Right disabled

Friday, November 22, 2013

**వడపోత **

ప్రతీ పొద్దునా ప్రతీ సాయంత్రం 
మిసిమి కాంతుల వేళల్లో జాలువారే
పల్చటి కిరణాల్ని 
కళ్ళు అరమోడ్పులు చేసి 
వడకట్టేందుకు ప్రయత్నిస్తాను 
నువ్వు నన్ను చూసిన చూపుల ముక్కలేమైనా దొరుకుతాయేమోనని 

అంత ఎత్తున నిలబడి 

ఒక్కోసారి పసిపిల్లలా పాకుతూ 
ఇంకోసారి పడుచుపిల్లలా ఉరకలేస్తూ 
మరోసారి ఎవరో తరుముతున్నట్టు పరిగెత్తుతూ 
నన్ను ఒరుసుకుంటూ పోయే గాలిని 
చేతులు బార్లాజాపి వడకట్టేందుకు ప్రయత్నిస్తాను 
నీ మాటల సరాలేమైనా తేలుతూ వస్తాయని 

కరిగిపోయిన కాలాల్నీ

కదిలిపోతున్న క్షణాల్ని 
మాసిపోయిన గోడల మధ్య అల్మారాలలో 
మగ్గిపోతున్న ఎప్పటివో అనుభవాలనూ 
మస్తిష్కంలోకి బలవంతంగా నెట్టి
వడకట్టేందుకు ప్రయత్నిస్తాను 
నువ్వు పంచిన అనుభూతులేమైనా ఏరుకోవచ్చని 

వడకట్టగా వడకట్టగా

అన్నిటిలోనూ నేనే కనిపిస్తున్నప్పుడు 
ఒక్కసారి ఆగి కాసేపు కూర్చుని ఆలోచిస్తే
నువ్వు కనపడాలంటే 
నన్ను నేను వడకట్టుకోవాలని తెలుస్తుంది 

No comments:

Post a Comment