Right disabled

Saturday, December 22, 2012

**శ్వేతాశ్రువులు**

వాళ్ళ కన్నీళ్లు
పొడి బుగ్గలను ఒరుసుకుంటూ
దొర్లిపడే
స్వచ్ఛమైన ముత్యాలు

స్వచ్ఛమైన బాధలను
దాచుకున్న ముత్యాలు

స్వచ్ఛమైన దుఃఖాన్ని
నింపుకున్న ముత్యాలు

ఓదార్చే చేతులేవైనా వచ్చి
తమను ఒడిసిపట్టుకుంటాయేమోనని
ఆశతో జారిపడే ముత్యాలు

అటువంటి ముత్యాలు చివరికేమౌతాయో తెలుసా
తమను ఆదుకోవడానికి
తమ అస్థిత్వాన్ని ఆఖరు వరకూ నిలబెట్టడానికి
తమ ప్రాణాలను సైతం
బలి ఇచ్చిన వారి మెడల్లో
దండలవుతాయి

Friday, December 21, 2012

**కవి యోధుడు**

కవి రాసి విసిరే
ప్రతి అక్షరం ముక్కా
కొన్ని కోట్ల గొంతుకల
యుద్ధరావాల పెట్టు

కవి చేతి కలం అంచు
యోధుల కత్తులకు
బాణాలకు బల్లేలకు
పదునును అరువిస్తుంది

ప్రతి కవితా ప్రజ్వలిస్తూ
సైనికుల గుండె సీసాలలో
యుద్ధపరమార్థాన్ని నింపి
సీలు వేస్తుంది

ఒక వీరుడు చిందించే
ఒక్కొక్క రక్తపు బొట్టులో నుంచీ
మరొక వీరుడు ఉద్భవించవచ్చేమో గానీ

ఒక కవి ఆవేశంతో
విదిల్చిన సిరా చుక్కలో నుంచీ మాత్రం
అసంఖ్యాక వీరులు పుడతారు

వాళ్ళు మారుస్తారు
అంతా మారుస్తారు

యుద్ధం చేస్తారు

ఆర్తి నిండిన మనసుల
సరస్సులపై
కప్పుకున్న తరతరాల
దుఃఖపు పొరల్ని
గులకరాళ్ళు విసిరి
చెదరగొడతారు

Thursday, December 20, 2012

**శాండ్ విచ్ ఛాయ్ చిప్స్**

ఒకానొక శీతాకాలపు సాయం సంధ్య వేళ
మిత్రులతో కలిసి
అలా బయటకు వెళ్ళాను

చిన్న హోటల్ లో కూర్చుని
శాండ్ విచ్ ఛాయ్ చిప్స్
ఆర్డరిచ్చి
పిచ్చాపాటి కబుర్లలో పడ్డాం

పదార్థాలన్నీ వచ్చి
టేబుల్ పై కుదురుకున్నాయి

ఇలా శాండ్ విచ్ కొరికితే
ఆశ నిరాశల బ్రెడ్డు ముక్కల మధ్య
సుఖసంతోషాలలాంటి
టమోటా కీరాలు
నోటికి చల్లగా తగిలాయి

మేము లేకపోతే అది జీవితమే కాదంటూ
కష్ట నష్టాల్లాంటి
సాల్ట్ గరం మసాలాలు
నాలుకను చురచురలాడిస్తూ
మంచి రుచినిచ్చాయి

మధ్య మధ్యలో రస సౌందర్యాన్ని
నిండా నింపుకున్నంతగా ఉన్న
ఛాయ్ ని చప్పరిస్తూ
కరకరలాడే చిలిపితనాన్ని
ఒంటినిండా పూసుకున్న
చక్కటి గుండ్రటి చిప్స్ ని నములుతూ 

మొత్తానికి ఆ అరగంటలో
ఒక చిన్న జీవితాన్ని ముగించినట్టు లేచి
హోటల్ కొక సలాం కొట్టి 
బయలుదేరాం

Wednesday, December 19, 2012

**ధ్వంస రచన**



ముట్టుకున్నా మోగని
తంత్రులను చుట్టుకున్న
మూగ వీణవే

గాలిని కూడా చొరబడనీయని
వింత వేణువువే

రంగుల్నీ నీలో నిండనీయని
ఇంద్ర ధనుస్సువే

సుత్తికీ ఉలికీ స్పందించని
కరకు రాతి దేహానివే

నిన్ను కరిగించడానికి
ఏ చినుకులు కురవాలి

నిన్ను వెలిగించడానికి
ఏ కర్పూరాలు చల్లాలి

నిన్ను కదిలించేందుకు
ఎన్ని నెలవంకలు విసరాలి

నిన్ను వికసింపజేసేందుకు
నేనేన్ని సూర్యుళ్ళు కావాలి

నిన్ను చేరేందుకు
తెరుచుకోని ఎన్ని ద్వార బంధాలను
కూల్చుకుంటూ రావాలి

నా ప్రయాస అంతా
గాలిలో ధూళికణం
సముద్రంలో మంచినీటి చుక్క
వేలాది పలుగాకుల్లో ఒక ఎండుటాకు

అయినా ఎంతవరకూ నీ పట్టు
నా కోటి సముద్రాల అల
నిన్ను తాకేంతవరకే

నీ మనసును చుట్టిన
కరకు కోట గోడలను
బీటలు వార్చేందుకే
ఈ నా యత్నం

Monday, December 17, 2012

**ఆగమనాభిలాష**

విత్తనం లోపల
ఎక్కడో మూల
అంకురం ముడుచుకుని
వేచి చూస్తూ ఉంది
నువ్వెప్పుడొస్తావో అని

తడి తగిలితే చాలు
ఎప్పుడు ఒళ్ళు విరుచుకుని
కొత్తరూపు దిద్దుకుందామా అని

మళ్ళీ మళ్ళీ
తన చిట్టి చేతులు చాచి
నిన్నెప్పుడు ఒడిసిపడదామా అని
కమ్మటి కలల్లో
కలవరిస్తూ ఉంది

తొలకరి చినుకా 
ఎప్పుడు నీ రాక

Saturday, December 15, 2012

**తెర తీయగరాదా**

ఆమె అటువైపు తిరిగి
అతడు ఇటువైపు తిరిగి
మునగదీసుకుని పడుకుంటారు


వారిద్దరి మధ్యలో 
సన్నని తెరపై 
ఆమె అలుక 
అతని బెట్టు
తోలుబొమ్మలాట 
ఆడుతూ ఉంటాయి 

అతను ఛేదించలేడు

ఆమె ఛేదించదు

పొద్దున లేచి 
ఎవరిపనులు వాళ్ళు 
ప్రాణమున్న యంత్రాల్లా 
అలా చేసుకుపోతారు

అయినా ఇద్దరిలోనూ
ఇద్దరూ కలిసే ఉంటారు 

తనకు తెలీకుండానే
ఆమె 
అతనికి ఇష్టమైనవి వండుతుంది

తనకు తెలీకుండానే
అతను
ఆమెకిష్టమని జాజులు తెస్తాడు

ఇద్దరూ పక్కపక్కన 

ఒకరివంక ఒకరు చూస్తూ 
పడుకుంటారు

వారిద్దరి మధ్యలో 

సన్నని తెరపై 
ఈ సారి
అతని అర్థింపు 
ఆమె కనికరం
కలిసి దాగుడుమూతలాడతాయి

చివరికి ఇద్దరూ కలిసి 
తెరను అడ్డంగా లాగేస్తారు
అప్పటికి కథ సుఖాంతమౌతుంది
ఇంకో కథకోసం 
తెర ఎప్పటిలాగే ఎదురు చూస్తుంది