Right disabled

Thursday, August 30, 2012

**నే నడిచిన దారి**


ఒక్కసారి
వెనక్కి తిరిగి చూసుకుంటే

నేను అభిమానించిన కళ్ళు
కురిపించిన
అలుసుదనపు చూపులు
దారినిండా పడున్నాయి

పిలిచిన వెంటనే
ముందువెనుకా చూసుకోకుండా
తనకోసం పరుగెత్తి
బొటనవేళ్లు చిట్లిన గాయాలు
అలాగే పచ్చిగా ఉన్నాయి

కారిన రక్తపు మరకలు
అలాగే నేలకంటుకుని ఉన్నాయి

అందరికన్నా
నువ్వే నాకు ఎక్కువని
తను చెప్పిన
అబద్ధాల పలుకులు
పదునైన ములుకులై
దారిపొడుగునా
నా కాళ్ళను గుచ్చుతూనే ఉన్నాయి

ప్రేమించి ప్రేమించి
ప్రేమకోసం తపించి
నీరసించి
సొమ్మసిల్లిన
నా మనసుపై
తను విదిల్చిన
రెండు చెమట చుక్కలు
ఆ నిజంలోని
నిష్టూరపు ఉప్పదనాన్ని
రుచి చూపిస్తూనే ఉన్నాయి

నా చేతిపై చెక్కుకున్న
తన పేరులోని అక్షరాలు
నేను తనపై పెంచుకున్న
మమకారం తగిలినప్పుడల్లా
ఎర్రగా కందుతూ ఉంటాయి

కానీ
నాకు ప్రేమపై
నమ్మకం పోలేదు

మనసుతో ప్రేమించానే గానీ
మనసున్న మనిషిని ప్రేమించలేదేమో

అందుకే ఇంకా వేచి చూస్తూ

నా ఎదురుచూపుల
తివాచీలు పరిచాను

నను ప్రేమించే ప్రేమకోసం

Wednesday, August 29, 2012

**సంయుక్తాక్షరం**

అదొక సంయుక్తాక్షరం
ముగురమ్మల మూలపుటమ్మలా
మూడింటి సంగమం

మూర్తీభవించిన
మాతృత్వం

పోతపోసిన
సౌందర్యం

అలవిగాని
మార్దవం

ఇదీ అని చెప్పలేని
అద్భుతతత్వం

ప్రకృతి మొత్తాన్నీ
తనలో నింపుకున్న
అర్థం

ప్రేమకు మరో రూపం
శక్తిని పోలిన అస్థిత్వం

చిరు అక్షరం
భావం అద్భుతం

రాసేముందు
రచయిత సందేహిస్తాడు

ఊహించేముందు
కవి ఆలోచిస్తాడు

గీసేముందు
చిత్రకారుడు
ఒక్క క్షణం ఆగుతాడు

మలచేముందు
శిల్పి తనను తాను
తరచి చూసుకుంటాడు

ఆ అక్షరంలోని ఆంతర్యాన్ని,
అంతరార్థాన్ని
సంపూర్ణంగా అందుకోగలమా అని

ఆ అక్షరం
"స్త్రీ"

Monday, August 27, 2012

**ఎంత కష్టపడతాడో**

ఎంత కష్టపడతాడో కవి
భావాల గర్భాల్ని మోస్తూ
పండంటి కవితలను కనడానికి
మనసును మెలిపెడతాడు
హృదయాన్ని రాయి చేసుకుంటాడు
ఒక్కోసారి చెప్పలేనంత
మృదువుగా మార్చేసుకుంటాడు
ఆవేదనలను ఆనందాల్ని
కష్టాల్ని సుఖాల్ని
ఆకలిని ఆహారాన్ని
దిగంబరత్వాన్ని అంబర శ్రేణిని
మంచిని చెడుని
నవ్వును ఏడుపును
ఆత్మను దేహాన్ని
పంచభూతాలను
అరిషడ్వర్గాలను
శృంగార హాస్య కరుణ
వీర రౌద్ర భీభత్స
భయానక అద్భుత శాంతములనే
నవ రసాలను
అష్టవిధ శృంగార నాయికల
హావభావాలను
తన కలంలో నింపేసుకుంటాడు
ఆ కలాన్ని కాగితం పై
గురి పెట్టి
సిరా శరాలను వెల్లువెత్తిస్తాడు
అన్నీ తనలోకి లాగేసుకునే
బ్లాక్ హోల్ లా
కనిపించే ప్రపంచంతో పాటు
కళ్ళకు కనిపించని
ఊహాలోకాల సమస్త అనుభూతులనూ
తనలోకి ఇముడ్చుకుంటాడు
అంతు చిక్కని డార్క్ మాటర్ లా ఉంటాడు
సూపర్ నోవాలా
ఒక్కసారిగా వెలుగులను
వెలువరిస్తాడు
ఎంత కష్టపడతాడో కవి
భావాల గర్భాల్ని మోస్తూ
పండంటి కవితలను కనడానికి

**ప్రణయ దేవత**


తన కనుబొమల మధ్యలో
సూర్యుడుదయిస్తాడు
తను ఎదురైన ప్రతిసారీ
నాకు సూర్యోదయమే

తన నవ్వుల్లో
చంద్రవంకలుంటాయి
తను నవ్విన ప్రతిసారీ
వెన్నెలే

తన కళ్ళలో
వాడి బాణాలుంటాయి
తను చూసిన ప్రతిసారీ
గుండెల్లో తియ్యగా నాటుకుంటాయి

తన నడకలో
హొయలుంటుంది
తన నడక చక్కదనానికి
హంసలు కూడా చిన్నబోతాయి

తన స్పర్శలో
మార్దవముంటుంది
తను తాకితే
పట్టులా ఉంటుంది

తన మాటల్లో
సెలయేళ్ళుంటాయి
తను మాట్లాడితే
గమ్మత్తైన గలగల

తన పెదవుల్లో
కెంపులుంటాయి
తన అధరాలు
కదిలితే మెరుపులే

తన ప్రేమలో
దివ్యత్వముంటుంది
తను నాకు
ప్రణయ వరాలు కురిపించే దేవతే

**మట్టి వాసన**

తొలకరి చినుకులు
నేలబడగానే
గుప్పుమంటూ
మనసును కప్పే
మట్టి వాసన

కమ్ముకొస్తున్న
మబ్బులతో
అమ్మతనపు చెమ్మ
మట్టి వాసన

శ్రమ సౌందర్యపు
చెమట గంధపు
పరిమళాలు చిలికే
మట్టి వాసన

దుమ్ము పట్టిన
బాల్యస్మృతులను
కడిగి తడిమే
మట్టి వాసన

ఎప్పటికప్పుడు
పుడమి తల్లి
పూసుకునే
కొత్త అత్తరు
మట్టి వాసన

కొత్త పుట్టుకకు
అందమైన మార్పుకు
అనుగు అర్థం
మట్టి వాసన

**అలుసుగా చూడకు**

అలుసుగా చూడకు ఆడదాన్ని
నమ్మి నీవెంట వచ్చే నీ దాన్ని

అలక్ష్యం చేశావో
అంతవరకు నిను పరిమళాలతో
అలరించిన పూవుల అంచుల్లో
నిప్పురవ్వలు పూస్తాయి

అంతవరకు నీపై
ప్రేమను వర్షించిన ఆ కళ్ళు
భుగభుగలాడే లావా కురుస్తాయి

అంతవరకు నీ చేతికి
పట్టులా తగిలిన స్పర్శ
ముళ్ళపట్టీగా మారి
నిను గుచ్చేస్తుంది

అంతవరకు నిను కవ్వించిన
వలపు గాలి
వడగాడ్పై నిను ఆర్చేస్తుంది

అంతవరకు నీకు
తోడుగా నీపక్కన నడిచిన
సుతిమెత్తని అడుగులు
ప్రళయకాల పదఘట్టనలై
నిను నేలమట్టం చేస్తాయి

అంతవరకు నిను
ఆరాధించిన చల్లని మనసు
ప్రణయాగ్నికి ఆజ్యమై
దహించివేస్తుంది

అంతవరకు నువు
నిర్మించుకున్న ఆశల సౌధాలు
నీ మీదే విరుచుకుపడతాయి

అంతవరకు నీలో
విరిసిన వసంతం మాయమై
మోడు మ్రాకుల ఎడారి
నీముందు సాక్షాత్కరిస్తుంది

అబల కాదది సబల
ఆడది కాదది ఆదిశక్తి
నీకు అన్నీ తానే అయ్యే ఆత్మశక్తి

అందుకే
అలుసుగా చూడకు ఆడదాన్ని
నమ్మి నీవెంట వచ్చే నీదాన్ని