Right disabled

Saturday, November 30, 2013

**శృంగారాలు - 5**

మన ఒంట్లో మలిగే దీపాలను చూసి 
సూర్యుడు త్వరత్వరగా సాయంత్రాన్ని కట్టేసి 
తన ఒంట్లో దీపాన్ని అటువైపు మరల్చేస్తాడు 

ఆ దీపాల వెచ్చదనానికి 

నూలుపోగులన్నీ కాలిపోతాయి 
ఒళ్ళు దాచుకోవడానికి 
నీకు నేను నాకు నువ్వు తప్ప ఏదీ మిగలదు 

అలాగే ఒకరినొకరు దాచుకుంటూ 

ఒకరి దీపాలకొకరు ఇంధనమిస్తూ
ఎప్పటికో తేరుకుంటాం

ఒకరినొకరు చూడలేనంత సిగ్గుతో 
అటు నువ్వు ఇటు నేనూ 
తుర్రుమని పారిపోతాం

**శృంగారాలు - 4**

నీవొక మధు శిల్పానివి 
అంతవరకూ 
నీలో అంతర్వాహినులుగా ప్రవహించే 
ఎన్నో అందాలు 
ఉబికి వచ్చి 
ఇద్దరి తనువులనూ సస్యశ్యామలం చేస్తాయి 

నీ అందాన్ని తాగి తాగి

తెల్లవార్లూ 
నేనా మత్తులో జోగుతూ ఉంటాను 
నువ్వు మాత్రం మెలకువలోనే ఉండి
నన్ను నీలోకి లాక్కుంటూనే ఉంటావు

Thursday, November 28, 2013

**శీతాకాలపు చీకటి ఉదయం **

చిక్కటి చీకటి
మెత్తటి చీకటి
అంతూపొంతూలేని చీకటి
చల్లగా పలకలు పలకలుగా కురిసింది
సూర్యుడి అవసరమే లేకుండా
తనకు తానే ఉదయించింది

ఒక్కటే ఏరు
ఒక్కటే ఒడ్డు
ఒకే గుడి
ఒక్కడే శివుడు
మేం మాత్రం ఇద్దరం
గుడి చావిడిలో ఒక మూలగా
గువ్వల్లా ఒదిగి

మా ఆకలి
అప్పటికప్పుడు దొరికిన బిర్యానీ పొట్లానికి తెలుసు
మా దాహం
మెట్లదగ్గరున్న బోరింగు పంపుకు తెలుసు
మేం కోరుకున్న ప్రశాంతత
రొదపెట్టే కీచురాళ్ళకు తెలుసు

అప్పుడు లోకం
దట్టమైన చీకటినీ పల్చటి వెన్నెలనూ కలిపి
గమ్మత్తయిన దేవతా వస్త్రాన్ని నేస్తుంది

కాస్త వెచ్చదనం కోసం
దగ్గరకు చేరిన మేము
కాసేపటికి తల్లీబిడ్డలమయ్యాం
పిల్లమారాజులా ఆ పిల్ల ఒడిలో నేను
ఆ మహాదేవుడి ముందు వెలిగే ఆముదపు దీపంలా
రెండు జతల కళ్ళు వెలుగుతూనే ఉన్నాయి
కామాన్ని దరిచేరనియ్యని కాటుకలాంటి క్షణాలు
అంటీఅంటకుండా దొర్లిపోయాయి

వెళ్ళిపోయింది
ఓదార్చలేని గుర్తుల వెలుగుల్లో నను వదిలేసి
చీకట్లలో తప్పిపోయిందనే అనుకున్నాను
అంత కాంతిలో చీకటినీ సృష్టించుకోవడమెట్లాగని అడిగితే
గట్టిగా కళ్ళు మూసుకుని అరచేతులతో కప్పుకోమని
ఓ మిత్రుడు చెప్పేవరకూ

తను నాలోకే తప్పుకుంది
తెలుస్తోంది
ఎంత వెలుతురును పరిచినా
చీకటినీ కల్తీ చేయలేమని
నాలో చీకటి ఎప్పుడయినా ఉదయిస్తుందని

Friday, November 22, 2013

**వడపోత **

ప్రతీ పొద్దునా ప్రతీ సాయంత్రం 
మిసిమి కాంతుల వేళల్లో జాలువారే
పల్చటి కిరణాల్ని 
కళ్ళు అరమోడ్పులు చేసి 
వడకట్టేందుకు ప్రయత్నిస్తాను 
నువ్వు నన్ను చూసిన చూపుల ముక్కలేమైనా దొరుకుతాయేమోనని 

అంత ఎత్తున నిలబడి 

ఒక్కోసారి పసిపిల్లలా పాకుతూ 
ఇంకోసారి పడుచుపిల్లలా ఉరకలేస్తూ 
మరోసారి ఎవరో తరుముతున్నట్టు పరిగెత్తుతూ 
నన్ను ఒరుసుకుంటూ పోయే గాలిని 
చేతులు బార్లాజాపి వడకట్టేందుకు ప్రయత్నిస్తాను 
నీ మాటల సరాలేమైనా తేలుతూ వస్తాయని 

కరిగిపోయిన కాలాల్నీ

కదిలిపోతున్న క్షణాల్ని 
మాసిపోయిన గోడల మధ్య అల్మారాలలో 
మగ్గిపోతున్న ఎప్పటివో అనుభవాలనూ 
మస్తిష్కంలోకి బలవంతంగా నెట్టి
వడకట్టేందుకు ప్రయత్నిస్తాను 
నువ్వు పంచిన అనుభూతులేమైనా ఏరుకోవచ్చని 

వడకట్టగా వడకట్టగా

అన్నిటిలోనూ నేనే కనిపిస్తున్నప్పుడు 
ఒక్కసారి ఆగి కాసేపు కూర్చుని ఆలోచిస్తే
నువ్వు కనపడాలంటే 
నన్ను నేను వడకట్టుకోవాలని తెలుస్తుంది 

Tuesday, November 19, 2013

**శృంగారాలు - 3**

చీకటి పడగానే
మనకొక తెల్లవారుజాము
ఒళ్ళు విరుచుకుంటూ
ప్రేమ వర్ణపు సూర్యోదయాన
నీ కనుచివరలకంటుకున్న చీకటి
అసంకల్పిత కదలికల వెలుగులో
కరిగిపోతుంది

వయసు నడి మధ్యాహ్నపు నిట్టూర్పుల సెగలో
వలపు కార్మికుల్లా చెమటోడ్చుతూ
ఒకరిలోకొకరు తవ్వుకుంటూ పోతాం
ఒకరికొకరు దొరికేంతవరకూ
ఎంతదాకైనా

**ఓటమి కథ**

ఎప్పుడయినా వీలున్నపుడు
లేదా ఒక్కోసారి వీలు చేసుకుని

శ్మశానానికి వెళ్తాను
మట్టిలో కలిసిపోయి
శిధిలమైపోయిన ఎన్నో కథలుంటాయక్కడ
ఓటమి కథలుంటాయక్కడ

ఆ కథలన్నీ వింతైన పరిమళాలుగా మారి
అక్కడక్కడే తిరుగుతుంటాయి
అవక్కడుంటాయని కాటికాపరిక్కూడా తెలీదు కాబోలు
చచ్చినోళ్ళకాడికి బతికున్నోడికేంపనీ అన్నట్టు
నువ్వేంది సామీ ఇట్టా వత్తావంటూ
అడుగుతాడు


వాడికి సమాధానంగా ఒక చిన్న నవ్వు నవ్వుతాను
అక్కడ నేను పీల్చుకున్న కథలన్నీ వాడికి చెబితే
నా తల వేయి వ్రక్కలవుతుందేమోనని భయం నాకు
ఆ కథలనలాగే మోస్తూ తిరుగుతాను

వాటిల్లో నాదో కథ
అయితే ఇంకా నేనెవరికీ చెప్పలేదు
చెప్పను

Saturday, November 16, 2013

The winged Bird

See
A bird comes towards you
All the time
With its wings made of clouds
Grey and white
It recites the sky's message
Can you hear that?
If you do not
Try to befriend it
Feed it with some sweet words
It gives you eternity
The poetry

Saturday, November 2, 2013

In to the Blue

Lets get in to the Blue
Unconditional Blue
What ever you think it is 
What ever I think it is 
We are in blue
We were shot at each other 
In to the Blue