Right disabled

Monday, August 27, 2012

**నా కవిత**

నేను నవ్వితే
నా నవ్వుల్లోంచి
ఆనందాల్ని ఏరుకుని
తీరికగా కూర్చుని
మాలగా కూర్చి వేసుకుంటుంది

నేను ఏడిస్తే
నా కన్నీళ్లను పట్టి
వాటిని వడకట్టి
పన్నీటి పదాలుగా మార్చేసుకుని
స్నానం చేసేస్తుంది

నేను దీనంగా
కళ్ల నిండా
ఆవేదన నింపుకుని
కూర్చుంటే
నాలో నిండిన
నిర్లిప్తతను
ఏదేదో చేసేసి
తనకు నాకు మాత్రమే
అర్థమయ్యే మౌన భాషగా
రూపాంతరం చెందిస్తుంది

నేను ఆవేశపడితే
ఆ కోపాగ్ని జ్వాలలను
శాంతింపజేసి
పరుగులుపెట్టే
చల్లటి సముద్రపు అలలుగా చేసేస్తుంది

నేనోక్కోసారి
చిన్నపిల్లాడినైపోతాను
అపుడు తను
అమ్మ నోటి
అమృత వచనమైపోతుంది

నేను అంతులేని ప్రేమను
గుండెలనిండా నింపుకుంటే
తను నా ప్రేయసై
నన్ను తనలో
నింపేసుకుంటుంది

తను ఎవరంటే
కవిత
అవును కవితే
నా వేళ్ళ చివర
కలం నాగలితో దున్ని
సిరా ఎరువు వేసి
భావాల మొక్కలను
నాతో నాటించి
అక్షర సుమాలలో
వాడిపోని దరహాసాలను పూచే
నా కవిత

No comments:

Post a Comment