Right disabled

Wednesday, March 13, 2013

**ఆమె**


కాలం కొట్టిన కొరడా దెబ్బలకు
చీరిపోయిన
వీపులాంటి ముఖం
కనీసం ముట్టుకోలేని
అరచేతులలో దాచుకుని
చితికిపోయిన ఆశల
కన్నీళ్లు
మసకబార్చిన లోకాన్ని
అసహనంగానే చూస్తూ
వేచియున్నాను
కాసింత ప్రేమకోసం
ఆలంబన కోసం
కొండంత సాంత్వననిచ్చి
భుజంతట్టే చేతుల్లాంటి మాటలకోసం
అంటుంది ఆమె నాతో

మట్టిలోకి నీళ్ళింకినట్టు
నేనామెను నాలో పొదుపుకుంటాను
పరిమళం గాలిని చుట్టేసినట్టు
నేనామెను హత్తుకుంటాను
తల్లి బిడ్డను కాచుకున్నట్టు
నేనామెను దాచుకుంటాను
ముళ్లపైబడిన
మందారపూవును
కుట్లువేసి భద్రపరచుకుంటాను
పొడిబారిన పెదవులపై
నెలవంకనొకటి దిద్ది
మురిపిస్తాను
తనను మళ్ళీ నడిపించుకుంటాను
పరిగెత్తనిస్తాను
మళ్ళీ తన అడవిలోకి
తనను వెళ్లిపోనిస్తాను

No comments:

Post a Comment