Right disabled

Monday, December 30, 2013

**సన్ ఆఫ్ టైమ్స్**

మెటలర్జికల్లీ అమాల్గమేటెడ్ తలుపులను కట్టుకున్న
కాళరాత్రి కవాటాలను బద్దలు కొట్టుకుని
ఉదయిస్తాడు వాడు
సూర్యుడు కాడు సుమా

అక్షరాలన్నీ నరాలు తెగినప్పుడు రక్తం ఎగిసిపడ్డట్టు చిమ్ముతాయి
వాడి పుట్టుకనుంచీ
విత్ ఏజ్ కమ్స్ విజ్డమ్ ని తిరగరాసి
బర్త్ టీచెస్ యూ విజ్డమ్ అంటాడు
డిస్గైస్డ్ రాళ్ళలాంటి మస్తిష్కాలు కరిగి ప్రవహిస్తాయి
వాడి మాటలకు

వాడు తెరిచిన దారి నుంచీ రాలిన ప్యాకెట్స్ ఆఫ్ లైట్ ధాటికి
సీసపు సీళ్ళు కావాలని వేసుకుని
కాంతి మాకందట్లేదని ఏడ్చే కళ్ళు
భళ్ళున తెరుచుకుంటాయి

ఇంకేం కావాలీ ప్రపంచానికి
నిజాన్ని చూసింతర్వాత
అర్థమైనవారికి అర్థమైనంత

Friday, December 13, 2013

**అరూపరూపి**

రూపము లేదని అనుకునేలోపు
ఒక రూపం ఎదుట సాక్షాత్కరిస్తుంది
రూపముందని అనుకునేలోపు
ఆకార రహితమని తెలుస్తుంది
ఈ రెండూ నిజమే

ఒకదానినుంచీ వంద పుడతాయి
అవి వెయ్యి అవుతాయి
అలా ఒక్కొక్కటీ పెరిగి
అసంఖ్యాకమవుతాయి
అంతులేని ఈ క్రమంలో
ఏ అంకంలో పుట్టినదైనా
అదీ మొదటిదీ ఒకటే

అప్పుడు మొదటిది గొప్పా
మిగితావి గొప్పా
అసలా మొదటిది ఎక్కడనుంచీ వచ్చింది 


ఎక్కడ నాటింది అక్కడినుంచే ఇస్తుంది 
మరొక చోటునుండీ రాదుగా


అది ఉంటె ఇవి ఉంటాయి 
ఇవి లేకపోయినా అది మాత్రం ఉంటుంది 

అవి వర్తులాకారంలోనే ఎందుకుంటాయి
అంత దూరం వెళ్లి వాటిని చూసి
అవి అలానే ఉంటాయని ఎవరు చెప్పారు
అంత దూరం ఎవరు వెళ్ళగలరు

ఎలా పడితే అలా కాకుండా
ఎక్కడివక్కడే ఎలా ఉంటాయి
అలా ఎవరు పేర్చారు
పేరుస్తున్నప్పుడు చూసినదెవరు

సమాధానాలు దొరకని ప్రయాణమా ఇది
దొరికినా సంతృప్తి ఉంటుందా

Saturday, November 30, 2013

**శృంగారాలు - 5**

మన ఒంట్లో మలిగే దీపాలను చూసి 
సూర్యుడు త్వరత్వరగా సాయంత్రాన్ని కట్టేసి 
తన ఒంట్లో దీపాన్ని అటువైపు మరల్చేస్తాడు 

ఆ దీపాల వెచ్చదనానికి 

నూలుపోగులన్నీ కాలిపోతాయి 
ఒళ్ళు దాచుకోవడానికి 
నీకు నేను నాకు నువ్వు తప్ప ఏదీ మిగలదు 

అలాగే ఒకరినొకరు దాచుకుంటూ 

ఒకరి దీపాలకొకరు ఇంధనమిస్తూ
ఎప్పటికో తేరుకుంటాం

ఒకరినొకరు చూడలేనంత సిగ్గుతో 
అటు నువ్వు ఇటు నేనూ 
తుర్రుమని పారిపోతాం

**శృంగారాలు - 4**

నీవొక మధు శిల్పానివి 
అంతవరకూ 
నీలో అంతర్వాహినులుగా ప్రవహించే 
ఎన్నో అందాలు 
ఉబికి వచ్చి 
ఇద్దరి తనువులనూ సస్యశ్యామలం చేస్తాయి 

నీ అందాన్ని తాగి తాగి

తెల్లవార్లూ 
నేనా మత్తులో జోగుతూ ఉంటాను 
నువ్వు మాత్రం మెలకువలోనే ఉండి
నన్ను నీలోకి లాక్కుంటూనే ఉంటావు

Thursday, November 28, 2013

**శీతాకాలపు చీకటి ఉదయం **

చిక్కటి చీకటి
మెత్తటి చీకటి
అంతూపొంతూలేని చీకటి
చల్లగా పలకలు పలకలుగా కురిసింది
సూర్యుడి అవసరమే లేకుండా
తనకు తానే ఉదయించింది

ఒక్కటే ఏరు
ఒక్కటే ఒడ్డు
ఒకే గుడి
ఒక్కడే శివుడు
మేం మాత్రం ఇద్దరం
గుడి చావిడిలో ఒక మూలగా
గువ్వల్లా ఒదిగి

మా ఆకలి
అప్పటికప్పుడు దొరికిన బిర్యానీ పొట్లానికి తెలుసు
మా దాహం
మెట్లదగ్గరున్న బోరింగు పంపుకు తెలుసు
మేం కోరుకున్న ప్రశాంతత
రొదపెట్టే కీచురాళ్ళకు తెలుసు

అప్పుడు లోకం
దట్టమైన చీకటినీ పల్చటి వెన్నెలనూ కలిపి
గమ్మత్తయిన దేవతా వస్త్రాన్ని నేస్తుంది

కాస్త వెచ్చదనం కోసం
దగ్గరకు చేరిన మేము
కాసేపటికి తల్లీబిడ్డలమయ్యాం
పిల్లమారాజులా ఆ పిల్ల ఒడిలో నేను
ఆ మహాదేవుడి ముందు వెలిగే ఆముదపు దీపంలా
రెండు జతల కళ్ళు వెలుగుతూనే ఉన్నాయి
కామాన్ని దరిచేరనియ్యని కాటుకలాంటి క్షణాలు
అంటీఅంటకుండా దొర్లిపోయాయి

వెళ్ళిపోయింది
ఓదార్చలేని గుర్తుల వెలుగుల్లో నను వదిలేసి
చీకట్లలో తప్పిపోయిందనే అనుకున్నాను
అంత కాంతిలో చీకటినీ సృష్టించుకోవడమెట్లాగని అడిగితే
గట్టిగా కళ్ళు మూసుకుని అరచేతులతో కప్పుకోమని
ఓ మిత్రుడు చెప్పేవరకూ

తను నాలోకే తప్పుకుంది
తెలుస్తోంది
ఎంత వెలుతురును పరిచినా
చీకటినీ కల్తీ చేయలేమని
నాలో చీకటి ఎప్పుడయినా ఉదయిస్తుందని

Friday, November 22, 2013

**వడపోత **

ప్రతీ పొద్దునా ప్రతీ సాయంత్రం 
మిసిమి కాంతుల వేళల్లో జాలువారే
పల్చటి కిరణాల్ని 
కళ్ళు అరమోడ్పులు చేసి 
వడకట్టేందుకు ప్రయత్నిస్తాను 
నువ్వు నన్ను చూసిన చూపుల ముక్కలేమైనా దొరుకుతాయేమోనని 

అంత ఎత్తున నిలబడి 

ఒక్కోసారి పసిపిల్లలా పాకుతూ 
ఇంకోసారి పడుచుపిల్లలా ఉరకలేస్తూ 
మరోసారి ఎవరో తరుముతున్నట్టు పరిగెత్తుతూ 
నన్ను ఒరుసుకుంటూ పోయే గాలిని 
చేతులు బార్లాజాపి వడకట్టేందుకు ప్రయత్నిస్తాను 
నీ మాటల సరాలేమైనా తేలుతూ వస్తాయని 

కరిగిపోయిన కాలాల్నీ

కదిలిపోతున్న క్షణాల్ని 
మాసిపోయిన గోడల మధ్య అల్మారాలలో 
మగ్గిపోతున్న ఎప్పటివో అనుభవాలనూ 
మస్తిష్కంలోకి బలవంతంగా నెట్టి
వడకట్టేందుకు ప్రయత్నిస్తాను 
నువ్వు పంచిన అనుభూతులేమైనా ఏరుకోవచ్చని 

వడకట్టగా వడకట్టగా

అన్నిటిలోనూ నేనే కనిపిస్తున్నప్పుడు 
ఒక్కసారి ఆగి కాసేపు కూర్చుని ఆలోచిస్తే
నువ్వు కనపడాలంటే 
నన్ను నేను వడకట్టుకోవాలని తెలుస్తుంది 

Tuesday, November 19, 2013

**శృంగారాలు - 3**

చీకటి పడగానే
మనకొక తెల్లవారుజాము
ఒళ్ళు విరుచుకుంటూ
ప్రేమ వర్ణపు సూర్యోదయాన
నీ కనుచివరలకంటుకున్న చీకటి
అసంకల్పిత కదలికల వెలుగులో
కరిగిపోతుంది

వయసు నడి మధ్యాహ్నపు నిట్టూర్పుల సెగలో
వలపు కార్మికుల్లా చెమటోడ్చుతూ
ఒకరిలోకొకరు తవ్వుకుంటూ పోతాం
ఒకరికొకరు దొరికేంతవరకూ
ఎంతదాకైనా

**ఓటమి కథ**

ఎప్పుడయినా వీలున్నపుడు
లేదా ఒక్కోసారి వీలు చేసుకుని

శ్మశానానికి వెళ్తాను
మట్టిలో కలిసిపోయి
శిధిలమైపోయిన ఎన్నో కథలుంటాయక్కడ
ఓటమి కథలుంటాయక్కడ

ఆ కథలన్నీ వింతైన పరిమళాలుగా మారి
అక్కడక్కడే తిరుగుతుంటాయి
అవక్కడుంటాయని కాటికాపరిక్కూడా తెలీదు కాబోలు
చచ్చినోళ్ళకాడికి బతికున్నోడికేంపనీ అన్నట్టు
నువ్వేంది సామీ ఇట్టా వత్తావంటూ
అడుగుతాడు


వాడికి సమాధానంగా ఒక చిన్న నవ్వు నవ్వుతాను
అక్కడ నేను పీల్చుకున్న కథలన్నీ వాడికి చెబితే
నా తల వేయి వ్రక్కలవుతుందేమోనని భయం నాకు
ఆ కథలనలాగే మోస్తూ తిరుగుతాను

వాటిల్లో నాదో కథ
అయితే ఇంకా నేనెవరికీ చెప్పలేదు
చెప్పను

Saturday, November 16, 2013

The winged Bird

See
A bird comes towards you
All the time
With its wings made of clouds
Grey and white
It recites the sky's message
Can you hear that?
If you do not
Try to befriend it
Feed it with some sweet words
It gives you eternity
The poetry

Saturday, November 2, 2013

In to the Blue

Lets get in to the Blue
Unconditional Blue
What ever you think it is 
What ever I think it is 
We are in blue
We were shot at each other 
In to the Blue

Friday, August 16, 2013

**శృంగారాలు-2**

వయసొక నిప్పుల కుంపటి 
అదేమిటో
దూరంగా వెళ్లిపోదామంటే 
అలా వెళ్ళేకొద్దీ కాలుస్తుంది

నడిరాతిరి నెగళ్ళ పొంగులు 

విరగపూచే ఎర్రెర్రని పూలు 
విరిసే అలవిగాని అలుపులు 
అందనివనుకున్నవన్నీ అందే క్షణాలు 

కడివెడు దాహాల్ని కడలి మొత్తంగా వచ్చి 

కడవరకూ తీరుస్తూనే ఉంటుంది

Tuesday, August 13, 2013

**శృంగారాలు-1**

నీ నుదుటిపైని కాసంత బొట్టు 
నా నుదుటిపైన కురిస్తే 
వలపు జడికి తాళలేక 
నన్ను నువ్వు కప్పుకుని 
మనిద్దరినీ నీ పమిట కప్పినా 
లాభం లేకపోయింది 
లోపలా బయటా మత్తెక్కించే వెచ్చటి చలి

వత్తిడికి తట్టుకోలేని గుండెలు 

తలుపులు బాదుతున్నట్టు గోల 
నీ ఉదర వైశాల్యంపై 
నా మునివేళ్ళ ముసుగులు వేసుకున్న కోరికల గుర్రాలు 
ఆకలాకలంటూ కలయతిరిగాయి

ఓ తుంటరి పిల్లా 

నీ గోళ్ళు 
నాలోకి దిగిన చురుకు కూడా తగలని మగత 
వెచ్చటి వర్షం 
రాత్రంతా కురుస్తూనే ఉంది 

ఓ మబ్బుకళ్ళదానా 

తెల్లారేసరికి మెల్లగా జారుకున్నావేం

Tuesday, July 23, 2013

**మా ఊరి ఏటి గట్టు**

బస్సు దిగి ఇప్పటి ఏ ఇంజనీరూ వేయలేని 
గట్టి మట్టిరోడ్డుపై 
అటుపక్కా ఇటుపక్కా 
దట్టంగా పెరిగిన కంపచెట్లు 
గుబురుగా పెరిగిన 
కల్లీ మానుల వంక 
గుబులుగానే చూసుకుంటూ 
నిమిషాల ముల్లు 
రెండంకెలు దాటేలోపు వస్తుంది 

ఇటు ఊర్లో నుంచీ బయలుదేరితే
ఎలిమెంటరీ స్కూలు 
దాని వెనుక పెద్దపెద్ద రావి వేప చెట్లు 
తోవకు అటూ ఇటూ 
ఒక మూడు నాలుగు అడుగుల పల్లంలో 
ముచ్చటగా కట్టుకున్న 
చిన్న చిన్న గుడిసెలు 
తొంభై డిగ్రీల కోణంలో 
మలుపు తిరిగే ముందు 
మొండి గోడలు అంటే ఏంటివో 
నాకు తెలిసినప్పటినుంచీ 
అలాగే ఉన్న పంచాయితీ ఆఫీసు దాటుకుని 
దూరంగా కనిపించే 
మామిడి తోపుల్లో 
చిన్నప్పుడు గడిపిన జ్ఞాపకాల గాలి 
నాతో మా ఊరి విరహపు బడలికను తీర్చితే 
తరువాత వచ్చే మా చింత తోపును 
దాటుకుని 
వంద అడుగులేస్తే వస్తుంది 
మా ఊరి ఏటి గట్టు 

పేరుకు తగ్గట్టే
బంగారు ఇసుకను మోసుకొస్తుంది 
సువర్ణముఖి 
పొంగి పొర్లుతుండగా 
నట్టనడిమధ్యలో ఎద్దులబండి 
బండిపై జనంలో 
అమ్మతో పాటు నేను 
అందరికీ ప్రళయ భయంకరంగా కనిపిస్తే 
నాకు మాత్రం వెంట్రుకలు విరబోసుకుని 
పకపకా నవ్వుతూ సాక్షాత్కరించింది 

ఏటి ఇసుకలో
కావాలని 
ఏకాంతంగా నేనొక్కడినే 
ఆడుకున్న రోజులు కొన్నే 
ఇసుకతో గూళ్ళు కట్టి 
చల్లటి ఆ గూళ్లలో 
అప్పటి మాటేమోగానీ 
ఇప్పటికీ నన్ను నేను 
విశ్రమింపజేసుకుంటూ ఉంటాను 

ఆకాశంలోనుంచీ ఉబుకుతూ
శూన్యంలోనికి ప్రవహిస్తున్నట్టుండేది 
ఏటి గట్టు అంచున నిలబడి 
అటూ ఇటూ చూస్తే 
అది నాకొక పెద్ద ఫిలాసఫీ

ఏటి గట్టు అందం 
రాత్రి వేళదే 
అద్దం కరిగి పారుతున్నట్టు 
ఏరు మెల్లగా ప్రవహిస్తుంది 
గులకరాళ్లు నీళ్ళలో 
బుడుంగున పడతాయి 
ఒక కప్ప గభాలున దూకుతుంది 
మిగితావి బెకబెకమంటూ 
హడావిడి చేస్తాయి 
శీతల నిశ్శబ్దం పొరలు పొరలుగా 
విచ్చుకుంటూ ఉంటుంది 

అప్పుడది కీచురాళ్ళ రొదకాదు 
సంగీతం 

అప్పుడవి మిణుగురులు కాదు 
గగన దీపాలు 
వాటిని చూస్తే చంద్రుడు కూడా 
భూమిపై చుక్కలు పుట్టాయని 
భ్రమపడతాడు 

గాలికి ఊగుతూ
గట్టుపై దుబ్బుగా పెరిగిన 
తుంగలు వేణునాదం చేస్తాయి 
ఇవన్నీ ఏటిగట్టుపైనే 

అనుభవాలు కొన్నే 
అనుబంధం మాత్రం 
మా ఊరి కొండంత 
కొనలేనంత 
కొన లేనంత 
మా ఊరి ఏటి గట్టు 
నాలోనూ ఉంది 
చిన్ననాటి గురుతులను తన మీదుగా ప్రవహింపజేసుకుంటూ

Tuesday, July 16, 2013

**పిల్లప్పటి రోజులు**


చిల్ల పెంకులను 
గుండ్రంగా చెక్కి 
ఒక గుడ్డ సంచిలో వేసుకుని 
అవే డబ్బులనుకుని 
సంబరపడిన రోజులు 


దట్టంగా పందిళ్లు కట్టిన 
చెట్ల మధ్య దారిలో 
అందంగా కిందకు దిగిన
ఏవో లతల తీగల్ని 
నేర్పుగా తప్పుకుంటూ 
పరుగులెత్తిన రోజులు 


ముచ్చటగా నవ్వే 
గడ్డి పూలను 
పేర్లు తెలీని రంగురంగుల పూలను 
గుత్తులుగా కోసుకుని 
గుప్పిళ్లనిండా పట్టుకుని 
పొలాల గట్ల తిరిగిన రోజులు 


తెలిసిన వారి తోటలో 
పిల్లనేస్తాలతో కలిసి 
చిలక కొరికిన మామిడిపళ్లను 
అరమగ్గిన వాటిని 
కోరి ఏరుకుని 
రాయిపై పెట్టి పగలకొట్టుకుని 
పంచుకుని తిన్న రోజులు 


చింత తోపుల్లో పడి 
పచ్చికాయలను రాలగొట్టి 
ఉప్పు కారం కలిపి 
నలగ్గొట్టి 
అరచేతిలో ముద్దలుగా 
పట్టుకుని 
మనసారా చప్పరించిన రోజులు 



దేవతకు టెంకాయ కొట్టుకురావడానికి 
అడవిదారిన కొండకు వెళ్ళి 
అమ్మో ఎలుగుబంటి అని 
ఎవరో అల్లరిగా అరిస్తే 
కన్నూ మిన్నూ గానక 
పిచ్చి పరుగులెత్తి 
కాళ్ళల్లో ముళ్ళు దింపుకుని 
ఎక్కడో ఒకచోట 
రాళ్ళు తగిలి 
కిందపడి 
ముక్కూముఖం ఏకం చేసుకుని 
మోకాళ్ళు మోచేతులు 
పగులగొట్టుకుని 
ఎలాగో ఇంటికి చేరిన రోజులు 


మా తాతల తాతలంత 
వయసుండే వేపచెట్లకు 
రావిచెట్లకు 
మందపాటి మోకులుకట్టి 
వాటికి బలమైన కర్రను కట్టి 
అటొకరు ఇటొకరు 
ఎదురెదురుగా నిలబడి 
వేగం తగ్గకుండా 
ఒకరి తరవాత ఒకరు 
కూర్చుంటూ లేస్తూ 
తొక్కుడు ఉయ్యాల ఊగిన రోజులు 


అలా ఉయ్యాల ఊగుతుంటే 
దూరంగా వెళ్ళేకొద్దీ దగ్గరయినట్టు 
దగ్గరయ్యేకొద్దీ దూరమయినట్టు 
కనిపించే కొండల్ని 
కళ్ళు పెద్దవి చేసి 
ఆశ్చర్యంతో చూసిన రోజులు 


9
అయ్యవారి కొడుకనే అభిమానంతో 
కట్టెలు కొట్టుకురావడానికి 
కొండకు వెళ్ళిన వాళ్ళు 
విత్తనాల అరటి పళ్ళు తెచ్చిస్తే 
ఇష్టంగా తిన్న రోజులు 

10 
అప్పుడు మా పిలకాయల 
తలకాయంత ఉన్న 
అడవి సీతాఫలాల్ని 
సగానికి తుంచి 
అందులో ముఖం దూర్చేసి 
గుజ్జునొకవైపు జుర్రుకుంటూనే 
ఇంకోవైపు విత్తనాలను 
బయటకు ఊసేస్తూ 
తిన్న రోజులు 

11 

పచ్చి పెసలు, పచ్చి అలసందలు 
పచ్చి బెండకాయలు, పచ్చి జొన్నలు 
పచ్చి రాగులు, పచ్చి కందులు 
ఒకటేమిటి ప్రకృతిచ్చే 
పచ్చి రసాలన్నింటినీ 
పకడ్బందీగా జుర్రుకున్న రోజులు 

12 

సీమ చింతకాయలకోసం వెళ్ళి 
రాయితో గురి చూసి కొట్టి 
రాలిన కాయలను ఏరుకుంటూ 
అటునుంచీ 
మరెవరో విసిరిన రాయి 
సూటిగా నుదుటికి తగిలి 
రక్తం ధారలుగా కారినా 
చేతికందిన ఆకులు నలిపి 
కట్టుకుని ఇంటికి చేరి 
నాన్న తిరిగి ఈతబర్రతో 
నాలుగు పీకితే 
ఏరుకున్న కాయలను అలా 
ఒక మూలకు విసిరేసి 
అలిగి 
ఇంకోమూలన నక్కి కూర్చున్న రోజులు 


వంద జీవితాలకు సరిపడా 
అనుభవాలను ఇచ్చిన రోజులు 
కరిగిపోని కలలాంటి 
జ్ఞాపకాలను మిగిల్చిన రోజులు 


ఇవి 
నా పిల్లప్పటి రోజులు

Wednesday, May 22, 2013

**సంధ్యా కాంత**

ఆమె స్నానం చేసి  తీరికగా తలారబెట్టుకుంటోంది 
తన కళ్లలోని సంధ్యను చూసి 
మైకం కమ్మిన సూర్యుడు  
సముద్రంలోకి జారిపోతున్నాడు 

చిక్కటి చీకటి చీర కట్టుకొచ్చి 
ప్రకృతిని మొత్తం తనతో తీసుకొచ్చి  
నా పక్కన కూర్చుంది 

తన వెలుగులో  
నేను మలిగిపోయాను 

Saturday, April 27, 2013

----అ"ద్వితీయం"----

సముద్రం లాగా ఆమె
లోపలెంత అలజడి ఉన్నా
బయట అంతా ప్రశాంతం

అప్పుడప్పుడూ మాత్రమే తన
 కళ్ళల్లో
తుపానులు రేగుతూ ఉంటాయి
వాటన్నిటినీ చీర కొంగులో
మెల్లగా 
దాచేసుకుంటుందామె

మళ్ళీ
తన కళ్లలోని ఆకాశాలు 
నిర్మలమవుతాయి
పసి చిరునవ్వొకటి 
పెదాల పైకి పారాడుతుంది

అదొక రెండవ ఉదయం 

తన ప్రపంచానికీ
ఆ ప్రపంచంలో తిరుగాడే 
నాకు

Friday, April 26, 2013

**కృష్ణ జ్వాల**

అది కనబడనందుకేమో
నేను దానిని
కృష్ణ జ్వాల
అని పిలుచుకుంటాను

వెలుగుతున్నట్టు
కంటికి కూడా తెలియకుండా
ఆవలి తీరాల గట్టును
దర్శింపజేస్తుంది
చీకట్లో చీకటిగానే
జ్వలిస్తూ

Thursday, March 14, 2013

**సముద్రం**

ఎప్పుడైనా సముద్రాన్ని చూడటానికి వెళతాను
ఎలాఉన్నావంటూ తను
నా పాదాల కింద ఇసుకను తడిపి
నన్ను చల్లబరుస్తూ

నేను మాత్రం ఎప్పుడూ ఒకటే ప్రశ్న అడుగుతాను తనను
నువ్వు నాలో ఉన్నావా అని
నీలో లేకపోతే నీ కళ్ళముందు కూడా లేను
ఇదీ తన సమాధానం

అన్ని నీళ్ళు ఒక్కసారి చూస్తే
నాకెందుకో కళ్ళు చెమరుస్తాయి
సముద్రానికి దగ్గరగా కూర్చుని
బిగ్గరగా ఏడవాలనిపిస్తుంది

నాలోని హిమానీ నదాలు కరిగి ప్రవహించనీ
కరిగిన పై పెంకులనుండీ తెల్లటి కిరణాలు ప్రసరించనీ
నన్ను వెచ్చబరచనీ

నన్ను నేను తేల్చుకుంటూ
సముద్రం వైపు
మళ్ళీ అదే ప్రశ్నతో
నువ్వు నాలో ఉన్నావా అని
తిరిగి అదే సమాధానం
నీలో లేకపోతే నీ కళ్ళముందు కూడా లేను అని
నేను సముద్రాన్ని ప్రేమిస్తున్నాను
నాకు తనంత ప్రేమ కావాలి

Wednesday, March 13, 2013

**ఆమె**


కాలం కొట్టిన కొరడా దెబ్బలకు
చీరిపోయిన
వీపులాంటి ముఖం
కనీసం ముట్టుకోలేని
అరచేతులలో దాచుకుని
చితికిపోయిన ఆశల
కన్నీళ్లు
మసకబార్చిన లోకాన్ని
అసహనంగానే చూస్తూ
వేచియున్నాను
కాసింత ప్రేమకోసం
ఆలంబన కోసం
కొండంత సాంత్వననిచ్చి
భుజంతట్టే చేతుల్లాంటి మాటలకోసం
అంటుంది ఆమె నాతో

మట్టిలోకి నీళ్ళింకినట్టు
నేనామెను నాలో పొదుపుకుంటాను
పరిమళం గాలిని చుట్టేసినట్టు
నేనామెను హత్తుకుంటాను
తల్లి బిడ్డను కాచుకున్నట్టు
నేనామెను దాచుకుంటాను
ముళ్లపైబడిన
మందారపూవును
కుట్లువేసి భద్రపరచుకుంటాను
పొడిబారిన పెదవులపై
నెలవంకనొకటి దిద్ది
మురిపిస్తాను
తనను మళ్ళీ నడిపించుకుంటాను
పరిగెత్తనిస్తాను
మళ్ళీ తన అడవిలోకి
తనను వెళ్లిపోనిస్తాను

Friday, March 1, 2013

**బెత్తం దెబ్బలు**

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవమట
ఇదికూడా అర్థం కాని జనాలు, 
ఆ జనాల పిల్లలూ ఉన్నారిక్కడ
పొరుగింటి పుల్లకూర రుచేకానీ 
సొంత ఇంటి పప్పూ, పచ్చడీ ఆరోగ్యమే
మూతడు తాగండి చాలు అంటే 
సీసామొత్తం తాగి జోగుతున్న మూర్ఖులకు 
ఏం చెప్తే, ఎలా చెప్తే అర్థమవుతుంది
ప్రత్యేక మంత్రిత్వ శాఖ, మండలి పెడితే చాలదేమో
అయ్యవార్లకు మళ్ళీ బెత్తాలు సరఫరా చేయండి
వీపు విమానం మోతలు మోగితే
అమ్మా అని తెలుగులో అరిచినపుడు తెలుస్తుంది 
మాతృభాష అంటే మనలో ఇంకినదని
పైపైన పూసుకున్న పూత కాదని

**పిరికిపందలు**

ఒరేయ్ ఒరేయ్ ఒరేయ్
ముఖం చూపించలేక 
ముసుగులేసుకు తిరిగే 
పిరికి గొడ్లు మీరు

నలుగురూ నిలిచే చోట

మర్యాద మరిచి నడిచే
సంస్కారహీనులు మీరు

మీ చరిత్ర నెత్తుటి మరకలు

మీ లక్ష్యం మారణహోమం
దానికి యుద్ధమని ఓ నెపం

ఆదమరిచిన వేళ
దొంగచాటుగా దెబ్బతీసే 
మగతనం లేని 
మరుగుజ్జు మనస్తత్వాలు మీవి

వేల యేళ్లుగా ఇంకో దేశంపై దండెత్తని

శాంతి కాముకత భారతీయం

మంచితనం మౌనంగానే ఉంటుంది

కానీ మౌనం నివురుగప్పిన 
ప్రళయ భయంకరమని మీకు తెలీదులే


మంచితనమంటే చెడును కూడా సహించడమే కాదు 
సమయమాసన్నమైనపుడు 
దాన్ని తెగనరకడం కూడా

ఎక్కడికి పోతారు....?

ఈ ప్రపంచం చాలా చిన్నది

Thursday, January 24, 2013

**జాంచెట్టు **

నా చిన్నపుడెపుడో
ఆ కొమ్మను
మా ఇంటిపక్కన నాటేటప్పుడు
అది జాంచెట్టు అని
నాకు తెలీదు

అది నాతోపాటు పెరిగే క్రమంలో

దానికిందే ఆడుకున్నాను
బడికి పోయేముందు దానికోమాట చెప్పి వెళ్ళేవాడిని
బడికి పోయిరాగానే అక్కడి కబుర్లు మాట్లాడేవాడిని
అన్నిటికీ చక్కగా తలూపేది 
ఆకులను గలగలలాడిస్తూ

అమ్మ తిట్టినప్పుడు

నాన్న కొట్టినప్పుడు
నేస్తాలతో ఆటలాడో
పోట్లాడో అలసినప్పుడు
నాకదే నీడ

నేను అలిగితే ఎక్కడుంటానో

ఇంటిల్లిపాదికీ ఎరుక

ఏ కష్టమొచ్చినా

ఎంతటి బాధ కలిగినా
దాని కిందకు వెళ్లి
మొదలునానుకుని కూర్చుంటే
ఓదార్పుగా 
భుజంమీద చేతులేసినట్టు
ఓ అయిదారు పండుటాకుల్ని
రాల్చేది


అప్పుడనిపించేది నాకు
ఎంత పచ్చటి ఆకైనా
పండుపడి
పసుపుబడి
తొడిమ విరిగి రాలిపోయినట్టు
ఎంత కష్టమైనా
ఎప్పుడో ఒకప్పుడు
తొలగక మానదని
మనం చెట్టులాగా 
నిబ్బరంగానే ఉండాలని

నాలుగు పెద్ద కొమ్మలతో

కొమ్మకో రకం కాయలు కాసేది
వాటిలో ఒక కొమ్మకు మాత్రం
తేనెలూరే తియ్యటి కాయలు కాసేది

ఆ కొమ్మపై
నాకిష్టమైన అమ్మాయి పేరు చెక్కానని
తనకు కూడా తెలుసేమో

నేను ఆ కొమ్మకు కాసిన
జాంపండు తినేదాకా ఆగి
తిన్న తరువాత 
నా పెదవులకంటిన
కాస్త తియ్యదనం కోసం
నా ప్రియురాలు పడే తపన చూస్తే
అర్థమయ్యేది
ఆ కొమ్మ కాయలెంత తీయనో
నా జాంచెట్టు మనసెంత మెత్తనో

**లోపలి పిలుపు **

ఈ ప్రపంచపు 
నిద్రాణ స్థితిలోనుంచీ 
అప్పుడప్పుడూ 
నేను నాలోకి 
మేల్కొంటూ ఉంటాను 


లోపలంతా 
స్పర్శ కాని స్పర్శ 
వెలుగు కాని వెలుగు 
అలుముకుని ఉంటాయి 

ఆ లోపలి లోకాల సంచారానికి 

నన్నెవరో 
ఎగరేస్తూ తీసుకెళతారు 

నేను 

అడుగులో అడుగు వేసుకుంటూ 
ఘనీభవించిన అలల మధ్యన 
కాలిబాటలు ఏర్పరుస్తూ 
తిరుగుతాను 
వాగులోకి వంగిన 
కొబ్బరి చెట్టులా ఉన్న 
ఒక ఆకాశపు రెక్కపై కూర్చుని 
ఆకుపచ్చ తరంగంలా 
వ్యాపించే అడవిలో 
ఆడపిల్లల్లాంటి 
అందమైన అక్షరాలు 
ఆటలాడుకుంటూ 
అల్లరి చేస్తూ ఉంటే 
ఆ సందడిని చూస్తూ 
కాసేపు లాంటి 
చాలా సేపు 
అలా గడిపేస్తాను 

లీలగా
సంగీతాన్ని పలికించే 
అదృశ్య ఝరుల 
ఆలింగనంలో 
నా హృదయస్పందనా లయలను 
ఏకం చేసి 
ఎంతసేపు ఉంటానో తెలియదు 

చివరికి
ఏడు గుర్రాల గిట్టల చప్పుడు 
వినబడగానే 
దైనందిన సుషుప్తిలోకి 
జారిపోతాను 

మళ్ళీ 

నాలోకి మేల్కొనేంతగా
అలసిపోవడానికి 
సిద్ధమవుతూ

Monday, January 7, 2013

**ఊ.... కదులు**

అనవసరపు ఆలోచనల పందేరాల్లోంచీ 
వాస్తవికతలోకి 
అపజయాల వాకిళ్లయినా తెరువు 
ఎంతో కొంత నేర్చుకుంటావు

భౌతికమైన ఒంటరితనంలోంచీ 

తలచిన మాత్రంగా తోడు నిలిచే 
బాధల కష్టాల ఆనందాల అనుభవాల 
సందళ్ళలోకి దూకు 
కొంతైనా గట్టిపడతావ్ 
స్థిమితపడతావ్ 

రాయి తనంతట తాను కదలకపోయినా 

ప్రయత్నమాత్రంగా కదిలిస్తే కదులుతుంది 

నీలో జడత్వం పుట్టలు కట్టిందా
పద
గునపం పలుగూ పారా అందుకో

**ఎక్కడ.... ఎక్కడ.... ఎక్కడని....?**

కాలుష్య కవాటాలు తెరుచుకున్న 
రాత్రుళ్ళన్నీ 
కొండచిలువల్లా 
చుట్టేసి నలిపేసి 
కమ్మేసి మింగేయడమే

తీవ్రవాద తుపాకుల తూటాలకూ 

మతవాదుల మాటల రాళ్లకూ 
తెల్లవారుజాములన్నీ 
భళ్ళున పగిలి 
చెల్లాచెదురైపోయి 
పిట్టలన్నీ సగం చచ్చి సగం ఎగిరిపోవడమే 

నీతి న్యాయాలను వదిలేసిన లోకం 

నీతిమాలిన మురికిని కట్టుకుని 
మసకబారి కంపు కొట్టడమే 

ఎక్కడని వెదకను తెల్లటి శాంతిని

**పుట్టుకలూ మరణాలూ**

పుట్టినప్పుడు అచ్చంగా నువ్వొక్కడివే
నీలో నువ్వే నవ్వుకుంటూ
ఏడుస్తూ

నీ ఊహ నీకు తెలుస్తున్న కొద్దీ 
నీలో మళ్ళీ నువ్వు పుడతావు
ఒక కొత్త సంఘటనను చూచినపుడు
ప్రకృతి ఒడిలో సేదతీరినపుడు
అమ్మ దగ్గరకు వెళ్ళిన ప్రతిసారీ
ఒక అద్భుతమైన అందం  
పొంగి పొరలుతున్న అమ్మాయిని చూసినపుడు
స్నేహితులను కలిసిన ప్రతిక్షణం
అడుక్కుంటున్న పసి పిల్లవాళ్లనో
చీకట్లో ఏదో గుద్దేసి
చనిపోయిన కుక్కనో
ఇంకేదో జంతువునో
చూసినపుడు

ఒంటరి రాత్రుల నిశ్శబ్దంలో 

ఒక్కడివే కూర్చుని గడిపినపుడు
నీలో కొత్తగా నువ్వు పుడుతూనే ఉంటావు

దీపపు కుందెలో 

నూనె ఉన్నంతవరకూ మండి
చివరకు కొండెక్కే దీపంలా
వాటివాటి ప్రభావాలు అయిపోంగానే
ఫలానా నువ్వు అంతర్థానమైపోతావు

కొన్ని ప్రభావాలను నీకు నువ్వే 

సమాధి చేయవలసివస్తే చేసేసి
ఆ ఫలానా నిన్ను చంపేసుకుంటావు
నూనె అయిపోకుండానే
కొండెక్కకుండానే
మధ్యలోనే ఊదేసి
ఆర్పేసినట్లు

కానీ దీపపు కుందె అదే 

మళ్ళీ కొత్త నూనె
కొత్త వత్తి
కొత్త వెలుగు
అదే కుందెలో
ఎన్నో దీపాలు వెలిగి ఆరిపోతాయి

నీలో చాలా సార్లు చాలా రకాలుగా

నువ్వే పుట్టి గిట్టినట్టుగా
దీపపు కుందె పగిలిపోయేంతవరకూ

ఇన్ని పుట్టుకలనూ మరణాలనూ 

నీలో నువ్వు దర్శించుకున్నప్పుడు
భౌతిక మరణానికి ఎందుకు భయపడతావో 

నాకు అర్థం కాదు