Right disabled

Saturday, December 15, 2012

**తెర తీయగరాదా**

ఆమె అటువైపు తిరిగి
అతడు ఇటువైపు తిరిగి
మునగదీసుకుని పడుకుంటారు


వారిద్దరి మధ్యలో 
సన్నని తెరపై 
ఆమె అలుక 
అతని బెట్టు
తోలుబొమ్మలాట 
ఆడుతూ ఉంటాయి 

అతను ఛేదించలేడు

ఆమె ఛేదించదు

పొద్దున లేచి 
ఎవరిపనులు వాళ్ళు 
ప్రాణమున్న యంత్రాల్లా 
అలా చేసుకుపోతారు

అయినా ఇద్దరిలోనూ
ఇద్దరూ కలిసే ఉంటారు 

తనకు తెలీకుండానే
ఆమె 
అతనికి ఇష్టమైనవి వండుతుంది

తనకు తెలీకుండానే
అతను
ఆమెకిష్టమని జాజులు తెస్తాడు

ఇద్దరూ పక్కపక్కన 

ఒకరివంక ఒకరు చూస్తూ 
పడుకుంటారు

వారిద్దరి మధ్యలో 

సన్నని తెరపై 
ఈ సారి
అతని అర్థింపు 
ఆమె కనికరం
కలిసి దాగుడుమూతలాడతాయి

చివరికి ఇద్దరూ కలిసి 
తెరను అడ్డంగా లాగేస్తారు
అప్పటికి కథ సుఖాంతమౌతుంది
ఇంకో కథకోసం 
తెర ఎప్పటిలాగే ఎదురు చూస్తుంది

1 comment:

  1. కవిత మంచి బలేగా , సరదాగా బాగుందండీ .............. మరింత చిలిపిగా రాస్తూ ఉండండి మరి , మేమూ నవ్వుకోవాలి కదా రాజు గారు

    ReplyDelete