబరుస్తూ

నేను మాత్రం ఎప్పుడూ ఒకటే ప్రశ్న అడుగుతాను తనను
నువ్వు నాలో ఉన్నావా అని
నీలో లేకపోతే నీ కళ్ళముందు కూడా లేను
ఇదీ తన సమాధానం

అన్ని నీళ్ళు ఒక్కసారి చూస్తే
నాకెందుకో కళ్ళు చెమరుస్తాయి
సముద్రానికి దగ్గరగా కూర్చుని
బిగ్గరగా ఏడవాలనిపిస్తుంది

నాలోని హిమానీ నదాలు కరిగి ప్రవహించనీ
కరిగిన పై పెంకులనుండీ తెల్లటి కిరణాలు ప్రసరించనీ
నన్ను వెచ్చబరచనీ

నన్ను నేను తేల్చుకుంటూ
సముద్రం వైపు
మళ్ళీ అదే ప్రశ్నతో
నువ్వు నాలో ఉన్నావా అని
తిరిగి అదే సమాధానం
నీలో లేకపోతే నీ కళ్ళముందు కూడా లేను అని
నేను సముద్రాన్ని ప్రేమిస్తున్నాను
నాకు తనంత ప్రేమ కావాలి

Wednesday, March 13, 2013

**ఆమె**


కాలం కొట్టిన కొరడా దెబ్బలకు
చీరిపోయిన
వీపులాంటి ముఖం
కనీసం ముట్టుకోలేని
అరచేతులలో దాచుకుని
చితికిపోయిన ఆశల
కన్నీళ్లు
మసకబార్చిన లోకాన్ని
అసహనంగానే చూస్తూ
వేచియున్నాను
కాసింత ప్రేమకోసం
ఆలంబన కోసం
కొండంత సాంత్వననిచ్చి
భుజంతట్టే చేతుల్లాంటి మాటలకోసం
అంటుంది ఆమె నాతో

మట్టిలోకి నీళ్ళింకినట్టు
నేనామెను నాలో పొదుపుకుంటాను
పరిమళం గాలిని చుట్టేసినట్టు
నేనామెను హత్తుకుంటాను
తల్లి బిడ్డను కాచుకున్నట్టు
నేనామెను దాచుకుంటాను
ముళ్లపైబడిన
మందారపూవును
కుట్లువేసి భద్రపరచుకుంటాను
పొడిబారిన పెదవులపై
నెలవంకనొకటి దిద్ది
మురిపిస్తాను
తనను మళ్ళీ నడిపించుకుంటాను
పరిగెత్తనిస్తాను
మళ్ళీ తన అడవిలోకి
తనను వెళ్లిపోనిస్తాను

Friday, March 1, 2013

**బెత్తం దెబ్బలు**

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవమట
ఇదికూడా అర్థం కాని జనాలు, 
ఆ జనాల పిల్లలూ ఉన్నారిక్కడ
పొరుగింటి పుల్లకూర రుచేకానీ 
సొంత ఇంటి పప్పూ, పచ్చడీ ఆరోగ్యమే
మూతడు తాగండి చాలు అంటే 
సీసామొత్తం తాగి జోగుతున్న మూర్ఖులకు 
ఏం చెప్తే, ఎలా చెప్తే అర్థమవుతుంది
ప్రత్యేక మంత్రిత్వ శాఖ, మండలి పెడితే చాలదేమో
అయ్యవార్లకు మళ్ళీ బెత్తాలు సరఫరా చేయండి
వీపు విమానం మోతలు మోగితే
అమ్మా అని తెలుగులో అరిచినపుడు తెలుస్తుంది 
మాతృభాష అంటే మనలో ఇంకినదని
పైపైన పూసుకున్న పూత కాదని

**పిరికిపందలు**

ఒరేయ్ ఒరేయ్ ఒరేయ్
ముఖం చూపించలేక 
ముసుగులేసుకు తిరిగే 
పిరికి గొడ్లు మీరు

నలుగురూ నిలిచే చోట

మర్యాద మరిచి నడిచే
సంస్కారహీనులు మీరు

మీ చరిత్ర నెత్తుటి మరకలు

మీ లక్ష్యం మారణహోమం
దానికి యుద్ధమని ఓ నెపం

ఆదమరిచిన వేళ
దొంగచాటుగా దెబ్బతీసే 
మగతనం లేని 
మరుగుజ్జు మనస్తత్వాలు మీవి

వేల యేళ్లుగా ఇంకో దేశంపై దండెత్తని

శాంతి కాముకత భారతీయం

మంచితనం మౌనంగానే ఉంటుంది

కానీ మౌనం నివురుగప్పిన 
ప్రళయ భయంకరమని మీకు తెలీదులే


మంచితనమంటే చెడును కూడా సహించడమే కాదు 
సమయమాసన్నమైనపుడు 
దాన్ని తెగనరకడం కూడా

ఎక్కడికి పోతారు....?

ఈ ప్రపంచం చాలా చిన్నది