Right disabled

Thursday, November 28, 2013

**శీతాకాలపు చీకటి ఉదయం **

చిక్కటి చీకటి
మెత్తటి చీకటి
అంతూపొంతూలేని చీకటి
చల్లగా పలకలు పలకలుగా కురిసింది
సూర్యుడి అవసరమే లేకుండా
తనకు తానే ఉదయించింది

ఒక్కటే ఏరు
ఒక్కటే ఒడ్డు
ఒకే గుడి
ఒక్కడే శివుడు
మేం మాత్రం ఇద్దరం
గుడి చావిడిలో ఒక మూలగా
గువ్వల్లా ఒదిగి

మా ఆకలి
అప్పటికప్పుడు దొరికిన బిర్యానీ పొట్లానికి తెలుసు
మా దాహం
మెట్లదగ్గరున్న బోరింగు పంపుకు తెలుసు
మేం కోరుకున్న ప్రశాంతత
రొదపెట్టే కీచురాళ్ళకు తెలుసు

అప్పుడు లోకం
దట్టమైన చీకటినీ పల్చటి వెన్నెలనూ కలిపి
గమ్మత్తయిన దేవతా వస్త్రాన్ని నేస్తుంది

కాస్త వెచ్చదనం కోసం
దగ్గరకు చేరిన మేము
కాసేపటికి తల్లీబిడ్డలమయ్యాం
పిల్లమారాజులా ఆ పిల్ల ఒడిలో నేను
ఆ మహాదేవుడి ముందు వెలిగే ఆముదపు దీపంలా
రెండు జతల కళ్ళు వెలుగుతూనే ఉన్నాయి
కామాన్ని దరిచేరనియ్యని కాటుకలాంటి క్షణాలు
అంటీఅంటకుండా దొర్లిపోయాయి

వెళ్ళిపోయింది
ఓదార్చలేని గుర్తుల వెలుగుల్లో నను వదిలేసి
చీకట్లలో తప్పిపోయిందనే అనుకున్నాను
అంత కాంతిలో చీకటినీ సృష్టించుకోవడమెట్లాగని అడిగితే
గట్టిగా కళ్ళు మూసుకుని అరచేతులతో కప్పుకోమని
ఓ మిత్రుడు చెప్పేవరకూ

తను నాలోకే తప్పుకుంది
తెలుస్తోంది
ఎంత వెలుతురును పరిచినా
చీకటినీ కల్తీ చేయలేమని
నాలో చీకటి ఎప్పుడయినా ఉదయిస్తుందని

3 comments:

  1. చీకటి, చల్లగా పలకలు పలకలుగా .... సూర్యుడి అవసరం లేకుండా .... ఉదయించింది
    ఒక్కటే ఏరు, ఒక్కడే శివుడు .... మేం ఇద్దరం గుడి చావిడిలో ఒక మూలగా గువ్వల్లా ఒదిగి, .....
    వెచ్చదనం కోసం దగ్గరకు చేరిన మేము కాసేపటికి తల్లీబిడ్డలమయ్యాం! ....
    ఎంత వెలుతురు పరిచినా చీకటినీ కల్తీ చేయలేమని, నాలో చీకటి ఎప్పుడయినా ఉదయించొచ్చని

    *శీతాకాలపు చీకటి ఉదయం * చాలా గొప్ప గా రాసావు .... అభినందనలు యగ్నపాల్.

    ReplyDelete
  2. ధన్యవాదాలు చంద్ర శేఖర్ జి....

    ReplyDelete