నువ్వు మొదటిసారి కదూ రావడం
తలుపులేమీ వేసుండవు లే
వేసున్నా సరే
నీ మెత్తటి చేతులతో అలా
ఒక్కసారి తడితే తెరుచుకుంటాయి
బాగా పాత తలుపులు కదా
కిర్రుమంటాయేమో
చాలా కాలమైంది
రా
అలా గాలివాలుగా వచ్చిపో
నీ ఊపిరి సుగంధాలను వదిలి పో
అలా సడి చెయ్యని అడుగులేసి
రంగురంగుల పాద ముద్రలను అద్ది పో
దీపాలు వాటంతట అవే
గుప్పుమని రాజేసుకుంటాయేమో
ఎవరైనా వస్తారని ఆశ వాటికి
తటాలున వెలిగిన వాటిని చూసి
నువ్వేమీ కంగారు పడకు
నువ్వు వెళ్ళగానే ఆరిపోతాయి
నిండా పెద్ద పెద్ద గదులు కదా
శుభ్రం చేసుకునే ఓపిక లేదు
అలా దుమ్ము పట్టిపోయి
తడి వాసనేస్తూ ఉంటాయి
పుస్తకాల షెల్ఫులు పాతవైనా
వాటిని రోజూ వాడతాను కాబట్టి
అవి కడిగినట్టే ఉంటాయి
వాటి అద్దాలు తుడవడం
నాకు చాలా ఇష్టం
వస్తావా అని అడగటం నాకు ఎప్పుడూ ఇష్టం లేదు
రా అని మాత్రమే కచ్చితంగా పిలుస్తాను
రా
ఎప్పుడొస్తావ్
వచ్చి
ఎప్పుడెళ్ళిపోతావ్
ఏమనుకోకు
వస్తామని చెప్పి
అస్సలు రానివాళ్ళున్నారు
వాకిలి దాకా వచ్చి కూడా
వెనక్కి వెళ్ళినవారున్నారు
లోపలి దాకా వచ్చి
కనీసం కూర్చోకుండా
వెళ్ళినవాళ్ళున్నారు
నేనెప్పుడూ ఏమీ అనలేదు
తర్వాత ఏమీ అనుకోలేదు
రా మరి
ఎప్పుడొస్తావ్