Right disabled

Thursday, January 24, 2013

**జాంచెట్టు **

నా చిన్నపుడెపుడో
ఆ కొమ్మను
మా ఇంటిపక్కన నాటేటప్పుడు
అది జాంచెట్టు అని
నాకు తెలీదు

అది నాతోపాటు పెరిగే క్రమంలో

దానికిందే ఆడుకున్నాను
బడికి పోయేముందు దానికోమాట చెప్పి వెళ్ళేవాడిని
బడికి పోయిరాగానే అక్కడి కబుర్లు మాట్లాడేవాడిని
అన్నిటికీ చక్కగా తలూపేది 
ఆకులను గలగలలాడిస్తూ

అమ్మ తిట్టినప్పుడు

నాన్న కొట్టినప్పుడు
నేస్తాలతో ఆటలాడో
పోట్లాడో అలసినప్పుడు
నాకదే నీడ

నేను అలిగితే ఎక్కడుంటానో

ఇంటిల్లిపాదికీ ఎరుక

ఏ కష్టమొచ్చినా

ఎంతటి బాధ కలిగినా
దాని కిందకు వెళ్లి
మొదలునానుకుని కూర్చుంటే
ఓదార్పుగా 
భుజంమీద చేతులేసినట్టు
ఓ అయిదారు పండుటాకుల్ని
రాల్చేది


అప్పుడనిపించేది నాకు
ఎంత పచ్చటి ఆకైనా
పండుపడి
పసుపుబడి
తొడిమ విరిగి రాలిపోయినట్టు
ఎంత కష్టమైనా
ఎప్పుడో ఒకప్పుడు
తొలగక మానదని
మనం చెట్టులాగా 
నిబ్బరంగానే ఉండాలని

నాలుగు పెద్ద కొమ్మలతో

కొమ్మకో రకం కాయలు కాసేది
వాటిలో ఒక కొమ్మకు మాత్రం
తేనెలూరే తియ్యటి కాయలు కాసేది

ఆ కొమ్మపై
నాకిష్టమైన అమ్మాయి పేరు చెక్కానని
తనకు కూడా తెలుసేమో

నేను ఆ కొమ్మకు కాసిన
జాంపండు తినేదాకా ఆగి
తిన్న తరువాత 
నా పెదవులకంటిన
కాస్త తియ్యదనం కోసం
నా ప్రియురాలు పడే తపన చూస్తే
అర్థమయ్యేది
ఆ కొమ్మ కాయలెంత తీయనో
నా జాంచెట్టు మనసెంత మెత్తనో

**లోపలి పిలుపు **

ఈ ప్రపంచపు 
నిద్రాణ స్థితిలోనుంచీ 
అప్పుడప్పుడూ 
నేను నాలోకి 
మేల్కొంటూ ఉంటాను 


లోపలంతా 
స్పర్శ కాని స్పర్శ 
వెలుగు కాని వెలుగు 
అలుముకుని ఉంటాయి 

ఆ లోపలి లోకాల సంచారానికి 

నన్నెవరో 
ఎగరేస్తూ తీసుకెళతారు 

నేను 

అడుగులో అడుగు వేసుకుంటూ 
ఘనీభవించిన అలల మధ్యన 
కాలిబాటలు ఏర్పరుస్తూ 
తిరుగుతాను 
వాగులోకి వంగిన 
కొబ్బరి చెట్టులా ఉన్న 
ఒక ఆకాశపు రెక్కపై కూర్చుని 
ఆకుపచ్చ తరంగంలా 
వ్యాపించే అడవిలో 
ఆడపిల్లల్లాంటి 
అందమైన అక్షరాలు 
ఆటలాడుకుంటూ 
అల్లరి చేస్తూ ఉంటే 
ఆ సందడిని చూస్తూ 
కాసేపు లాంటి 
చాలా సేపు 
అలా గడిపేస్తాను 

లీలగా
సంగీతాన్ని పలికించే 
అదృశ్య ఝరుల 
ఆలింగనంలో 
నా హృదయస్పందనా లయలను 
ఏకం చేసి 
ఎంతసేపు ఉంటానో తెలియదు 

చివరికి
ఏడు గుర్రాల గిట్టల చప్పుడు 
వినబడగానే 
దైనందిన సుషుప్తిలోకి 
జారిపోతాను 

మళ్ళీ 

నాలోకి మేల్కొనేంతగా
అలసిపోవడానికి 
సిద్ధమవుతూ

Monday, January 7, 2013

**ఊ.... కదులు**

అనవసరపు ఆలోచనల పందేరాల్లోంచీ 
వాస్తవికతలోకి 
అపజయాల వాకిళ్లయినా తెరువు 
ఎంతో కొంత నేర్చుకుంటావు

భౌతికమైన ఒంటరితనంలోంచీ 

తలచిన మాత్రంగా తోడు నిలిచే 
బాధల కష్టాల ఆనందాల అనుభవాల 
సందళ్ళలోకి దూకు 
కొంతైనా గట్టిపడతావ్ 
స్థిమితపడతావ్ 

రాయి తనంతట తాను కదలకపోయినా 

ప్రయత్నమాత్రంగా కదిలిస్తే కదులుతుంది 

నీలో జడత్వం పుట్టలు కట్టిందా
పద
గునపం పలుగూ పారా అందుకో

**ఎక్కడ.... ఎక్కడ.... ఎక్కడని....?**

కాలుష్య కవాటాలు తెరుచుకున్న 
రాత్రుళ్ళన్నీ 
కొండచిలువల్లా 
చుట్టేసి నలిపేసి 
కమ్మేసి మింగేయడమే

తీవ్రవాద తుపాకుల తూటాలకూ 

మతవాదుల మాటల రాళ్లకూ 
తెల్లవారుజాములన్నీ 
భళ్ళున పగిలి 
చెల్లాచెదురైపోయి 
పిట్టలన్నీ సగం చచ్చి సగం ఎగిరిపోవడమే 

నీతి న్యాయాలను వదిలేసిన లోకం 

నీతిమాలిన మురికిని కట్టుకుని 
మసకబారి కంపు కొట్టడమే 

ఎక్కడని వెదకను తెల్లటి శాంతిని

**పుట్టుకలూ మరణాలూ**

పుట్టినప్పుడు అచ్చంగా నువ్వొక్కడివే
నీలో నువ్వే నవ్వుకుంటూ
ఏడుస్తూ

నీ ఊహ నీకు తెలుస్తున్న కొద్దీ 
నీలో మళ్ళీ నువ్వు పుడతావు
ఒక కొత్త సంఘటనను చూచినపుడు
ప్రకృతి ఒడిలో సేదతీరినపుడు
అమ్మ దగ్గరకు వెళ్ళిన ప్రతిసారీ
ఒక అద్భుతమైన అందం  
పొంగి పొరలుతున్న అమ్మాయిని చూసినపుడు
స్నేహితులను కలిసిన ప్రతిక్షణం
అడుక్కుంటున్న పసి పిల్లవాళ్లనో
చీకట్లో ఏదో గుద్దేసి
చనిపోయిన కుక్కనో
ఇంకేదో జంతువునో
చూసినపుడు

ఒంటరి రాత్రుల నిశ్శబ్దంలో 

ఒక్కడివే కూర్చుని గడిపినపుడు
నీలో కొత్తగా నువ్వు పుడుతూనే ఉంటావు

దీపపు కుందెలో 

నూనె ఉన్నంతవరకూ మండి
చివరకు కొండెక్కే దీపంలా
వాటివాటి ప్రభావాలు అయిపోంగానే
ఫలానా నువ్వు అంతర్థానమైపోతావు

కొన్ని ప్రభావాలను నీకు నువ్వే 

సమాధి చేయవలసివస్తే చేసేసి
ఆ ఫలానా నిన్ను చంపేసుకుంటావు
నూనె అయిపోకుండానే
కొండెక్కకుండానే
మధ్యలోనే ఊదేసి
ఆర్పేసినట్లు

కానీ దీపపు కుందె అదే 

మళ్ళీ కొత్త నూనె
కొత్త వత్తి
కొత్త వెలుగు
అదే కుందెలో
ఎన్నో దీపాలు వెలిగి ఆరిపోతాయి

నీలో చాలా సార్లు చాలా రకాలుగా

నువ్వే పుట్టి గిట్టినట్టుగా
దీపపు కుందె పగిలిపోయేంతవరకూ

ఇన్ని పుట్టుకలనూ మరణాలనూ 

నీలో నువ్వు దర్శించుకున్నప్పుడు
భౌతిక మరణానికి ఎందుకు భయపడతావో 

నాకు అర్థం కాదు