Right disabled

Thursday, March 22, 2018

**ఇంకేంటి సంగతులు**

మ్మ్.... 
ఇంకేంటి సంగతులు 
చెప్పు 
అంటూ ఫోన్ అవతలివైపునుంచి 
నీ గొంతు అల్లరిగా 
టింగుమని గంట కొట్టినట్టు వినబడుతుంది 

లాజిక్ లు దొబ్బేస్తాయి 
రీజనింగ్ లు పటాపంచలైపోయి 
రైట్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది 

పుప్పొడిని గంధాలను వెదజల్లుతూ 
మధుస్రావమవుతున్న 
పూల గ్రంధాలను 
చదువుతున్నానని 

కుండల నిండా పట్టిన 
వెన్నెల పిండిని పిసికి 
గుండ్రంగా కొలిచి 
మళ్ళీ చంద్రులను చేస్తున్నానని 

విత్తనాలు నాటుతుంటే 
లేతాకులు వచ్చి 
నా బుగ్గలు తడుముతున్నాయని 

తీగలు దిగొచ్చి 
నా చెప్పులెత్తుకెళ్ళి 
కటిక నేలపై నడవమన్నాయని 

గడ్డి పూల గొంతులు 
మెల్లనివి కావడంతో 
వాటి తూగుడు మాటలు గాలి రొదకు సరిగా వినబడక 
అలా గడ్డిలోనే పడుకుని 
వాటి సంగతులు వింటున్నానని 

తినవా అంటూ చెట్లు నన్ను పండ్లతో 
నెత్తిన కొడుతున్నాయని 

సాయంత్రం అవుతుందనగా
మబ్బులు కప్పుకుని
అక్కడెక్కడో మలుపు తిరుగుతూ
సూరయ్య అలా అలవోకగా చూసి
కన్ను కొట్టి పోయాడని

ఆ వేళ సాయంత్రం తిన్న ఇడ్లీలు
అచ్చం చందమామల్లాగే
ఉన్నాయని

నీతో ఫోన్ లో మాట్లాడుతుండగానే
రాత్రొచ్చి నాకు చల్లటి దుప్పటి
తెలీకుండా కప్పిందని

ఇలాగే అనిపిస్తుంది

ఇష్టమొచ్చినట్టు ఆ ఊరూ ఈ ఊరూ తిరిగే గాలోడిని
నావి గాలి మాటలని
కానీ నీతో మాట్లాడితే
గాలి స్తంభిస్తుందని చెప్పాలనిపిస్తుంది

చెప్పలేక
నువ్వే చెప్పు
అనేస్తాను

No comments:

Post a Comment