Right disabled

Monday, September 17, 2012

**సంచలన**


నేనొక రేణువును
అణువులు కలిసిన
అతి చిన్న రేణువును
సంచలన రేణువును

ఉదయకాంత
విశాల ఫాలంపై విరిసే
ఎరుపు రేణువును

కిందకురికే చినుకులోని
వేగాన్ని పుణికి పుచ్చుకున్న
చన్నీటి రేణువును

చిరు మొగ్గలోనుంచీ
కొత్త పుట్టుక పరిమళించే
బతుకు రేణువును

స్వేచ్చను నింపుకున్న
విహంగాల కువకువల్లో
అవిశ్రాంత విహార రేణువును

లేతాకుపచ్చ చిగురుటధరాల
ముద్దు పొదిగిన రేణువును

బారులు తీరిన
అమ్మ చెట్ల వేర్ల తడిలోని
ప్రేమ రేణువును

గిరగిరా తెరిగే గాలిలోని
ప్రాణవాయువు హృదయ
స్పందనా రేణువును

నివురుగప్పిన అగ్నిపర్వతాల
అంతరాళ నరాల్లో ప్రవహించే
శిలాద్రవ రేణువును

ఉవ్వెత్తున ఎగసే
ఉత్తుంగ తరంగాన
ఉరకలు వేసే ఉత్సాహ రేణువును

అంతుచిక్కని కడలి
అంతర్గర్భాన
అలసి నిద్రించే
పసి రేణువును

భరించే పుడమితల్లి
శిరసున భాసించే
సహన రేణువును

పరవళ్ళ పరుగులెత్తే
నదీ నాదాలలోనూ
జలపాతాల ఇంద్రజాలంలోనూ
జోరుతగ్గని వేగ రేణువును

జీవితాలను వికసింపజేసే
దినకరుని కిరణా రసాల
సరస్సులో స్నానమాడే
వెలుగు రేణువును

అంతర్మధనపు దుఃఖాన్ని
అంతూపొంతూ లేని సుఖాల్ని, విశ్రాంతిని
తనలో దాచుకున్న రాత్రి
వెదజల్లే చీకటి రేణువును

సమస్త జీవజాలాన
ప్రకటితమవుతున్న
ప్రాణ రేణువును

అడవి అతివ విరబోసిన
అనంత వర్ణ విన్యాసాల
కురుల ఛాయా రేణువును

వనకన్యక కలికి కులుకులో
కలగలిసిన
వలపు రేణువును

తన గొంతు గానాల
గమకాల హారాన
శబ్ద రేణువును

తన కంటి మిసిమి చూపులో
కురిసే కరుణా రేణువును

కోటానుకోట్ల రేణువుల్లో
నేనొక రేణువును

ప్రకృతి రేణువును
సంచలన రేణువును

No comments:

Post a Comment