Right disabled

Thursday, May 23, 2019

**తప్పెవరిదీ కాదు**

నీ మాటలు నన్ను మెత్తగా కోసిఉంటే
అది నీ తప్పు కాదు

పూలు ముళ్లవుతాయని
తయారుగా ఉండకపోవడం నా తప్పు కూడా కాదు

ఏమయితేనేం

జీవితమంతా పరుచుకుని
ఎక్కడ అడుగేసినా దిగబడి
గాయాలను ఆరనీయని
ఒక్క బాధ

ఇలాంటిది
కనీసం ఒక్క బాధ అయినా లేకపోతే

గుట్టుగా ఎవరికీ తెలియకుండా ఏడవకపోతే
బ్రతుకెట్లా గడిచేది

ఖర్చయిపోనీ కొంత కాలం
పోతే పోయింది
ఇంతదాకా ఎలాగో గడిచిపోయింది

నిస్సంకోచంగా నీ కౌగిట్లోకి నడిచొస్తానన్నవాడిని
ఇంకేమీ వీలవ్వక
అంతే నిస్సంకోచంగా
నడవడానికే సిద్ధపడినప్పుడు
బాధను హత్తుకోవాల్సిందే కదా

పోనీ అంతా ఆవిరైపోనీ
ఆఖరి అవశేషాలు కూడా
అలా గాల్లో కలిసిపోనీ

నీ గుర్తుగా మిగిలిన బాధను మాత్రం వదిలేది లేదు
గాయాలు జ్ఞాపకాలే
కొన్ని మానిపోయినా మచ్చలు మిగులుస్తాయి
కొన్ని అసలు మానవు

వెళ్లిపోవడమే
అలా నడుస్తూ వెళ్లిపోవడమే

Tuesday, November 6, 2018

**ఇంతకన్నా ఏం చేయగలను?**

మనసు ముక్కలైతేనేం
మంచిదే

ముక్కలన్నీ ఏరుకుని
తిరగలిలో వేసి
ఇంకా నున్నటి పొడి చేస్తాను

పర్వత శిఖరాలపై కొంత
పక్షుల రెక్కలపై కొంత
పువ్వుల రేకులపై కొంత
నదుల్లోనూ
గాలిలోనూ
వీలైతే ఇంకొంచెం ఎక్కువగా
సముద్రంలోనూ

నిండు మేఘాలు జాలువార్చే
జలతారు చినుకుల సరాల్లోనూ

చిగురించే ఆకులపైనా
రాలిన పండుటాకులపైనా

అలా చల్లి వస్తాను

పొగమంచులో మరిచిపోకుండా కలిపేసి వస్తాను
అరణ్యాన్ని అస్సలు వదలను

నడిచిన దారులకు కొంత పంచుతాను

అవన్నీ తిరిగొచ్చి 
దీపం చుట్టూ 
తెర కట్టుకుని చెప్పే కథలన్నీ 
వెల్లికిలా పడుకుని వింటాను

వాటి మాటల్లోని 
గంభీరమైన అందం కోసం 
ఎదురుచూస్తాను

సాకారమై వస్తే మోకరిల్లి
నన్ను నేను అర్పించుకుంటాను

లేదూ

అంతటి అందాన్ని 
ధ్యానిస్తాను

ఇంతకన్నా ఏం చేయగలను? 

Tuesday, October 9, 2018

**అంతే కదూ**

వెతకడం 
ఎదురుచూడటం 
వేరు వేరు

దేనికోసమో
ఎవరికోసమో 
లేదా ఎందుకోసమో 

ఎదురుచూస్తూ వెతకడం 
కేవలం ఎదురు చూడటం

ఎంత తేడా

ఫలానా చోట ఉంటానని చెప్పలేదు
ఎవరూ ఎప్పటికైనా వస్తాననీ అనలేదు

ఈ వెతుకులాట
ఎదురుచూపు 
ఎవరో ఏమిటో 
ఎప్పుడో ఎక్కడో తెలియకపోయినా
వ్యర్థం కావనే అనిపిస్తుంది

నాలో నేను వెతుక్కుంటూ పోవడం 
అనవసరమైన శ్రమ

నాకు నేను తెలియకపోవడమేమిటి
ఇంకొకరి గురించి తెలుసుకుని 
నేను సాధించేదేమిటి

కేవలం వెతకాలి
ఎదురుచూడాలి
అంతే

ఏం మాట్లాడవేంటి
అంతేకదూ

Monday, October 8, 2018

**నదీమ దేహం**

దేశ దిమ్మరికేంలే
వాడలాగే తిరుగుతూ ఉంటాడు

నేను కూడా దాదాపు అంతే
నేనొకచోటే ఉన్నా
నేవెళ్లను కానీ
నిలకడ ఉండదు

కళ్ళు మూసుకుని తిరిగొస్తూ ఉంటా

చూడగలిగినవి చాలా
కనురెప్ప కదిలిస్తే చాలు

ఒక్క క్షణమే ఆగింది
అలలు పోటెత్తినట్టుండే 
నిన్ను చూసినపుడు

కేవలం చెయ్యే పట్టుకున్నది
వదిలేసినా
వదిలినట్టు లేదు

ఏముంటావే
ఆకాశంలో నదిలాగా

నదిలో చుక్కలు రాలి
తేలుతూ పోతున్నట్టు 
మెరుస్తూ

మెరుపు మెరుపుకూ 
వర్షం, మధ్యలో
జడి పట్టినట్టు

నువ్వుంటే
చుట్టూరా 
వర్షం వెలిసిన అడవి 
ఘాటు పరిమళం 


తిరిగి తిరిగి ఆగితే 
బాగుంది

ప్రయాణమిక చాలు
గమ్యం ఇదే
చూసింది చాలు
మరణం కావాలిప్పుడు

అంత అందాన్ని చూసినపుడు
ఆ కళ్ళతో ఇంకేదీ చూడకూడదు

Sunday, September 23, 2018

**పాత సీసా**

అనంతకోటి సముద్రాల నుండీ
కొట్టుకొచ్చిన సీసా ఒకటి

అరేబియా సముద్ర తీరాన
కళ్ళు కాళ్ళు తడుపుకుంటున్న 
నా వద్దకొచ్చి ఆగింది

ఏదో పత్రమొకటి అందులో 
అర్థం కాని భాషలో
మెత్తటి ఆశలను నింపుకుని
హృదయపూర్వకంగా రాసిన లేఖ 


ప్రేమను నింపుకున్న 
ఏ కంటి వెలుగులోనో రాసిన లేఖ కాబోలు
వెచ్చటి స్పర్శ తెలుస్తుంది

రాస్తున్నప్పుడు ఆ చేతులు
ఎంత వణికాయో 
ఆ ఆర్ద్రత తెలుస్తుంది

ఒక గుండె బద్దలైన సందర్భం
ఆ అక్షరాల్లో ప్రతిధ్వని


అలల హోరు
ఆర్తిగా పిలిచిన ఆఖరి పిలుపును కూడా 
ఆ పాత సీసాతో పాటు మోసుకొచ్చిందేమో కదా

ఎన్నాళ్ళ వేర్పాటో
ఈ సందేశం పంపిన మనిషి 
ఎవరో
అర్థం కాకపోయినా
అది అందుకోవడానికి 
నేనెవరినో 

అంత కలచివేసే బాధను 
లోలోపల అదుముకోవడం 
కష్టం కాదూ

మళ్ళీ బిరడా బిగించి 
బలం కొద్దీ తిరిగి సముద్రంలోకి విసిరేస్తే 
ఆ ఆలోచన కష్టంగా అనిపించింది

ఎవరి దగ్గరితనమో
విలువైనది కదా
చూద్దాం

చాలా కాలంగా అలమారాలో
ఒక అర ఖాళీగా ఉంది

పూరించాలి