నిశ్శబ్దం
అలలు అలలుగా
పొంగే ఏకాంతంలో
ఒక్కోసారి హఠాత్తుగా
నువు నా పక్కన లేవని
గుర్తొస్తుంది
అంతవరకు
నను మరిపించిన
రంగుల కలలు అంతర్థానమై
అంతులేని
నైరాశ్యపు చీకటి
నా మనసును కమ్మేస్తుంది
నాలోని
అనంత వర్ణాల ఆశలు
నల్లదనం పులుముకుంటాయి
అంతదాకా
నన్ను కవ్వించిన
చిలిపి చల్లదనం
నేనంటే
అస్సలు ఇష్టం లేదన్నట్టు
ఒళ్ళంతా కరుస్తుంది
అంతలోనే
నాకు “నేను” గుర్తొస్తాను
నువ్వు నిలువెల్లా నిండిపోయిన “నేను”
నేనున్నంత కాలం
నాతో నువ్వూ ఉంటావుగా
నువ్వు నాలోనే ఉన్నావనే భావన కలగగానే
నిబ్బరాల మబ్బులు
నీ కౌగిలిలాంటి వెచ్చని వానను
నాపై కురిపిస్తాయి
ఎండిపోయిన
నా పెదాల పొలంలో
చిరునవ్వుల పూలు పూస్తాయి
ఇంతకన్నా
నాకింకేం కావాలి
No comments:
Post a Comment