Right disabled

Thursday, September 20, 2012

**దివ్యత్వం**

తను నడిచిన దారిలో
ఎండిన ఆకులు సైతం
పచ్చదనాన్ని పులుముకుంటాయి

తన గాలి సోకితే
వాడిపోయిన పువ్వులు
వింత రంగులు నింపుకుంటాయి

తన కురుల నల్లదనానికి
చీకటికే సిగ్గేసి
తన మాటున
తనే దాక్కుంటుంది

తన పెదవుల ఎరుపై
మళ్ళీ పుట్టేందుకు
ఎర్రతురాయి పూలు
వెంటనే రాలిపోతాయి

తన దేహపు మృదుత్వాన్ని
తాకేందుకు
మెత్తటి పట్టు తహతహలాడుతుంది

తను స్నానమాడిన పుణ్యానికి
సెలయేటి నీళ్ళు
సెగలెక్కి పొగలు కక్కుతాయి

తన వలువలను మోసినందుకు
బండరాళ్ళు
తమ జన్మ ధన్యం చేసుకుని
పులకింతల్లో కరిగిపోతాయి

తనను తాకి పండువెన్నెల
సరికొత్త వెండి సొబగులు
సంతరించుకుంటుంది

ఆ ప్రకృతి మానసపుత్రికను
చూస్తే
నగ్నత్వం కనిపించదు
అందంలోని దివ్యత్వం
కనిపిస్తుంది  

ఆరాధించకుండా
 
ఎలా ఉండగలను....

Tuesday, September 18, 2012

**పట్టెమంచం**


కిర్రుకిర్రుమంటుంటే
వయసైపోయిందేమిటే
అని అడిగాను
నాకు వయసైపోలేదురా
మీ వయసుజోరే పెరిగిందంటూ
నాతో సరసాలాడింది

ఎన్ని జంటలను మోసావో
నీకు ఓపికెక్కువే అని అంటే
మొదట్లో ఇబ్బందిగానే ఉండేది
తర్వాత అలవాటైపోయిందిరా అబ్బాయ్
అంటూ వేదాంతం మాట్లాడింది

పరుపులు, దిండ్లు, దుప్పట్లు మారాయి కానీ
నేను మారలేదంటూ
పైపై సొబగులెన్నున్నా
అంతఃసౌందర్యమే ముఖ్యమంటూ
ఆత్మ తత్వాన్ని
అవలీలగా బోధించేసింది
అనుభవం రంగరించిన
పండు ముత్తైదువ లాంటి
మా పట్టెమంచం

Monday, September 17, 2012

**సంచలన**


నేనొక రేణువును
అణువులు కలిసిన
అతి చిన్న రేణువును
సంచలన రేణువును

ఉదయకాంత
విశాల ఫాలంపై విరిసే
ఎరుపు రేణువును

కిందకురికే చినుకులోని
వేగాన్ని పుణికి పుచ్చుకున్న
చన్నీటి రేణువును

చిరు మొగ్గలోనుంచీ
కొత్త పుట్టుక పరిమళించే
బతుకు రేణువును

స్వేచ్చను నింపుకున్న
విహంగాల కువకువల్లో
అవిశ్రాంత విహార రేణువును

లేతాకుపచ్చ చిగురుటధరాల
ముద్దు పొదిగిన రేణువును

బారులు తీరిన
అమ్మ చెట్ల వేర్ల తడిలోని
ప్రేమ రేణువును

గిరగిరా తెరిగే గాలిలోని
ప్రాణవాయువు హృదయ
స్పందనా రేణువును

నివురుగప్పిన అగ్నిపర్వతాల
అంతరాళ నరాల్లో ప్రవహించే
శిలాద్రవ రేణువును

ఉవ్వెత్తున ఎగసే
ఉత్తుంగ తరంగాన
ఉరకలు వేసే ఉత్సాహ రేణువును

అంతుచిక్కని కడలి
అంతర్గర్భాన
అలసి నిద్రించే
పసి రేణువును

భరించే పుడమితల్లి
శిరసున భాసించే
సహన రేణువును

పరవళ్ళ పరుగులెత్తే
నదీ నాదాలలోనూ
జలపాతాల ఇంద్రజాలంలోనూ
జోరుతగ్గని వేగ రేణువును

జీవితాలను వికసింపజేసే
దినకరుని కిరణా రసాల
సరస్సులో స్నానమాడే
వెలుగు రేణువును

అంతర్మధనపు దుఃఖాన్ని
అంతూపొంతూ లేని సుఖాల్ని, విశ్రాంతిని
తనలో దాచుకున్న రాత్రి
వెదజల్లే చీకటి రేణువును

సమస్త జీవజాలాన
ప్రకటితమవుతున్న
ప్రాణ రేణువును

అడవి అతివ విరబోసిన
అనంత వర్ణ విన్యాసాల
కురుల ఛాయా రేణువును

వనకన్యక కలికి కులుకులో
కలగలిసిన
వలపు రేణువును

తన గొంతు గానాల
గమకాల హారాన
శబ్ద రేణువును

తన కంటి మిసిమి చూపులో
కురిసే కరుణా రేణువును

కోటానుకోట్ల రేణువుల్లో
నేనొక రేణువును

ప్రకృతి రేణువును
సంచలన రేణువును

Thursday, September 6, 2012

**ఇద్దరం**

 పున్నమి చంద్రుడినడిగి
పండు వెన్నెలలు
బానలనిండా నింపుకొచ్చాను
స్నానం చేద్దువుగాని

బాల భానుని
బుగ్గలు పుణికి
ఎర్రదనం తీసుకొచ్చాను
బొట్టు పెట్టుకుందువు గాని

నీకై దాచిన
ప్రేమను కొంచెం
పట్టుపురుగులకు ఇచ్చి
అవి ఇచ్చిన పోగులతో
చీరనేసి
లేత చిగుర్లనడిగి
పచ్చరంగేసి
తంగెడుపూలు నవ్వితే
రాలిన
పసుపు పుప్పొడిని
అంచుల్లో చల్లి తీసుకొచ్చాను
కట్టుకుందువు గాని

దారిలో ఎదురుపడ్డ
అడవిపూల సౌరభాలను
గాజు బుడ్డీలో పోసుకొచ్చాను
నిండా పూసుకుందువు గాని

తుమ్మెదల్ని కదిపితే
తియ్యటి తేనెలిచ్చాయి
ఆ మధురాల్ని
కడుపునిండా తాగుదువు గాని

పొందికగా
పొదరిల్లు కట్టాను
ఇద్దరం ఒద్దికగా
ఒదిగిపోదాం గాని

ఓయ్ పిల్లా
నాతో వస్తావేమిటే

Wednesday, September 5, 2012

**నింపుతూ నిండుతూ**

 తను నింపుతూ ఉంటుంది

నా నిదురను
నిజం కాని కలలతో

నా మనో ఫలకాన్ని
నిజమైతే బాగుండుననిపించే
తన ఊహల రాతలతో

తను నిండుతూ ఉంటుంది

తడి ఆరిపోయిన
నా కనుల కొలకుల కొలనుల్లో
కన్నీటి కడగళ్లై

నేను రాసే రాతలో
తనకోసం బతికున్న
ఆశల పరవళ్ళై