గుచ్చుకుంటే తీయలేని
తీపి ముల్లు నా
మదిలో నాటి
మచ్చుకైనా కానరాని
మెత్తటి కత్తి గాయాలు
నా గుండెపై వదిలి
నా మనసును
నొప్పి లేకుండా కత్తిరించి
నా ఊహలకు
కొత్త బట్టలు కుట్టి
నా మెదడులో
నరాలు తెంచి
ప్రణయ సరాలు కట్టి
నా గొంతులో
కాఠిన్యాన్ని తొలచి
సున్నితత్వాన్ని మలచి
నాలో అహంభావాన్ని తుంచి
ఆత్మసౌందర్యాన్ని పెంచి
చిమ్మ చీకటి లోని
చల్లదనాన్ని
వెండి వెలుగులలోని
వెచ్చదనాన్ని ఇచ్చి
నిరాశా నిస్సత్తువలతో
కూలబడిన నాకు
సరికొత్త ఉత్తేజాన్నిచ్చి
లేవలేనని చిన్నబుచ్చుకుంటే
లేవనని మారాం చేస్తే
కొట్టి నిలబెట్టి
ఆవేదనను మరిపించి
హాయి కురిపించి
తపనలో ముంచి
దివ్యాగ్ని కొలిమిలో కాల్చి
తళుకులీనేలా తేల్చి
నాలోంచి ద్వేషమనే
విషాన్ని వెలుపలికి పంపి
కరుణామృత రసాన్ని
నిండా నింపి
కాసే చిగురులో, మురిసే ఆకులో,
విరిసే మొగ్గలో, పూసే పువ్వులో
చెలి బుగ్గలో,
నునుసిగ్గులో,
తోడులో, ఒంటరితనంలో
అన్నిటా
నీవై నిండి
నన్ను నన్నుగా నిలిపి
నాకు నేనెవరో తెలిపి
బతికేకొద్దీ
నను ఒద్దికగా
తీర్చిదిద్దిన “ప్రేమా” నీకు జోహార్లు
ప్రేమికుడినై
భావుకుడినై
కలం మోవిపై కవిత్వాన్నై
భువిలో దివిలో
కలలో మెలకువలో
నడకలో పరుగులో
కష్టనష్టాలలో
సుఖసంతోషాలలో
నిను నాలో నింపుకుని
నీ రుణం తీర్చుకుంటాను
అసలు నువ్వంటే ఏంటో
ఈ ప్రపంచానికి తెలియజెపుతాను
ప్రియమైన ప్రేమకు ప్రేమతో....నేను
No comments:
Post a Comment