Right disabled

Wednesday, November 25, 2015

**రాత్రులు**

జాలువారే మృదుమధుర పదజాలాలు
ఆలోచనలు విచ్చుకునే చీకటి తోటలు
అర్థం చేసుకుంటే పుట్టుకకూ మరణానికీ తేడా తెలియజెప్పే దేవతలు
కాలపు కన్నియ నవ్వుల కాఠిన్యాలు
అలసిపోని అనిమిషనేత్రాలకు స్వాగతాలు
అనేకానేక సంఘర్షణల అలుపు మజిలీలు
అనుకుంటే మరో ప్రపంచపు సింహద్వారాలు
వెలుతురు నేరాలకు కొనసాగింపు కొలమానాలు
ఒంటరి బ్రతుకులకు కాస్త ఉపశమనాలు
మండే మనసులకు పట్టపగళ్ళు
వందల వేల స్వప్నవేణువుల సంయోగ సంగీతాలు
మత్తెక్కించే నల్లచర్మపు జవరాళ్ళు

Sunday, September 20, 2015

**కొన్ని తీరాలు**

మహా సముద్రాలు విశ్రమించే చోట
కొన్ని తీరాలు కలుస్తాయి
శంఖాలు తమ శబ్దాలను మార్పిడి చేసుకుంటాయి
గవ్వలు తమ మేని మెరుపులు పంచుకుంటాయి

ఇసుక రేణువులు
తమ గుసగుసల శృంగారాన్ని వెదజల్లుతాయి
సాయంత్రాలను మలిగించడానికై
సూర్యుడిని వెలగనిస్తాయి
చంద్రుడు మెల్లగా నీటిలోకి జారుకుంటాడు
నిశ్శబ్దంగా చల్లగా వాటిని మరిగిస్తాడు

చివరకు తీరాలన్నీ విడిపోతాయి
సెగలు కక్కే ప్రేమ జాడలను
గోటి గుర్తులలో నింపేసి

Wednesday, June 17, 2015

**ఆకాశంలాంటి పిల్ల**

గుండె ఝల్లుమనిపించే ఉరుములు
వినసొంపుగా ఎప్పుడౌతాయో తెలుసా
అవి తన కాలి అందియల శబ్దాలైనపుడు

ప్రళయకాల ఝంఝామారుతాలు కూడా
పిల్లగాలిలా ఎప్పుడనిపిస్తాయో తెలుసా
అవి తన ముద్దు మాటలైనపుడు

నల్లటి పెద్ద మేఘాలు
చలువపందిళ్ళెప్పుడౌతాయో తెలుసా
అవి తన కురులైనపుడు

కళ్ళు మిరుమిట్లు గొలిపే మెరుపులు
బంగారు జలతారు మాలలెప్పుడౌతాయో తెలుసా
అవి తనను అలంకరించినపుడు

కుండపోతగా కురిసే వర్షం
మల్లెల జల్లు ఎప్పుడౌతుందో తెలుసా
అవి తన చూపులైనపుడు

అన్నిటినీ ఒకచోట చేరిస్తే
ఒక ఆకాశంలాంటి పిల్ల

అంతేలేని ఆకాశంలాంటి పిల్ల

Wednesday, March 25, 2015

**శృంగారాలు – 9**

ఆమె వచ్చింది
అతడిని జయించింది

ఒక చిన్న దీపం వెలిగించి
చీకటిని వెలుగును సమపాళ్లుగా సర్దింది

అతడిని కరిగించింది
నదిలా ప్రవహించమంది

అతడు ఆమె దేహమంతటా ప్రవహించాడు
రెండు జీవితాలు సస్యశ్యామలమయ్యాయి

Friday, March 13, 2015

**కొన్ని మాటలు**

ఒక్కోసారి తను అలాగే చూస్తూంటుంది
నిశ్శబ్దంగా మాట్లాడటమెలాగో
నాకు నేర్పుతున్నట్టు

గాలికి కదిలే కిటికీ తెర
టీపాయ్ మీద కప్పులు
చక్కటి రంగుల్ని పులుముకుని
తళతళలాడే తన చేతి వేళ్ళ గోళ్ళు

చాలాసార్లు
మేమిద్దరం కలిసి దిగిన ఫోటో

ఒక్కోసారి
తన చీర అంచు వెంబడి దారాల ముడులు

అప్పుడప్పుడూ
మెల్లగా చప్పుడు చేసే తన కాలి మువ్వలు

ఇలా వేటితో మాట్లాడినా
ఆ అర్థాలన్నీ నావద్దకే వచ్చి ఆగుతాయి

అవి చాలు
అంతే

Wednesday, February 25, 2015

Girl of Gift

She is beautiful
In and out
For she competes with nature
She herself manifests it

She is the fountain of youthfulness 
For she bestows me
The eternal boon
Of material and emotional 

She is the force of life
For she lives in me
Keeping me alive
In all my senses

She is an enigma
For I don’t know her to the end
Still she walks in to me
From nowhere 

She has the fire
For she turns me on 
On and on 
Burns with me in
Desire by desire

Tuesday, February 17, 2015

**నన్నొదిలెయ్**

కొలిమిలో ఎర్రగా కాల్చిన కొనకంచు వేడిని
ఎప్పుడయినా అనుభవించావా?

సెగలుకక్కే లావా
చుక్క వెంబడి చుక్క నీపై పడుతుంటే
నోరు మూసుకుని సహించగలవా?

బ్రహ్మజెముడు ముళ్లపై
నిన్ను ఎవరైనా బరబరా లాక్కెళితే
ఎలా ఉంటుంది?

నీ మెదడు తలలో ఉండగానే
ఎవరైనా గట్టిగా నొక్కేస్తే
అపుడు నీకేమనిపిస్తుంది?

నీ ఒంట్లో శక్తంతా ఉడిగిపోయి
బండకేసి నిన్ను బాదినట్టు అనిపిస్తే
నువ్వేంచేస్తావు?

తొందరగా నాలోంచి బయటికెళ్లిపొమ్మని
నేను నిన్ను అర్థించినట్టు

తొందరగా బయటకు వచ్చెయ్యమని
అంత నొప్పి భరిస్తూ నిన్ను కనేటప్పుడు
నీ తల్లి కూడా అడిగుండదు కదూ?

నన్నొదిలెయ్ ప్లీజ్
నన్నొదిలెయ్

ఎండ్ నోట్: నేనూ మగజాతికి చెందినవాడినే కాబట్టి, ప్రతి ఒక్కరిలోనూ విశృంఖలత్వం, కర్కశత్వం ఉంటాయి కాబట్టి, నాలోని సగటు మగతనపు రేపిస్ట్ ఇన్ స్టింక్ట్ కు వ్యతిరేకంగా రాసుకున్న కవిత.

Sunday, February 1, 2015

**లెట్ అజ్ లివ్ ఇన్ ఈచ్ అదర్**Let us live in each other**

ఒక మెటామార్ఫసిస్
రెండు బ్రతుకులు

కనుచూపు మేరకు అందని ప్రపంచపు క్లాసు రూములో 

కనిపించని జీవితమనే మాస్టారు 
చావుదెబ్బలు కొట్టి చాలాసార్లు ఊపిరాడకుండా చేసి
చెప్పిన పాఠాలనుకుందాం


దిస్ సొసైటీ లిటరల్లీ బ్రూటల్లీ రేప్డ్ అజ్ బోత్

పెట్టుడు కట్టుబాట్లతో
రిడిక్యులస్ హిపోక్రసీతో
ఐ సే యూ ఫాలో, ఐ రూల్ యూ సఫర్ సూత్రంతో
మానసికంగా
ఒకరకంగా నిన్ను ఒకరకంగా నన్ను 

యూ అండ్ మీ ఆర్ సిక్ ఆఫ్ దిస్

కదా

చేతులుకోసుకున్న రక్తపు మడుగుల నీడల్లో

వేదనామయ క్షణాలు లెక్కబెట్టుకున్న సమయాలు మనవి

పగళ్ళు మినిమైజ్డ్ రాత్రుళ్లై

రాత్రుళ్లు నెక్లెస్ రోడ్డుమీది ఫ్లడ్ లైట్ల పగళ్లై
కళ్ళు ఎర్రబారినతనాన్ని సంతరించుకున్న రోజులన్నీ మనవే

కోల్పోయినది కోల్పోయినట్టు వదిలేసినా

నువ్వూ నేనూ ఎదురుపడి దగ్గరైనా
ఒకరినొకరు గాఢంగా హత్తుకోవడానికి ససేమీరా ఒప్పుకోని
మర్యాదల ముసుగులు పాటిస్తున్నవాళ్లం

ఒంటరితనాన్ని వోడ్కాతో పాటు కలుపుకుని

సిగరెట్ల పీకల్లో కూరుకుని తాగిన అనుభవాలు
నీవి నావి మనిద్దరివీ
 

ఇంకేం చూస్తాం
ఏముంది చూడటానికి

నిద్రలో కూడా మేలుకునే ఉందాం

వానలై కురిసి ఎండలై మండి
చలై వణికి
గాలై వీచి నీరై నిండి
తాపాలై వగచి గుండెలై పగిలి
ఇంకేమైనా ఏదైనా పెద్ద తేడా లేదనుకుందాం

రా వచ్చెయ్ నేను పిలుస్తున్నా

కళ్ళు మిరుమిట్లు గొలిపే వేకువలోనైనా
లెట్ అజ్ లై అండర్ కవర్ 

చిక్కటి చీకటిలోనైనా

మన ఇద్దరి కళ్ల క్యాండిల్ లైట్ల వెలుగులో
డిన్నర్ చేద్దాం

ఏమైనా కట్టడమైనా కూలగొట్టడమైనా

మనిద్దరికే సాధ్యం
ఇక మనం ఏదీ అడ్డు తొలగించుకోనవసరం లేదు
మనిద్దరి అడుగుల శబ్దానికి అందులోని ఆవేశానికి
అవెప్పుడో భయపడి పక్కకు దొర్లిపోయాయి

ఇంత ఒంటరిగా బ్రతికాక

అంతకుమించి ఒంటరితనాన్ని నీలో చూశాక
ఎలా వదిలి వెళ్లమంటావు

లెట్ అజ్ నాట్ డెలిబరేట్ 

లెట్ అజ్ లిబరేట్ 
లెట్ అజ్ లివ్ ఇన్ ఈచ్ అదర్

Thursday, January 15, 2015

**కానుక**

ఆ రాత్రొక సమ్మేళనం
స్పర్శ తప్ప వేరొకటి లేదావేళ
అపుడు నేను తనూ ఇద్దరం అద్దాలమే
అద్దం అద్దం ఎదురుపడితే ప్రతిబింబాలొక లెక్కా

సారూప్యతలూ తేడాలూ పోట్లాడుకుంటే
ఒకరిలో ఒకరు మళ్ళీ మళ్ళీ పుట్టడమే ముఖ్యమని తేలిందక్కడ

అక్కడ మేమే
ఆ గర్భగుడి మాదే
కాలానికీ ప్రాణమున్నదని తెలీదు
మొట్ట మొదటిసారి అది మాట్లాడటం అక్కడే విన్నాను
ప్రవాహాన్ని కొంచెం నెమ్మది చేసుకున్నది కూడా తెలిసింది

కానుకకు అర్థమేమిటో తెలియకపోయినా
దాని అవసరమేమిటో చెప్పింది తను
ఆ రాత్రొక సమ్మేళనం
అంతే