Right disabled

Wednesday, November 14, 2012

**గాజులు**



గాజులు గాజులు గాజులు
అందమైన గాజులు
అలరించే గాజులు
ముచ్చటైన గాజులు
మురిపించే గాజులు
మెరిసే గాజులు
మురిపాలు కురిసే గాజులు
గలగలలాడే గాజులు
మిలమిలలాడే గాజులు
అతివ చేతి అలంకారం గాజులు
అచేతనను అంతం చేసే గాజులు
శబ్దాలంకారం గాజులు
సౌభాగ్య సిరులు గాజులు
ఆడతనపు గాజులు
అమ్మతనపు గాజులు
గాజులు గాజులు గాజులు
రంగురంగుల గాజులు
రసజ్ఞత నిండిన గాజులు

**నా దీపావళి**



మూలాలను నింపుకున్న
మట్టి ప్రమిదలో
నా భావాల సారం పోసి
అక్షరాలతో వత్తులు చేసి
కవనమనే అగ్నితో
ప్రజ్వలింపజేస్తే
ఆ ఉద్వేగ జ్యోతులలోనుంచీ
ఒక్కసారిగా ప్రసరించిన
వింత కాంతులు
నా లోపలి ఖాళీ చీకటి భాగాలలో
వేయి వెలుగులు నింపుతూ
నన్ను పరిపూర్ణం చేస్తున్నాయి

అవే ఆనంద దీపకళికలను
నా హృదయపు ప్రతి మూలలా
ప్రతిష్ట చేసుకుంటూ
అంత వెలుగూ
నాకోసమే ఉంచుకోకుండా
నలుగురికీ ప్రసరింపజేస్తూ
నా దీపావళి
జిలుగు వెలుగుల
నా దీపావళి

**ఏదో లోకం**



అది ఏ లోకమో తెలీదు
నిశ్శబ్దం నిరంకుశ నియంతై
పరిపాలిస్తోందేమో
నా ఉచ్ఛ్వాస నిశ్వాసలూ
గుండె చప్పుడు కూడా
నాకు వినిపించటం లేదు

ఏమీ కనిపించటం లేదు
వాటంతట అవే
ఉన్నట్టుండి ప్రత్యక్షమవుతూ
ఒకదానిలో ఒకటి
కలిసీ కలవనట్లు కలిసిపోతూ
అలా అలా
అసంఖ్యాకంగా కలిసిపోయి
లీలగా కదులుతూ
చివరకు అంతర్థానమైపోతున్న
రంగుల పరదాల లాంటి
ధూమ కుడ్యాలు తప్ప

నేను నడుస్తూనే ఉన్నాను
ఎంత నడిచినా అలసట లేదు
ఆకలి దప్పులు అసలే లేవు
అది ఎత్తో పల్లమో కూడా
తెలియని విచిత్ర స్థితి
అంతా సమంగా
పాదాలకు మెత్తగా చల్లగా
తగులుతోంది
నేను నేలపైనే ఉన్నానా
అనే సందేహం

ఎవ్వరూ లేరు
అలాగని నాలో
ఒంటరితనమూ లేదు
అంతా ప్రశాంతత
బాహ్య చేతనలోనే ఉన్నా
గాఢమైన ధ్యానంలో
కలిగే ప్రశాంతత
అంతా వింతగా ఉంది
అది ఏమి లోకమో
ఎవరైనా చెపితే బాగుండు

Saturday, November 3, 2012

**అమరత్వం**



అక్షరం
అది అవ్యక్త భావ తరంగాల అంకురం
ఒక్కొక్క తరంగమూ తగిలినప్పుడల్లా
నాలోని అంతఃచేతన
ఇంతై ఇంతింతై
నా కళ్ళు తట్టుకోలేనంత
వెలుగు రేఖలు ప్రసరిస్తుంది

అక్షరం
నైరాశ్యంతో ఎండిన నా నరాల్లో
ఎప్పటికప్పుడు
ప్రాణశక్తితో పాటు
స్పందనలను కూడా నింపే ఒక వరం

నాలో అక్షరాలు కదులుతున్నాయి
నిత్యమూ సత్యమూ శాశ్వతమూ
అద్భుతమూ అద్వితీయమూ
అయిన అక్షరాలు నాలోని రుధిరంతోపాటు
పరుగులు తీస్తున్నాయి

నేను ఏమి చేసినా
ఏమి చూసినా
ఎక్కడ ఉన్నా
ఎవరితో ఉన్నా
నాలోపలి తెలియని
అక్షర జలపాతాల హోరు
నాకు వినిపిస్తుంది

అమంత్రమక్షరం నాస్తి అన్నట్టు
ప్రతి అక్షరం మంత్రమై
నా చెవుల్లో ఘోషిస్తున్నాయి
ఎంతచెప్పినా
ఎందరితో చెప్పుకున్నా
ఎంత చవిచూసినా
తనివి తీరని అమృతానుభవమది

అమ్మలా అక్కున చేర్చుకునే అక్షరం
ప్రేయసిలా నన్ను తనలో
పొదుపుకునే అక్షరం
ఆడతనంలా అనిర్వచనీయమైన అక్షరం
అంతర్వాహినిలా అంతుతెలియని అక్షరం

నా ప్రయాణం అక్షరం
నా జీవితం నిండా అక్షరాలు
నేను నడిచిన దారి నిండా కూడా
నాలోంచి రాలి పడిన అక్షరాల మొలకలు
ఆ మొలకలు కూడా మోసులెత్తి
అక్షర సుమాలు విరిసి
అక్షర బీజాలు కురుస్తూ
మళ్ళీ అక్షరాలను మొలకెత్తిస్తూ

అక్షరానికి నాశనం లేదు
అలాగే అక్షరాలను నింపుకున్న
నాకు కూడా

అమరత్వం అంటే
అక్షరాన్ని ఆరాధించటం
చివరకు అదే అక్షరంలో కలిసిపోవడం

Friday, November 2, 2012

**కల్తీ**



వర్షాకాలంలో
ఒకానొక రోజు
ఆఫీసులో కూర్చుని
ఏం తోచక
కిటికీలోంచీ చూస్తే
జోరుగా కురుస్తున్న
చిక్కటి చినుకుల్లో
నిశ్చలంగా నింపాదిగా
తనివితీరా తడుస్తున్న
నగరం కనబడింది

ఎంచక్కా తడుస్తున్నానని
చంటిపిల్లలా మురిసిపోతోందేమో
కానీ నగరానికి తెలీదు
ఆ చినుకులు
కాలుష్యపు సెగనుండీ
ఎగసిన పొగ కలిసినవని
అది కల్తీ వర్షమని
నేలమీదకన్నా
ప్రమాదకరమైన
గాలిలోని
నల్లటి కనిపించని బురదలో
తడుస్తున్నానని

చక్కటి మంగళస్నానం
చేస్తున్నాననుకుంటున్న
నగర సుందరికి
ఈ విషయం తెలిస్తే
బావురుమని ఏడుస్తుందేమో
అనుకుంటూ
ఇంతకీ ఏం రాశానో అని
కిందకు చూస్తే
తెల్లటి కాగితం పై
నీలి సిరా అక్షరాలతో పాటు
రెండు నల్లటి చారికలు కూడా
కనబడ్డాయి

అవి నా మనసు మూగవేదనకు
పొంగి రాలిన అశ్రువులు
అవి కూడా కల్తీ అయిపోయాయి