పున్నమి చంద్రుడినడిగి
పండు వెన్నెలలు
బానలనిండా నింపుకొచ్చాను
స్నానం చేద్దువుగాని
బాల భానుని
బుగ్గలు పుణికి
ఎర్రదనం తీసుకొచ్చాను
బొట్టు పెట్టుకుందువు గాని
నీకై దాచిన
ప్రేమను కొంచెం
పట్టుపురుగులకు ఇచ్చి
అవి ఇచ్చిన పోగులతో
చీరనేసి
లేత చిగుర్లనడిగి
పచ్చరంగేసి
తంగెడుపూలు నవ్వితే
రాలిన
పసుపు పుప్పొడిని
అంచుల్లో చల్లి తీసుకొచ్చాను
కట్టుకుందువు గాని
దారిలో ఎదురుపడ్డ
అడవిపూల సౌరభాలను
గాజు బుడ్డీలో పోసుకొచ్చాను
నిండా పూసుకుందువు గాని
తుమ్మెదల్ని కదిపితే
తియ్యటి తేనెలిచ్చాయి
ఆ మధురాల్ని
కడుపునిండా తాగుదువు గాని
పొందికగా
పొదరిల్లు కట్టాను
ఇద్దరం ఒద్దికగా
ఒదిగిపోదాం గాని
ఓయ్ పిల్లా
నాతో వస్తావేమిటే
No comments:
Post a Comment