Right disabled

Monday, August 27, 2012

**ఎక్కడ దాక్కుందో**

ఎక్కడ దాక్కుందో తను
మిణుగురు మిత్రులు
దారి చూపుతుంటే
వెన్నెల పడవపై
ప్రయాణిస్తూ
ఎదురుపడే చుక్కలను
పలకరిస్తూ
మేఘాల పరదాల
మాటున వెతికాను

గాలిని
తోడు తీసుకుని
తుమ్మెదనై
ఝుంకారం చేస్తూ
పూవు పూవునూ
అడుగుతూ
వాటిలోని
మకరందంలో వెతికాను

సముద్ర గర్భాన
పసివాడినై పారాడుతూ
సొగసు కళ్ల చేపలకు
కన్ను గీటుతూ
అంతు చిక్కని
అగాధాలలో సంచరిస్తూ
పగడపు దీవుల
మాటున వెతికాను
తను కనిపిస్తుందేమోనని

వెతికి వెతికి
తిరిగి తిరిగి
చివరకు అలసిపోయి
తిరిగి వస్తే
మనసు తలుపులు
తెరుచుకుని వచ్చి
ఇంతింత కళ్ళతో
ఉరిమురిమి చూస్తూ
తెచ్చిపెట్టుకున్న కోపంతో
ఇంతవరకు ఎక్కడికెళ్లావని
గద్దించి అడిగింది
నా సుందరి
నా కవితాసుందరి

No comments:

Post a Comment