Right disabled

Thursday, September 20, 2012

**దివ్యత్వం**

తను నడిచిన దారిలో
ఎండిన ఆకులు సైతం
పచ్చదనాన్ని పులుముకుంటాయి

తన గాలి సోకితే
వాడిపోయిన పువ్వులు
వింత రంగులు నింపుకుంటాయి

తన కురుల నల్లదనానికి
చీకటికే సిగ్గేసి
తన మాటున
తనే దాక్కుంటుంది

తన పెదవుల ఎరుపై
మళ్ళీ పుట్టేందుకు
ఎర్రతురాయి పూలు
వెంటనే రాలిపోతాయి

తన దేహపు మృదుత్వాన్ని
తాకేందుకు
మెత్తటి పట్టు తహతహలాడుతుంది

తను స్నానమాడిన పుణ్యానికి
సెలయేటి నీళ్ళు
సెగలెక్కి పొగలు కక్కుతాయి

తన వలువలను మోసినందుకు
బండరాళ్ళు
తమ జన్మ ధన్యం చేసుకుని
పులకింతల్లో కరిగిపోతాయి

తనను తాకి పండువెన్నెల
సరికొత్త వెండి సొబగులు
సంతరించుకుంటుంది

ఆ ప్రకృతి మానసపుత్రికను
చూస్తే
నగ్నత్వం కనిపించదు
అందంలోని దివ్యత్వం
కనిపిస్తుంది  

ఆరాధించకుండా
 
ఎలా ఉండగలను....

No comments:

Post a Comment