Right disabled

Wednesday, May 22, 2013

**సంధ్యా కాంత**

ఆమె స్నానం చేసి  తీరికగా తలారబెట్టుకుంటోంది 
తన కళ్లలోని సంధ్యను చూసి 
మైకం కమ్మిన సూర్యుడు  
సముద్రంలోకి జారిపోతున్నాడు 

చిక్కటి చీకటి చీర కట్టుకొచ్చి 
ప్రకృతిని మొత్తం తనతో తీసుకొచ్చి  
నా పక్కన కూర్చుంది 

తన వెలుగులో  
నేను మలిగిపోయాను 

Saturday, April 27, 2013

----అ"ద్వితీయం"----

సముద్రం లాగా ఆమె
లోపలెంత అలజడి ఉన్నా
బయట అంతా ప్రశాంతం

అప్పుడప్పుడూ మాత్రమే తన
 కళ్ళల్లో
తుపానులు రేగుతూ ఉంటాయి
వాటన్నిటినీ చీర కొంగులో
మెల్లగా 
దాచేసుకుంటుందామె

మళ్ళీ
తన కళ్లలోని ఆకాశాలు 
నిర్మలమవుతాయి
పసి చిరునవ్వొకటి 
పెదాల పైకి పారాడుతుంది

అదొక రెండవ ఉదయం 

తన ప్రపంచానికీ
ఆ ప్రపంచంలో తిరుగాడే 
నాకు

Friday, April 26, 2013

**కృష్ణ జ్వాల**

అది కనబడనందుకేమో
నేను దానిని
కృష్ణ జ్వాల
అని పిలుచుకుంటాను

వెలుగుతున్నట్టు
కంటికి కూడా తెలియకుండా
ఆవలి తీరాల గట్టును
దర్శింపజేస్తుంది
చీకట్లో చీకటిగానే
జ్వలిస్తూ

Thursday, March 14, 2013

**సముద్రం**

ఎప్పుడైనా సముద్రాన్ని చూడటానికి వెళతాను
ఎలాఉన్నావంటూ తను
నా పాదాల కింద ఇసుకను తడిపి
నన్ను చల్లబరుస్తూ

నేను మాత్రం ఎప్పుడూ ఒకటే ప్రశ్న అడుగుతాను తనను
నువ్వు నాలో ఉన్నావా అని
నీలో లేకపోతే నీ కళ్ళముందు కూడా లేను
ఇదీ తన సమాధానం

అన్ని నీళ్ళు ఒక్కసారి చూస్తే
నాకెందుకో కళ్ళు చెమరుస్తాయి
సముద్రానికి దగ్గరగా కూర్చుని
బిగ్గరగా ఏడవాలనిపిస్తుంది

నాలోని హిమానీ నదాలు కరిగి ప్రవహించనీ
కరిగిన పై పెంకులనుండీ తెల్లటి కిరణాలు ప్రసరించనీ
నన్ను వెచ్చబరచనీ

నన్ను నేను తేల్చుకుంటూ
సముద్రం వైపు
మళ్ళీ అదే ప్రశ్నతో
నువ్వు నాలో ఉన్నావా అని
తిరిగి అదే సమాధానం
నీలో లేకపోతే నీ కళ్ళముందు కూడా లేను అని
నేను సముద్రాన్ని ప్రేమిస్తున్నాను
నాకు తనంత ప్రేమ కావాలి

Wednesday, March 13, 2013

**ఆమె**


కాలం కొట్టిన కొరడా దెబ్బలకు
చీరిపోయిన
వీపులాంటి ముఖం
కనీసం ముట్టుకోలేని
అరచేతులలో దాచుకుని
చితికిపోయిన ఆశల
కన్నీళ్లు
మసకబార్చిన లోకాన్ని
అసహనంగానే చూస్తూ
వేచియున్నాను
కాసింత ప్రేమకోసం
ఆలంబన కోసం
కొండంత సాంత్వననిచ్చి
భుజంతట్టే చేతుల్లాంటి మాటలకోసం
అంటుంది ఆమె నాతో

మట్టిలోకి నీళ్ళింకినట్టు
నేనామెను నాలో పొదుపుకుంటాను
పరిమళం గాలిని చుట్టేసినట్టు
నేనామెను హత్తుకుంటాను
తల్లి బిడ్డను కాచుకున్నట్టు
నేనామెను దాచుకుంటాను
ముళ్లపైబడిన
మందారపూవును
కుట్లువేసి భద్రపరచుకుంటాను
పొడిబారిన పెదవులపై
నెలవంకనొకటి దిద్ది
మురిపిస్తాను
తనను మళ్ళీ నడిపించుకుంటాను
పరిగెత్తనిస్తాను
మళ్ళీ తన అడవిలోకి
తనను వెళ్లిపోనిస్తాను