Right disabled

Monday, August 27, 2012

**స్వాతంత్ర్యం **

ఒకవైపు చూస్తే

స్వాతంత్ర్యం వచ్చింది
నవయుగ భారతానికి
శోధనా శాస్త్ర విజ్ఞాన సౌరభాలకు
స్వాతంత్ర్యం వచ్చింది
అభివృద్ధి ఆత్మవిశ్వాసాలకు
విప్లవాలకు విజయాలకు
స్వాతంత్ర్యం వచ్చింది
అసలు సిసలైన ప్రజాస్వామ్యానికి

ఇంకో వైపు చూస్తే

స్వాతంత్ర్యం వచ్చింది
స్వార్థ రాజకీయ నాయకులకు
అభివృద్ధికి తోబుట్టువైన అవినీతికి
స్వాతంత్ర్యం వచ్చింది
చాప కింది నీరులాంటి చీకటి వ్యాపారాలకు
ఎల్లలు దాటే నల్ల ధనానికి
స్వాతంత్ర్యం వచ్చింది
రేట్లకు నోట్లకు లొంగిపోయే ఓట్లకు ఓటర్లకు

మరోవైపు చూస్తే

స్వాతంత్ర్యం వచ్చిందా
మూఢనమ్మకాలనుంచీ ?
చిన్నారులపై మణువుల మోత మూస చదువులనుంచి ?
స్వాతంత్ర్యం వచ్చిందా
అర్ధరాత్రి ఆడదానికి?
వాస్తవాన్ని ఒప్పుకోలేని మూర్ఖత్వంనుంచీ?
స్వాతంత్ర్యం వచ్చిందా
ఎదురుతిరగలేని పిరికితనం నుంచీ?
నాకెందుకులే అని దులుపుకుపోయే ఉదాసీనతనుంచీ?

నేటి యువకుడా
ఆలోచించు
నీ స్వాతంత్ర్యం
ఎటువంటిదో అవలోకించు

**నాతో వస్తావా**

నాతో వస్తావా

నా గుండె బావిలోని
ప్రేమనంతా తోడి
నీ దాహం తీరుస్తాను
నా కళ్ళలో వెలుగు
ఆరిపోయేదాకా
చూపులతో నీకు
అభిషేకం చేస్తాను
నాలో కదలికలున్నంత కాలం
నీకు సేవ చేసుకుంటాను
నా ప్రాణం పోయేంత వరకు
నిన్ను ప్రాణానికి ప్రాణంగా
చూసుకుంటాను
నువు వెళ్ళిపోయినా
నీ గురుతులను
నా గుమ్మానికి
తోరణంగా కట్టుకుంటాను

నాతో వస్తావా

**ఎక్కడ దాక్కుందో**

ఎక్కడ దాక్కుందో తను
మిణుగురు మిత్రులు
దారి చూపుతుంటే
వెన్నెల పడవపై
ప్రయాణిస్తూ
ఎదురుపడే చుక్కలను
పలకరిస్తూ
మేఘాల పరదాల
మాటున వెతికాను

గాలిని
తోడు తీసుకుని
తుమ్మెదనై
ఝుంకారం చేస్తూ
పూవు పూవునూ
అడుగుతూ
వాటిలోని
మకరందంలో వెతికాను

సముద్ర గర్భాన
పసివాడినై పారాడుతూ
సొగసు కళ్ల చేపలకు
కన్ను గీటుతూ
అంతు చిక్కని
అగాధాలలో సంచరిస్తూ
పగడపు దీవుల
మాటున వెతికాను
తను కనిపిస్తుందేమోనని

వెతికి వెతికి
తిరిగి తిరిగి
చివరకు అలసిపోయి
తిరిగి వస్తే
మనసు తలుపులు
తెరుచుకుని వచ్చి
ఇంతింత కళ్ళతో
ఉరిమురిమి చూస్తూ
తెచ్చిపెట్టుకున్న కోపంతో
ఇంతవరకు ఎక్కడికెళ్లావని
గద్దించి అడిగింది
నా సుందరి
నా కవితాసుందరి

**నా కవిత**

నేను నవ్వితే
నా నవ్వుల్లోంచి
ఆనందాల్ని ఏరుకుని
తీరికగా కూర్చుని
మాలగా కూర్చి వేసుకుంటుంది

నేను ఏడిస్తే
నా కన్నీళ్లను పట్టి
వాటిని వడకట్టి
పన్నీటి పదాలుగా మార్చేసుకుని
స్నానం చేసేస్తుంది

నేను దీనంగా
కళ్ల నిండా
ఆవేదన నింపుకుని
కూర్చుంటే
నాలో నిండిన
నిర్లిప్తతను
ఏదేదో చేసేసి
తనకు నాకు మాత్రమే
అర్థమయ్యే మౌన భాషగా
రూపాంతరం చెందిస్తుంది

నేను ఆవేశపడితే
ఆ కోపాగ్ని జ్వాలలను
శాంతింపజేసి
పరుగులుపెట్టే
చల్లటి సముద్రపు అలలుగా చేసేస్తుంది

నేనోక్కోసారి
చిన్నపిల్లాడినైపోతాను
అపుడు తను
అమ్మ నోటి
అమృత వచనమైపోతుంది

నేను అంతులేని ప్రేమను
గుండెలనిండా నింపుకుంటే
తను నా ప్రేయసై
నన్ను తనలో
నింపేసుకుంటుంది

తను ఎవరంటే
కవిత
అవును కవితే
నా వేళ్ళ చివర
కలం నాగలితో దున్ని
సిరా ఎరువు వేసి
భావాల మొక్కలను
నాతో నాటించి
అక్షర సుమాలలో
వాడిపోని దరహాసాలను పూచే
నా కవిత

**ప్రేమా నీకు జోహార్లు**


గుచ్చుకుంటే తీయలేని
తీపి ముల్లు నా
మదిలో నాటి
మచ్చుకైనా కానరాని
మెత్తటి కత్తి గాయాలు
నా గుండెపై వదిలి
నా మనసును
నొప్పి లేకుండా కత్తిరించి
నా ఊహలకు
కొత్త బట్టలు కుట్టి
నా మెదడులో
నరాలు తెంచి
ప్రణయ సరాలు కట్టి
నా గొంతులో
కాఠిన్యాన్ని తొలచి
సున్నితత్వాన్ని మలచి
నాలో అహంభావాన్ని తుంచి
ఆత్మసౌందర్యాన్ని పెంచి
చిమ్మ చీకటి లోని
చల్లదనాన్ని
వెండి వెలుగులలోని
వెచ్చదనాన్ని ఇచ్చి
నిరాశా నిస్సత్తువలతో
కూలబడిన నాకు
సరికొత్త ఉత్తేజాన్నిచ్చి
లేవలేనని చిన్నబుచ్చుకుంటే
లేవనని మారాం చేస్తే
కొట్టి నిలబెట్టి
ఆవేదనను మరిపించి
హాయి కురిపించి
తపనలో ముంచి
దివ్యాగ్ని కొలిమిలో కాల్చి
తళుకులీనేలా తేల్చి
నాలోంచి ద్వేషమనే
విషాన్ని వెలుపలికి పంపి
కరుణామృత రసాన్ని
నిండా నింపి
కాసే చిగురులోమురిసే ఆకులో,
విరిసే మొగ్గలో, పూసే పువ్వులో
చెలి బుగ్గలో, నునుసిగ్గులో,
తోడులో, ఒంటరితనంలో
అన్నిటా
నీవై నిండి
నన్ను నన్నుగా నిలిపి
నాకు నేనెవరో తెలిపి
బతికేకొద్దీ
నను ఒద్దికగా
తీర్చిదిద్దిన “ప్రేమానీకు జోహార్లు
ప్రేమికుడినై
భావుకుడినై
కలం మోవిపై కవిత్వాన్నై
భువిలో దివిలో
కలలో మెలకువలో
నడకలో పరుగులో
కష్టనష్టాలలో
సుఖసంతోషాలలో
నిను నాలో నింపుకుని
నీ రుణం తీర్చుకుంటాను
అసలు నువ్వంటే ఏంటో
ఈ ప్రపంచానికి తెలియజెపుతాను
ప్రియమైన ప్రేమకు ప్రేమతో....నేను