Right disabled

Wednesday, November 14, 2012

**ఏదో లోకం**



అది ఏ లోకమో తెలీదు
నిశ్శబ్దం నిరంకుశ నియంతై
పరిపాలిస్తోందేమో
నా ఉచ్ఛ్వాస నిశ్వాసలూ
గుండె చప్పుడు కూడా
నాకు వినిపించటం లేదు

ఏమీ కనిపించటం లేదు
వాటంతట అవే
ఉన్నట్టుండి ప్రత్యక్షమవుతూ
ఒకదానిలో ఒకటి
కలిసీ కలవనట్లు కలిసిపోతూ
అలా అలా
అసంఖ్యాకంగా కలిసిపోయి
లీలగా కదులుతూ
చివరకు అంతర్థానమైపోతున్న
రంగుల పరదాల లాంటి
ధూమ కుడ్యాలు తప్ప

నేను నడుస్తూనే ఉన్నాను
ఎంత నడిచినా అలసట లేదు
ఆకలి దప్పులు అసలే లేవు
అది ఎత్తో పల్లమో కూడా
తెలియని విచిత్ర స్థితి
అంతా సమంగా
పాదాలకు మెత్తగా చల్లగా
తగులుతోంది
నేను నేలపైనే ఉన్నానా
అనే సందేహం

ఎవ్వరూ లేరు
అలాగని నాలో
ఒంటరితనమూ లేదు
అంతా ప్రశాంతత
బాహ్య చేతనలోనే ఉన్నా
గాఢమైన ధ్యానంలో
కలిగే ప్రశాంతత
అంతా వింతగా ఉంది
అది ఏమి లోకమో
ఎవరైనా చెపితే బాగుండు

No comments:

Post a Comment