Right disabled

Friday, November 30, 2012

**ఎయిడ్స్**


కావాలి ఇంకా కావాలంటూ
చీకటి దారుల వెంబడి
పిచ్చి పరుగులెత్తే కాముకుల పాలిట
కనిపించని కరి నాగుపాము
ఎయిడ్స్

ఎల్లలు దాటిన
మనిషి భోగలాలసతకు
ప్రకృతి విధించిన
విమోచన లేని శాపం
ఎయిడ్స్

మేకప్ వేసుకుని
లిప్ స్టిక్ పూసుకుని
అందంగా తయారైన
గాజుబొమ్మల వెనుక
భయవిహ్వల రూపం
ఎయిడ్స్

అభివృద్ధిని సాధించాం
ప్రగతిని సాధించాం
సృష్టికి ప్రతిసృష్టి చేస్తాం అంటూ
మూలాలు మరిచి విర్రవీగే
అప్రాకృతిక అపర బ్రహ్మలకు
అర్థం కాని బ్రహ్మ పదార్థం
ఎయిడ్స్

Monday, November 26, 2012

**దగ్గరకు రానివ్వకు**


అదొక కనికరం లేని
రాక్షస హస్తం
నీ ఆశలని ఆశయాలను
కసిని తెగింపును
నిర్దాక్షిణ్యంగా నలిపేస్తుంది

అదొక భయంకరమైన
మాయ
నీలోని అభ్యుదయాన్నీ
ఆలోచనను ఆవేశాన్ని
నువు వేసే ప్రతి అడుగునూ
చీకట్లతో కమ్మేస్తుంది

నీ మనసును
నవ్వడానికి వీలుపడని
అధరద్వయంలా
కదలిక లేని గుండెలా
మసకబారిన చూపులా
ఉనికి లేని ప్రపంచంలా
మార్చేస్తుంది

దాన్ని నిర్లిప్తత అంటారు
దగ్గరకు రానివ్వకు

Friday, November 23, 2012

**దగ్గర దారి**

ఒరేయ్ మనిషీ
నిచ్చెనలు కడుతున్నావా
ఏ స్వర్గానికి ఎగరడానికి
అదెలా ఉంటుందో తెలుసా
ఎక్కడ ఉంటుందో తెలుసా

చచ్చిన తరువాత కూడా
నానా కష్టాలూ అనుభవించే
నరకానికి పోవడానికే
కొన్ని వేల మైళ్ళు ఉన్న
వైతరిణీ నదిని దాటాలట

ఇక స్వర్గానికి వెళ్లడానికి
ఎన్ని దాటాలో

నేనొకటి చెపుతాను
వింటావా
నీలో నీవు ప్రయాణించు
నువ్వెవరో తెలుసుకో
అర్థం కాలేదా
నిన్ను నువ్వు ప్రేమించుకోవోయ్

కష్టమేమో కానీ
స్వర్గానికి ఇదే దారి
దగ్గర దారి

Wednesday, November 21, 2012

**ఒక సాయంత్రం**


ఆ సాయంత్రం
చాయ్ తాగి
కప్పు సాసర్ లో పెట్టి
జేబులో మిగిలిన చిల్లర
వెయిటర్ చేతికిచ్చి
అలానే కూర్చుండిపోయాను
ఇంకొక పనబ్బాయి వచ్చి
తడి గుడ్డతో
టేబుల్ ని తుడిచి వెళ్ళాడు
తల వంచుకుని కూర్చున్న నాకు
నా ముఖం
తళతళలాడుతున్న టేబుల్ పై
వెలవెలబోతూ ప్రతిఫలిస్తోంది
కళ్లలోని అలసట
చూపులోని దైన్యం కూడా

ఉద్యోగాల కోసం
అలుపెరగక తిరిగిన కాళ్ళు
ఇక కదల్లేమంటున్నాయి

సడి లేకుండా ఒక్కొక్క చుక్కా
ముక్కు అంచు వెంబడి జారిపడ్డాయి
ఇందాక వచ్చిన పనబ్బాయి
మళ్ళీ వచ్చి
ఇప్పుడే తుడిచాను కదా
మళ్ళీ నీళ్లెలా పడ్డాయి అంటూ
అలా అలవాటు ప్రకారం
తిరిగి తుడిచేసి వెళ్ళాడు

నాకేదో స్పురించినట్లయింది
అంతే
రేపటి ఇంటర్వ్యూ సమయాన్ని
గుర్తుచేసుకుంటూ
నేనూ లేచాను
శుభ్రంగా

**అస్పష్టం**


ఒక్కోసారి
ఏదయినా రాద్దామని
కలం కాగితం
పట్టుకుని కూర్చుంటాను
అంతలోనే
నా మనసు
నైరాశ్యంతో కలిసి
అర్థంలేని మాటలేవో
మాట్లాడుతూ ఉంటుంది

ఆ మాటలన్నీ
అస్పష్ట భావాలుగా
అడ్డదిడ్డంగా
గబ్బిలాల్లా తిరుగుతుంటాయి

చేతిలోని కలం
అటూ ఇటూ ఊగుతుంటుంది
చేతికింద కాగితం
ఇంకెంతసేపంటూ
విసుక్కుంటుంది

అలా చాలాసేపు
ఉండిపోతానా
ఈ లోపు నా చేతివేళ్లు
నడుములు పట్టేసినట్లు
చిన్నగా నిట్టూరుస్తాయి
ఇక చాలనుకుంటూ
కాగితం వంక చూస్తే
కొన్ని వాక్యాలు
చిందర వందరగా
అటూ ఇటూ
పడి ఉంటాయి

అవన్నీ పద్ధతిగా పేరిస్తే
స్కూలు పిల్లల్లా చక్కగా
వరుస కట్టి
“ఇంకేంటి” అన్నట్టుగా
తలలెత్తి నా వంక చూస్తాయి

వాటిని నేనుకూడా అలాగే చూసి
“ఇంకా నేనేం చేయనూ”
అంటూ
ఆఖరుచుక్క పెట్టేస్తాను
అది అస్పష్టమని తెలిసినా

**ఉదయపు నడక**


లేలేత
అరుణారుణ కిరణాల
నులివెచ్చని స్పర్శను
ఆస్వాదిస్తూ

నిదుర మత్తును
నిస్సత్తువను తరిమికొట్టే
చైతన్యాన్ని
నా నిండా నింపుకుంటూ

శుభోదయం చెబుతున్నట్టు
కూస్తున్న
రకరకాల పక్షుల
కువకువలు కిలకిలలు
వింటూ

భానుడి తాకిడికి
వికసిస్తున్న
రంగుల పూబాలల
అలవిగాని సొబగులను
చిట్టి పాపాయి
చేతుల్లాంటి
కొత్త చిగుర్ల
మార్దవాన్ని తాకుతూ


ఎన్నో కొత్త పరిమళాలను
ప్రయాసెరుగక
మోసుకొచ్చే
పిల్లగాలి చెప్పే
కథలు వింటూ

మెల్లగా
ఒళ్ళు విరుచుకుంటున్న
ప్రకృతి సౌందర్యాన్ని
నా చూపులతో ఒడిసిపట్టి
జ్ఞాపకాల ఫలకాలపై చిత్రిస్తూ
అనుభవాల దొంతరల్లో
పదిలంగా దాచేస్తూ
నడుస్తున్నాను

పురివిప్పిన మయూరాలు
నాలో నాట్యమాడుతున్నట్లు ఉంది  
ఊహలు అందమైన సీతాకోకచిలుకలై
విచిత్ర వర్ణాల రెక్కలను
రెపరెపలాడిస్తూ
నా చుట్టూ తిరుగుతున్నాయి

ఎప్పటికీ అడుగంటని
ఆశల సరస్సులు
రూపుదిద్దుకుంటున్నాయి
నేను నడుస్తున్నాను

**ఆస్వాదన**



నువ్వూ నేనూ జతచేరి
కాలుతున్న కోరికల నిప్పులతో
కొంటె కబుర్ల కుంపటేసుకుని
చలికాచుకుంటూ
నీ నా తమకాలు
గాఢంగా పెనవేసుకుంటే
వాతావరణ కేంద్రాలు కూడా
ఉలిక్కిపడేలా
అంత వేడి ఒకేసారి పుట్టి
అంత వర్షమూ ఒకేసారి కురిసింది మరి

చందమామ
తన వెన్నెల దారాల
పరదాలే కప్పుకుని
తుర్రుమని పారిపోతే
నువ్వు రాత్రి తీసి
విసిరేసిన
సిగ్గు పొరలు
ఎక్కడో ఆవల ఉన్న
సూర్యుడిపైబడి
ఇప్పటికీ బయటపడలేక
నానా తంటాలూ పడుతున్నట్టున్నాడు
అందుకేనేమో ఇంకా తెల్లారలేదు

నువ్వు లేచి
నీ సిగ్గులు వెనక్కి తీసేసుకుని
భానుడికి శుభోదయం చెప్పు
నే వెళ్ళి కాఫీ పెడతాను
మళ్ళీ నువ్వూ నేనూ కలిసి కూర్చుని
పొద్దుపొడుపును
ఆస్వాదిద్దాం

Monday, November 19, 2012

**వెన్నెల సెగలు**

ఏమిటే కొంటె జాబిల్లీ
అసలే విరహ వేదనలో కాలిపోతున్నానంటే
ఇంకాస్త వెన్నెలలు చల్లి
నా బాధను మరికాస్త పెంచుతావా

ప్రియురాలి ఊహల జల్లుల్లో
నేను ఇప్పటికే తడిసిపోయి ఉంటే
నా మీదకు వెన్నెల మడుగులు కుమ్మరించి
నన్ను నిండా ముంచేస్తావా

అసలే నా వయసంతా
అడవిగాచిన వెన్నెల అయిపోతోందని
అతి కష్టంగా పోల్చుకుంటున్నానే
కాస్తయినా కనికరం లేదెందుకు నీకు

నా మదిలో మండే ప్రణయ జ్వాలలకు తోడు
నీ వెండి పుంజాలు కోరికల నెగళ్లు వేస్తున్నాయి
నీకిది న్యాయమా

ఓ ప్రేయసీ
ఈ తాపసి మొర వినరావా
నీ కౌగిట నను చేర్చి
ఈ జాబిల్లి కాంతుల కారాగారం నుంచీ
విముక్తుడిని చేయరావా