నువు
నాకు బాగా నచ్చుతావు
-----------------------
కళ్ళు
మూసుకుని
నిశ్శబ్ద ధ్యానదీపం
వెలిగించడానికి
నేను ప్రయత్నిస్తూంటే
నీ
రెండు చేతులూ కలిపి
వత్తిని
ఎగదోసి
వెలుగై
కనిపించినపుడు
నువు
నాకు బాగా నచ్చుతావు
--------------------------
నాలోని మౌనాల
మధ్య
నేనొంటరిగా
మెల్లగా అడుగులేస్తుంటే
నీ
సైగల సంగీతం తో
నాతో
శృతి కలిపినపుడు
నువు
నాకు బాగా నచ్చుతావు
------------------------------
చల్లటి
చీకట్లోకి
గమ్మత్తుగా ఒదిగిపోయి
అలా కలల్లో
కళ్ళు
కడుక్కుంటూ ఉంటే
నా
నీడవై వచ్చి నా పక్కన కూర్చున్నప్పుడు
నువు
నాకు బాగా నచ్చుతావు
---------------------
అరమరికలు లేకుండా
ప్రకృతిలో
కలిసిపోయి
ప్రేమను చిలికి
వెన్నెల
వెన్న ముద్దలను చక్కగా
తీసి
పక్కన పెడుతుంటే
అవి నువ్వు దొంగలించినా
నిన్ను ఏమీ అనలేనప్పుడు కూడా
నువు
నాకు బాగా నచ్చుతావు
-----------------------
నాతో
పాటు నాకై పుట్టిన స్వేచ్ఛను
నీ
చుట్టూ తిప్పుకుని
కాళ్ళకు చూపుల సంకెళ్ళు వేసి
పాలపుంతల
వింతలు చూసేందుకు పోతానంటే
నిన్ను
నాకు చూపించుకుని
అవన్నీ
నీలోనే ఉన్నాయని మభ్యపెట్టి
నీ
మృదువైన పాదాల కింద
నన్ను
కర్కశంగా తొక్కిపట్టి
నా
గుండె లోతుల్లో ముళ్ళు చిమ్మే మంటలు నాటి
ఆఖరి
శ్వాస వదిలేద్దామని సిద్ధమైతే
నా
ప్రాణమే నీవైపోయి
వదలలేని
స్థితికి తెచ్చి
చివరకు
నన్ను జీవచ్ఛవ శిల్పంగా
మలచినప్పుడు
కూడా
ఎందుకో
నువు నాకు బాగా నచ్చుతావు